ETV Bharat / state

అటకెక్కిన స్మార్ట్‌సిటీ: అసంపూర్తిగా ఆగిపోయిన చాలా ప్రాజెక్టులు

2019లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పనులు ప్రారంభించినా వైఎస్సార్​సీపీ నిర్లక్ష్యం - అసంపూర్తి పనులు చేయడానికి రూ.405 కోట్లు అవసరం

Tirupati Smart City
Tirupati Smart City (EENADU)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 30, 2025 at 7:03 PM IST

3 Min Read
Choose ETV Bharat

Tirupati Smart City: తిరుపతిలో స్మార్ట్‌సిటీ మూలన పడింది. తిరుపతి నగరపాలక సంస్థ ఆర్థిక సుస్థిరత సాధించే లక్ష్యంతో కేంద్రం దీన్ని ప్రకటించింది. 2019లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పనులు ప్రారంభించినా తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్​సీపీ ఐదేళ్లలో రాష్ట్రం వాటా కింద పైసా కూడా విడుదల చేయలేదు. అప్పటికే ఖాతాల్లో ఉన్న సొమ్ములనూ ఊడ్చేసింది. దీంతో ప్రాజెక్టులన్ని అసంపూర్తిగా మిగిలిపోయాయి. ప్రస్తుతం వాటి పనుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కేంద్రం స్మార్ట్‌సిటీ పథకాన్ని రద్దు చేయడంతో ఆ ప్రాజెక్టులన్నీ దిష్టి బొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. అసంపూర్తి పనులు చేయడానికి రూ.405 కోట్లు అవసరం. టీటీడీ నుంచి స్మార్ట్‌సిటీ పథకానికి రావాల్సిన రూ.53 కోట్లు కూడా అందలేదని తెలుస్తోంది.

ఆగిపోయిన ప్రాజెక్టులు ఇవే

ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ రూ.180 కోట్లు, సిటీ ఆపరేషన్‌ సెంటర్‌ రూ.94.50 కోట్లు, మల్టీ లెవెల్‌ కార్‌ పార్కింగ్‌ సెంటర్‌ రూ.52.50 కోట్లు, రూ.30 కోట్లతో నిరంతర నీటి సరఫరా తాగునీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు, వినాయకసాగర్‌లో అదనపు అంతస్తులు, కూరగాయల మార్కెట్, వ్యాయామశాల, విద్యుత్‌ దీపాలంకరణ ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. గొల్లవానిగుంట పునరుద్ధరణ పనులు సైతం పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల వినాయకసాగర్‌లో రూ.3 కోట్ల విలువైన ఈత కొలను, గ్లోగార్డెన్‌ పనులు పూర్తి చేశారు.

ప్రాజెక్టు నుంచి తప్పుకొంటున్న అధికారులు

స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులు పూర్తి చేయడం అసాధ్యమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కో ప్రాజెక్టు నుంచి అధికారులు తప్పుకొంటున్నారు. తూకివాకంలో రూ.22 కోట్లతో చేపట్టిన 6 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టు పనులు 75 శాతం పూర్తి కాగా ఇప్పటికే రూ.14.30 కోట్లు బిల్లులు కూడా చెల్లించారు. పనులు చేయడంలో గుత్తేదారు నిర్లక్ష్యంతో టెండరు రద్దు చేశారు. కరకంబాడి రోడ్డులో రూ.2 కోట్లతో కూరగాయల మార్కెట్‌ నిర్మాణం ప్రాజెక్టు పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గుత్తేదారు టెండరు రద్దు చేశారు. గొల్లవానిగుంటలో వద్ద రూ.2 కోట్ల స్టేడియం, రూ.2 కోట్ల క్రికెట్‌ మైదానాన్ని స్మార్ట్‌సిటీ నుంచి శాప్‌నకు అప్పగించారు. వినాయకసాగర్‌లోని రూ.1.76 కోట్ల విలువైన మల్టీపర్పస్‌ హాల్, రూ.2 కోట్ల విలువైన యోగా కేంద్రం, రూ.1.86 కోట్ల చిన్నారుల ఆటస్థలం ప్రాజెక్టులను రద్దు చేసినట్లు తెలుస్తోంది.

అవసరం లేకుండా పోయిన నిర్మాణాలు

మొత్తం ప్రాజెక్టులు: 97

ప్రాజెక్టు విలువ: రూ.1586 కోట్లు

పూర్తయినవి: 83

విలువ: రూ.1148 కోట్లు

అసంపూర్తి: 14

విలువ: రూ.438 కోట్లు

స్మార్ట్ సిటీస్​కి వలసలకి మధ్య సంబంధం

దేశం ఆర్థికంగా పరిపుష్టం కావడానికి అక్కడి పట్టణాలే తోడ్పడతాయి. మన స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 42శాతం యాభై ప్రధాన నగరాల నుంచే వస్తోంది. ఇలాంటి స్మార్ట్​ సిటీస్​ని నిర్లక్ష్యం చేయడంతో ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలసపోయే వారిలో సగంమంది ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల నుంచే వస్తున్నారు. దేశంలోని పది అగ్ర నగరాల్లో ఒక్కటి కూడా ఈ నాలుగు రాష్ట్రాల్లో లేకపోవడాన్ని ఇక్కడ గమనించాలి. ఈ నాలుగు రాష్ట్రాలు అత్యధిక పేదరికంతో మానవాభివృద్ధి సూచీలో బాగా వెనకబడిపోయాయి. వాటిలోని ప్రధాన నగరాలను మహా నగరాలుగా అభివృద్ధి చేస్తే, అక్కడ ఆర్థిక కార్యకలాపాలు జోరందుకుని స్థూల ఉత్పత్తి పెరుగుతుంది. దానివల్ల ఆర్థిక అసమానతలు తొలగిపోవడమే కాకుండా, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన సమస్య తప్పుతుంది. అయితే ఇందుకోసం ఆయా నగరాల్లో నాణ్యమైన మౌలిక వసతులను సమకూర్చడం, నిపుణ మానవ వనరులను తయారు చేసుకోవడంతో పాటు క్రియాశీలక పెట్టుబడి విధానం కూడా అత్యంత కీలకమవుతుంది. ఈ నేపథ్యంలో స్మార్ట్​ సిటీలను పూర్తి చేస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

అనంతపురం-గుంటూరు NH 544-D విస్తరణకు మరో ముందడుగు - భూసేకరణకు నోటిఫికేషన్‌

ఏపీవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు - తరలివచ్చిన భక్త సందోహం