ETV Bharat / state

అందుబాటులోకి తొలి టిమ్స్ ఆసుపత్రి - పేదలకు 37 రకాల 'సూపర్​ స్పెషాలిటీ వైద్య సేవలు'

తొలి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌-టిమ్స్​ ఆసుపత్రి - 22.67 ఎకరాల్లో 5 బ్లాక్‌లుగా నిర్మాణం - కార్డియక్ సైన్సెస్, ట్రామా కేర్, రీనల్ సైన్సెస్, ట్రాన్సప్లాంటేషన్ చికిత్సలకు ప్రాధాన్యత

SANATHNAGAR TIMS HOSPITAL
SANATHNAGAR TIMS HOSPITAL (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 17, 2026 at 7:29 AM IST

|

Updated : August 17, 2026 at 8:27 AM IST

2 Min Read
Choose ETV Bharat

TIMS Hospital Opening At Sanathnagar : పేదలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన టిమ్స్‌ ఆసుపత్రుల్లో తొలి వైద్యశాల అందుబాటులోకి రానుంది. సనత్‌నగర్‌లో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి టిమ్స్‌ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభించనున్నారు. 22.67 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఆసుపత్రి వినియోగంలోకి వస్తే 37 రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

22.67 ఎకరాల్లో 5 బ్లాక్‌లుగా నిర్మాణం : తొలి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్​) ఆసుపత్రి నేటి నుంచి సేవలు అందించనుంది. హైదరాబాద్‌లోని సనత్​నగర్‌లో ఏర్పాటు చేసిన మర్రి చెన్నారెడ్డి టిమ్స్‌ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం లాంఛనంగా ప్రారంభించనున్నారు. 22.67 ఎకరాల్లో 5 బ్లాకులుగా ఈ ఆసుపత్రిని నిర్మించారు. రెండు బ్లాకులు అడ్మినిస్ట్రేషన్‌, రీసెర్చ్ కోసం కేటాయించగా, మిగతా 3 బ్లాకుల్లో వివిధ రకాల వైద్య సేవలు అందించేందుకు కేటాయించారు. 'ఏ బ్లాక్‌'లో ఎమర్జెన్సీ సేవలు, 4 ఆపరేషన్ థియేటర్‌లు, 'బీ బ్లాక్‌'లో ఓపీ సేవలు, ఫార్మసీ, డయాగ్నోస్టిక్ సేవలు, 11 ఆపరేషన్ థియేటర్లు సిద్ధంగా ఉండగా, త్వరలో ఇక్కడే క్యాథ్‌ ల్యాబ్‌ అందుబాటులో రానుంది. ఇక 'సీ బ్లాక్‌'లో మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ ల్యాబ్‌లు, సీటీ, ఎంఆర్ఐ టెస్ట్‌లు, వీఐపీ సూట్ రూమ్స్‌, పెయిడ్ రూమ్స్‌, విదేశీ రోగుల కోసం ప్రత్యేకంగా ఒక ఫ్లోర్ కేటాయించారు.

సనత్​నగర్​లో టిమ్స్​ ఆసుపత్రి ప్రారంభం కానుంది (ETV Bharat)

4 విభాగాలకు అత్యంత ప్రాధాన్యత : సూపర్ స్పెషాలిటీ సేవలే లక్ష్యంగా ఏర్పాటు చేసిన సనత్​నగర్ టిమ్స్‌లో ముఖ్యంగా 4 విభాగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కార్డియక్ సైన్సెస్, ట్రామా కేర్, రీనల్ సైన్సెస్, ట్రాన్స్​ప్లాంటేషన్ చికిత్సలకు ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఏర్పాటు చేశారు. మొత్తం 1000 పడకలతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 300 పడకలు ప్రత్యేకంగా ఎమర్జెన్సీ సేవలకు కేటాయించగా, 100 పడకలు ఈహెచ్​ఎస్​ కోసం, 30 పడకలను డయాలసిస్ సేవల కోసం, వీఐపీ, విదేశీ రోగుల కోసం మరికొన్ని పడకలను ప్రత్యేకంగా కేటాయించారు.

24 గంటల పాటు అందుబాటులో ఉండేలా అంబులెన్సు సేవలు, డయాగ్నోస్టిక్స్, రోగులు ఎక్కువ సేపు క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా అడ్వాన్స్​డ్​ మేనేజ్​మెంట్​ సిస్టమ్స్, నర్స్ కాలింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఏడాది మే నుంచే ఓపీ ట్రయల్ రన్‌ను నిర్వహిస్తుండగా, రోజుకు దాదాపు 300 మందికి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి ప్రారంభం అయితే రోజుకు సుమారు 4 వేల మందికి వైద్య సేవలు అందే అవకాశం ఉన్నట్టు అంచనా.

సనత్​నగర్ టిమ్స్ ఆసుపత్రిలో ఓపీ సేవలు - నెల రోజుల పాటు ట్రయల్స్ రన్

కరోనా టైమ్​లో ఎంతో మందికి సేవలందించిన గచ్చిబౌలి టిమ్స్‌ కథ ఇక ముగిసినట్లే

Last Updated : August 17, 2026 at 8:27 AM IST