ETV Bharat / state

కల్తీ నెయ్యి తయారీలో మరో ఘోరం - లడ్డూ ప్రసాదంలో టాయిలెట్‌ క్లీనర్‌లో వాడే లబ్సా కెమికల్స్‌

కల్తీ నెయ్యి సరఫరా కేసులో వెలుగులోకి సంచలన విషయాలు - భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు వివిధ రసాయనాలు కొన్నట్లు సిట్‌ దర్యాప్తులో వెల్లడి, లబ్సా అనే రసాయనాన్ని తయారీలో వినియోగించినట్లు స్పష్టం

Toilet Cleaning Chemical Labsa In Tirumala Laddu
Toilet Cleaning Chemical Labsa In Tirumala Laddu (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 6, 2026 at 7:37 AM IST

3 Min Read
Choose ETV Bharat

Toilet Cleaning Chemical Labsa In Tirumala Laddu: వైఎస్సార్సీపీ హయాంలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో తవ్వే కొద్ది సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. లీనియర్‌ ఆల్కైల్‌ బెంజిన్‌ సల్ఫోనిక్‌ యాసిడ్‌ (లబ్సా) అనే రసాయనాన్ని ఈ ముఠా కల్తీ నెయ్యి తయారీలో వినియోగించినట్లు స్పష్టమవుతోంది. లబ్సాను వాషింగ్‌ పౌడర్లు, వాషింగ్‌ లిక్విడ్లు, డిష్‌వాష్‌ లిక్విడ్లు, ఫ్లోర్‌ క్లీనర్లు, టాయ్‌లెట్‌ క్లీనర్లు వంటి వాటి తయారీతో పాటు పారిశ్రామిక రంగంలో మిషన్‌ క్లీనింగ్‌ ఏజెంట్‌గా, ఆయిల్, గ్రీజు మరకలు తొలగించేందుకు ఉపయోగిస్తారు. పురుగుమందులు, క్రిమిసంహారకాల్లోని రసాయనాలు నీటిలో సమానంగా కలిసేలా చేయటంలో ఎమల్సిఫైయర్‌గా దీన్ని వాడుతారు. ఇది అత్యంత ప్రమాదకరమైన రసాయనం.

కల్తీ నెయ్యి తయారీలో మరో ఘోరం - లడ్డూ ప్రసాదంలో టాయిలెట్‌ క్లీనర్‌లో వాడే లబ్సా కెమికల్స్‌ (ETV)

కల్తీ నెయ్యి కేసులో మరో ఘోరం: తిరుమల శ్రీవారి కల్తీ లడ్డు మహా పాపంలో మరో ఘోరం వెలుగు చూసింది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో టాయిలెట్‌ క్లీనర్‌లో వాడే కెమికల్స్‌ కలిపారనే భయంకర నిజాన్ని సిట్‌ విచారణ బయటపెట్టింది. తిరుమలకు సరఫరా కోసం లక్షల కిలోల కల్తీ నెయ్యి తయారీ చేసిన భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు అందుకోసం వివిధ రసాయనాలు కొన్నట్లు సిట్‌ దర్యాప్తులో తేల్చింది. అందులో భాగంగా న్యూదిల్లీలోని అరిస్టో కెమికల్స్‌ నుంచి 8,900 కిలోల లాక్టిక్‌ యాసిడ్, లబ్సా/యాసిడ్‌ స్లర్రీ కొన్నారని అభియోగపత్రంలో పేర్కొంది. సాధారణంగా కల్తీ నెయ్యి తయారీదారులు పామాయిల్, పామ్‌కెర్నెల్‌ ఆయిల్‌ వంటి చౌకరకం నూనెలు నెయ్యిలా కనిపించేలా చేసేందుకు, అచ్చం నెయ్యిని పోలేలా రంగు, రుచి, వాసన, క్రీమినెస్‌ వచ్చేలా చేసేందుకు లబ్సా, లాక్టిక్‌ యాసిడ్‌ కలిపేసి వాడుతుంటారు.

రసాయనాలను కొన్న భోలేబాబా డెయిరీ: అదే విధంగా భోలేబాబా డెయిరీ సైతం ఒక్క చుక్క పాలైనా వాడకుండా పామాయిల్, పామ్‌కెర్నెల్‌ ఆయిల్‌లో వివిధ రసాయనాలను కలిపి తయారు చేసిన మిశ్రమాన్నే అగ్‌మార్క్‌ ఆవునెయ్యి పేరిట తిరుమల శ్రీవారి లడ్డూల తయారీ కోసం సరఫరా చేసిందని అభియోగపత్రంలో సిట్‌ వెల్లడించింది. కల్తీ నెయ్యి తయారీలో వాడేందుకు భోలేబాబా డైరెక్టర్లు పొమిల్‌ జైన్, విపున్‌ జైన్‌లు ఎక్కడెక్కడి నుంచి ఏయే రసాయనాలు కొన్నారో స్పష్టంగా వెల్లడించింది. దీన్ని బట్టి కల్తీ నెయ్యి తయారీలో వాడటం కోసమే భోలేబాబా లబ్సాను కొన్నట్లు స్పష్టమవుతోంది. కల్తీ నెయ్యి తయారీకి 57.56 లక్షల కిలోల పామాయిల్, పామ్‌కెర్నెల్‌ ఆయిల్‌తో పాటు 8.90 లక్షల కిలోల పరిమాణంలో ఎసిటిక్‌ యాసిడ్‌ ఈస్టర్, లాక్టిక్‌ యాసిడ్‌ ఫుడ్‌గ్రేడ్, మోనోగ్లైసెరైడ్స్‌ లబ్సా సహా వివిధ రకాల రసాయనాలను భోలేబాబా డెయిరీ కొన్నట్లు సిట్‌ దర్యాప్తులో గుర్తించింది.

పామాయిల్, పామ్‌కెర్నెల్‌ ఆయిళ్లతో బేటా-కెరోటిన్, ఎసిటిక్‌ యాసిడ్‌ ఫుడ్‌గ్రేడ్, మోనో గ్లైసెరైడ్స్‌ సహా పలు రసాయనాలు కలిపి కల్తీ నెయ్యి తయారు చేసినట్లు తేల్చింది. ల్యాబ్‌ల్లో పరీక్షించేటప్పుడు అది నెయ్యేనని తప్పుడు ఫలితాలు వచ్చేలా చేసేందుకు, నెయ్యి వాసన వచ్చేలా చేసేందుకు ఈ రసాయనాలను కలిపినట్లు అభియోగపత్రంలో వెల్లడించింది. ఈ రసాయనాల సరఫరాదారుల్ని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చింది. దీన్ని బట్టి లబ్సాను కూడా కల్తీ నెయ్యి తయారీలో వినియోగించినట్లు స్పష్టమవుతోంది. కల్తీ నెయ్యి తయారీలో వాడకం కోసం కాకపోతే ఒక సాధారణ డెయిరీకి వేల కిలోల లబ్సా కెమికల్‌ అవసరం ఏముంటుంది అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఆరోగ్యానికి చాలా హానికరం: భోలేబాబా డెయిరీ అరిస్టో కెమికల్స్‌ నుంచి లబ్సా కొన్నట్లు గుర్తించిన సిట్‌ దానిపై మరింత లోతుగా దర్యాప్తు చేయకుండా వదిలేయటం గమనార్హం. ఆయిల్‌ అండ్‌ పెట్రో కెమికల్స్‌ రంగంలో చమురుబావులను శుభ్రం చేయటానికి, డ్రిల్లింగ్‌ ఫ్లూయిడ్స్‌లో లబ్సాను వాడుతారు. వస్త్ర పరిశ్రమలో క్లీనింగ్, వెట్టింగ్‌ ఏజెంట్‌గా, ఫ్యాబ్రిక్‌ ప్రాసెసింగ్‌లో వినియోగిస్తారు. ఇది అత్యంత ప్రమాదకరమైన రసాయనం. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 ప్రకారం ఇలాంటి హానికర రసాయనాలను ఆహార ఉత్పత్తుల్లో వాడటం నిషేధం. నెయ్యి, పాలు సహా ఏ ఆహార ఉత్పత్తుల తయారీలోను లబ్సాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం.

లబ్సా కలిసిన నెయ్యిని వినియోగిస్తే జీర్ణాశయ సమస్యలు, కాలేయ సంబంధిత వ్యాధులు, పేగులకు గాయాలు వంటివి వచ్చే ముప్పుంది. దీర్ఘకాలంలో క్యాన్సర్‌ వంటి రోగాలు వచ్చే ప్రమాదముంది. మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన, ఆహార ఉత్పత్తుల తయారీలో నిషేధించిన ఇంతటి ప్రమాదకర రసాయనాన్ని కల్తీ నెయ్యి తయారీలో భోలేబాబా డెయిరీ వినియోగించినట్లు స్పష్టమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
తిరుమల పవిత్రత దెబ్బతీసేలా వ్యవహరించారు - ఉపేక్షించేది లేదు: చంద్రబాబు

క్షమాపణ అడగకుండా ఎదురుదాడి - భగవంతుడి ముందు మోకరిల్లే వరకు వదలం: పవన్‌కల్యాణ్‌