తిరుపతి విమానాశ్రయం సరికొత్త రికార్డు - తొలిసారిగా 10 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు
పెద్ద విమానాలతో తిరుపతి రన్‌వే కళకళ - విమానాశ్రయంలో పెరిగిన రద్దీ - ఈ ఏడాది 11.5 లక్షల లక్ష్యం - ఏపీడీ భూమినాథన్ వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 27, 2026 at 10:19 AM IST
Tirupati Airport Crosses 10 Lakh Passengers in a Year : పెద్ద విమానాలతో తిరుపతి రన్‌వే కళకళలాడుతోంది. విమానాశ్రయంలో రద్దీ పెరిగింది. తొలిసారిగా 10 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఈ ఏడాది 11.5 లక్షల లక్ష్యం అని ఏపీడీ భూమినాథన్ వెల్లడించారు. తిరుపతి విమానాశ్రయం సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. మొట్ట మొదటిసారిగా ఆర్థిక సంవత్సరం ముగియక ముందే అనగా జనవరి నాటికే 10 లక్షల మంది ప్రయాణికుల రాకపోకల మైలురాయిని దాటి రికార్డులు సృష్టిస్తోంది.
చిన్న విమానాల (ATR) స్థానంలో ఎయిర్ బస్ ( పెద్ద విమానాలు) అందుబాటులోకి రావడంతతో పాటు భక్తుల రద్దీ పెరగడంతో ఈ ఘనత సాధ్యమైందని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ (APD) భూమినాథన్ పేర్కొన్నారు. గత సంవత్సరం 9.9 లక్షల మంది ప్రయాణించారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అనగా మార్చిలోగా 11.5 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
దక్షిణాది విమానాశ్రయాల్లో అత్యంత పొడవైనది: తిరుపతి విమానాశ్రయం రన్‌వే దక్షిణాది విమానాశ్రయాల్లో ఇదే అత్యంత పొడవైనది. దీని పొడవు 3,800 మీటర్లు, ఎయిర్పో అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోని చెన్నై, హైదరాబాద్లో శంషాబాద్ మినహా కంటే ఇది పెద్దది అని, ఫ్లోరింగ్ పనులు పూర్తి అయితే మరింత బలోపేతం అవుతుందని ఏపీడీ భూమినాథన్ వెల్లడించారు.
భారీ విమానాలతోనే బూస్ట్: గతంలో 72 సీట్లు ఉండగా, ఏటీఆర్ విమానాలు ఎక్కువగా నడిచేవి. ఇప్పుడు ఏటీఆర్ విమానాల స్థానంలో 230 సీట్ల సామర్థ్యం గల ఎయిర్ బస్సులు నడుస్తున్నాయి. దీంతో సర్వీసుల సంఖ్య రోజుకు 16కు చేరింది. వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు కనెక్టివిటీ పెరగడం వల్ల ఉదయం వచ్చి సాయంత్రం వెళ్లే వెసులుబాటు కూడా ఉంది. శ్రీవాణి టికెట్లు అందుబాటులో ఉండటం రద్దీ అనూహ్యంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఉన్నా, నెలకు సగటున లక్ష మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.
నష్టాలు అధిగమించడానికి: భారీ టెర్మినల్ భవన నిర్మాణ వ్యయం, తరుగుదల కారణం. ప్రస్తుతం ఈ విమానాశ్రయం ఏటా సుమారు రూ.30 నుంచి రూ.32 కోట్లు నష్టాల్లో ఉంది. నష్టాలు అధిగమించేందుకు కమర్షియల్ ఆదాయాన్ని పెంచుకోవాలని ఇటీవల కేంద్ర మంత్రి సైతం సూచించారు.
హోటల్ ఏర్పాటుకు సన్నాహాలు: విమానాశ్రయం సమీపంలో ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా హోటల్ లేదా రెస్టారెంట్ లేకపోవడం పెద్ద లోటు. ఎయిర్ పోర్టు భూములు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినవి కావడం చేత, నిబంధనల ప్రకారం అక్కడ వాణిజ్య కార్యకలాపాలు హోటల్ వంటివి చేపట్టడం పై కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో మరోసారి సర్వే నిర్వహించనున్నారు. అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపారు. భద్రతా కారణాలను పరిగణనలోకి తీసుకుని త్వరలోనే దీనికి సంబంధించి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
అందుబాటులోకి 'డిజియాత్ర' సేవలు: కోయంబత్తూరు తరహాలోనే తిరుపతిలోను కూడా త్వరలో 'డిజియాత్ర' సేవలు అందుబాటులోకి వస్తాయని ఏపీడీ భూమినాథన్ ఈ సందర్భంగా తెలిపారు. భద్రత పరంగా విమానాశ్రయం పటిష్ఠంగా ఉందన్నారు. దాదాపు 800 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉందని ఏపీడీ పేర్కొన్నారు. రాత్రి పూట ల్యాండింగ్ సౌకర్యం కూడా ఉందని తెలిపారు. విమానయాన సంస్థల డిమాండ్ ఆధారంగా 24 గంటల సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు దుబాయ్, సింగపూర్ వంటి దేశాల నుంచి తిరుపతికి నేరుగా విమానాలు నడిపే అంశం పరిశీలనలో ఉంది. సింగపూర్ ఎయిర్ లైన్స్ సానుకూలంగా ఉన్నా విమానాల లభ్యత దగ్గర నుంచి పైలట్ల కొరత, మంత్రిత్వశాఖ అనుమతుల వంటి అంశాల పైనే ఇది ఆధారపడి ఉంది. ప్రైవేట్ జెట్లు, చార్టర్డ్ విమానాల కోసం బేగంపేట తరహాలోనే 'జనరల్ ఏవియేషన్' టెర్మినల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.
'ఇంటిగ్రేటెడ్ టెర్మినల్' పనులకు ముందుకురాని కాంట్రాక్టర్లు - మళ్లీ టెండర్లు!
మీ ఇంట్లో శుభకార్యమా? - తక్కువ ఖర్చుతోనే టీటీడీ కళ్యాణ మండపం బుక్ చేసుకోండిలా

