పొద్దున ఎంతలేపినా మీ బుడ్డోడు నిద్ర లేవట్లేదా : ఇవి పాటించారంటే ఇక బస్సు మిస్సవ్వదు
పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా పాటించాల్సిన సూత్రాలు - వారితో మెలగాల్సిన తీరుపై నిపుణుల సూచనలు - 8 నుంచి 10 గంటల నిద్ర అవసరం అంటున్న సైకాలజిస్టులు

Published : July 7, 2026 at 2:01 PM IST
Tips For To Wake Up Children At Morning : 'అమ్మా శశి లే అమ్మా! ఈరోజు కూడా బస్సుకు లేట్ అవుతుంది. నిన్న కూడా ఏం తినకుండా హడవిడిగా వెళ్లావు. లేచి తొందరగా బ్రష్ వేసుకుని స్నానం చెయ్యి' అని లలిత తన కుమార్తె శశిరేఖను లేపుతుంది. అయితే ఈ తంతు కేవలం లలితదే కాదు. పిల్లలను స్కూళ్లకు పంపించే తల్లులందరిదీ. ఉదయం 6 గంటల నుంచి మొదలు పెడితే 8:30కి బస్సు ఎక్కే వరకు అరుస్తూనే ఉంటారు. మరి పిల్లలు స్కూల్ బస్సు వచ్చే వరకు ఎందుకు రెడీ కావటం లేదు? వీరికి నిద్రమత్తు ఎందుకు వీడట్లేదు? అనే ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తల్లిదండ్రుల వద్దే ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ముందు పెద్దలు మారితే, పిల్లలు ఆ దారిలో పడతారని కన్సల్టెంట్ సైకాలజిస్టు డాక్టర్ వంగీపురం శ్రీనాథచారి చెబుతున్నారు.
అన్నింటికీ ప్లాన్ ముఖ్యం : సాధారణంగా పిల్లలు 8 నుంచి 10 గంటల పాటు పడుకోవాలి. అందుకు తగినట్టుగా ఆ రోజును తల్లిదండ్రులు ప్లాన్ చేసుకోవాలి. చిన్నారులకు ట్యూషన్లు, క్రీడలు వంటివి ఉంటే వాటి వల్ల నిద్రకు భంగం కలగకుండా చూసుకోవాలి. ఆ తర్వాత కుటుంబంతో గడపటం, టీవీ, సెల్‌ఫోన్ వంటి వాటికి ఎంత సమయం ఇవ్వాలో తల్లిదండ్రులే నిర్ణయించుకోవాలి. ప్రస్తుతం పెద్దలతో పాటు పిల్లలకు కూడా ఫోన్లు ఉంటున్నాయి. నిద్ర పోవడానికి, లేవటానికి మెదడులో అమిగ్డలా అనే భాగం ఉంటుంది. దీంతో వారు ఎక్కువ సేపు స్క్రీన్‌ను చూస్తే దానిపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకు నిద్రపోయే 2 గంటల ముందే మొబైల్‌ను పక్కన పెట్టించాలి.
ఇవి చేస్తే బాగుంటుంది :
- చిన్నారులకు రాత్రి భోజనాన్ని 7.30-8 గంటల మధ్యలో పెట్టాలి.
- భోజనంలో కార్బొహైడ్రేట్లతో పాటు ఫైబర్, ప్రొటీన్ ఉండేలా చూసుకోవాలి.
- 10 గంటలలోపే పిల్లలు పడుకునేలా చూడాలి.
- పిల్లలు లేచాక మొదట నీళ్లు తాగితే వారికి కడుపు ఖాళీ అవుతుంది. అప్పుడు వాళ్లు మళ్లీ పక్కపైకి వెళ్లరు. అందుకు రాత్రి వారి పక్కన నీళ్ల సీసాను పెట్టాలి.
- పడక గదిలో ఎలాంటి వెలుతురు, శబ్దాలు లేకుండా చూసుకోవాలి. అప్పుడే వారు సరిగ్గా నిద్రపోతారు.
- ఒకవేళ వెలుతురు, శబ్దాలు వస్తే వారు వెంటనే లేస్తారు. అలాగే దుప్పట్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.
ఈ సూచనలు తల్లిదండ్రులకు : వాస్తవానికి పిల్లలకు ఇది చేయాలి, అది చేయాలి, ఇది తిను, తినకు అని ఆర్డర్లు వేయొద్దు. అలా చేస్తే వారు అస్సలు వినరు. అందుకు బదులుగా వారితో చేయించాల్సిన పనులు తల్లిదండ్రులు కూడా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓ 15 రోజుల పాటు పిల్లలతో కలిసి తల్లిదండ్రులు చేస్తే వారికి క్రమంగా అలవాటు అవుతుందని శ్రీనాథచారి వివరించారు. అలాగే పిల్లలు పాఠశాల నుంచి రాగానే వారితో ఫన్నీగా మాట్లాడాలి. ఈరోజు ఎలా గడిచింది? స్కూళ్లో ఎలాంటి గేమ్స్ ఆడుకున్నావు? అని అడగాలి. అలా మెల్లగా వారిని హోం వర్క్‌లోకి తీసుకెళ్లాలి. సో విన్నారుగా. ఇవి పాటించి ఇక నుంచి మీ పిల్లలను బస్ మిస్ కాకుండా చూసుకోండి.
ప్లాస్టిక్ బాక్సుల్లో లంచ్ వద్దే వద్దు - స్టీల్ బాక్సులే వాడాలంటున్న వైద్యులు
పిల్లలకు డబ్బు గురించి చెబుతున్నారా? - చిన్నప్పుడే అవగాహన కల్పించాలంటున్న నిపుణులు!

