ETV Bharat / state

శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి కేసు - సిట్‌ విచారణకు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

వైఎస్సార్సీపీ కీలక నేత విన్నపంతోనే చిన్న అప్పన్నకు సాయం - కొనుగోళ్ల కమిటీలో నాలుగు నెలలే ఉన్న - కల్తీ నెయ్యి కేసులో సిట్‌కు వివరించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

MLA Vemireddy Prashanthi Reddy
MLA Vemireddy Prashanthi Reddy (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 31, 2025 at 12:05 PM IST

3 Min Read
Choose ETV Bharat

Tirumala Adulterated Ghee Case Updates : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా కేసులో కోవూరు ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని సిట్‌ అధికారులు ఇటీవల విచారించారు. నెల్లూరులోనే ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. 2019 సెప్టెంబరు నుంచి 4 నెలల పాటు ఆమె తిరుమల తిరుపతి దేవస్థానంలో కొనుగోళ్ల కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడు, కొనుగోళ్ల కమిటీ సభ్యులను విచారిస్తున్న క్రమంలోనే ప్రశాంతిరెడ్డినీ ప్రశ్నించారు. నెయ్యి కొనుగోలుకు టెండర్లు ఎలా పిలుస్తారు, విధివిధానాలేమిటని అడిగినట్లు తెలుస్తోంది.

'నిబంధనలు సరళతరం చేసినప్పుడు కొనుగోళ్ల కమిటీలో లేను' : తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్న బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయడానికి కారణమేంటని ఆమెను ప్రశ్నించారు. వైఎస్సార్సీపీలోని కీలక నేత విన్నవించడంతోనే తొలుత నెలకు రూ.50 వేలు, అనంతరం రూ.25 వేల చొప్పున కొంతకాలం ఇచ్చామని ప్రశాంతిరెడ్డి సమాధానమిచ్చారు. తాము ఎందరికో మానవతా దృక్పథంతో సాయం చేస్తుంటామని అందులో భాగంగానే అతనికీ డబ్బులు ఇచ్చామని తెలిపారు. చిన్న అప్పన్న ఎప్పుడూ తమ దగ్గర పని చేయలేదని, పీఏగానూ లేరని బదులిచ్చారు. అతనికి దిల్లీలో ఉద్యోగం ఇవ్వాలని కూడా సిఫార్సు చేయలేదని స్పష్టం చేశారు. టెండర్‌ నిబంధనలు సరళతరం చేసినప్పుడు కూడా తాను కొనుగోళ్ల కమిటీలో లేనని చెప్పారు.

బోర్డు వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదన్న మంత్రి పార్థసారథిని : కల్తీ నెయ్యి కేసులో ఈ నెల 23న మంత్రి పార్థసారథిని సైతం సిట్‌ ప్రశ్నించింది. వైఎస్సార్సీపీ హయాంలో 2019 సెప్టెంబరు నుంచి రెండేళ్ల పాటు ఆయన కూడా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా ఉన్నారు. అప్పట్లో ఆయన్ను కొనుగోళ్ల కమిటీలోనూ సభ్యుడిగా నియమించారు. 2020 మార్చిలో కొవిడ్‌ తర్వాత నుంచి తాను పెద్దగా బోర్డు వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని, కల్తీ నెయ్యి గురించి తనకు తెలియదని పార్థసారథి చెప్పినట్లు సమాచారం. అధికారులే అంతా చూసుకుంటారని సమాధానం చెప్పారని తెలుస్తోంది.

సాక్షిగా అప్పటి ఈవో శ్యామలరావు : మరో వైపు కల్తీ నెయ్యి కేసులో ఫిర్యాదు ఇచ్చిన మురళీకృష్ణకు కూడా ఇందులో ప్రమేయం ఉందని సిట్‌ భావించడంతో ఆయననూ నిందితుల జాబితాలో చేర్చింది. ఈ నేపథ్యంలో ఫిర్యాదు ఇచ్చిన సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉన్న శ్యామలరావును సాక్షిగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను కూడా కొన్ని రోజుల క్రితం విచారించారు. కల్తీ గురించి అనుమానం ఎప్పుడు వచ్చింది? ఎందుకు వచ్చింది? నమూనాలను గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ ల్యాబ్‌కు పంపడం వరకూ తన వద్ద ఉన్న సమాచారాన్ని అంతా ఆయన సిట్‌ అధికారులకు చెప్పారు.

తిరుమల లడ్డూ తయారీకి తమిళనాడు దిండిగల్​లోని ఏఆర్​​ డెయిరీ మీ హయాంలోనే కల్తీ నెయ్యి సరఫరా చేసినా మీరెందుకు గుర్తించలేదని అప్పట్లోనే ఎందుకు చర్యలు తీసుకోలేదని సిట్‍ అధికారులు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్‍ భూమన కరుణాకరరెడ్డిని ప్రశ్నించారు. తిరుపతి అలిపిరి సమీపంలోని సిట్‍ కార్యాలయంలో సుమారు రెండున్నర గంటల పాటు భూమనను విచారించిన సంగతి తెలిసిందే. టెండర్లు పిలవడం, ఖరారు చేయడం అంతా అధికారులే చూసుకుంటారని తనకేం సంబంధమని అధికారుల ఎదురు ఆయన సమాధానం ఇచ్చినట్లు సమాచారం.

కల్తీ నెయ్యి సరఫరా చేసినా మీరెందుకు గుర్తించలేదు - భూమనను ప్రశ్నించిన సిట్

ప్రతిదీ ఉమ్మడి నిర్ణయమే - అంతకుమించి నాకేం గుర్తులేదు: చెవిరెడ్డి భాస్కరరెడ్డి