ETV Bharat / state

బెబ్బులి రీ ఎంట్రీ - భయాందోళనలో ప్రజలు

పోలవరం జిల్లాలో పులి సంచారం - రాత్రి వేళల్లో పశువులపై దాడి - అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు

Tiger Movement in Polavaram District
Tiger Movement in Polavaram District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 30, 2026 at 2:14 PM IST

3 Min Read
Choose ETV Bharat

Tiger Movement in Joint East Godavari District : గడిచిన నాలుగు నెలలుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులను పెద్దపులి హడలెత్తిస్తోంది. దీంతో స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అటవీశాఖ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా బెబ్బులిని బంధించలేకపోతున్నారు. ప్రతిసారి వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ అధికారులకు చుక్కలు చూపిస్తోంది. అంతేకాక మరోవైపు మళ్లీ దాడులు చేస్తూ భయాందోళనలకు గురి చేస్తోంది.

ఇటీవల రాత్రి వేళల్లో పశువులపై దాడి చేస్తూ పోలవరం జిల్లాలో తిరుగుతూ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు రాజమహేంద్రవరం అటవీ పరిధిలో సంచరించిన బెబ్బులి రూటు మార్చింది. తాజాగా మళ్లీ గంగవరం మండలంలోకి ప్రవేశించింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. శుక్రవారం నాడు ఏలేరు రిజర్వాయర్ బ్యాక్ వాటర్, ఆర్డీపురం పరిసరాల్లో సంచరించింది. గతంలో పులిని బంధించినపుడు దాని మెడకు రేడియో కాలర్ పరికరాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో బెబ్బులి ఎక్కడుందనే కచ్చిత వివరాలను తెలుసుకుంటున్నారు.

Tiger Movement in Polavaram District
వేములోవలో ప్రజలను అప్రమత్తం చేస్తున్న అటవీ అధికారులు (ETV Bharat)

ఈ క్రమంలో సీసీఎఫ్‌ డాక్టర్‌ జ్యోతి, డీఎఫ్‌వో సునీల్‌ కుమార్, సబ్‌డీఏఫ్‌వోలు అనూష, వెంకట సుబ్బారెడ్డి, అనూష, రేంజర్‌ శ్రీనివాసరావు, పలువురు అటవీశాఖ సిబ్బందితో కలిసి ఏలేరు బ్యాక్‌వాటర్‌ పరిసరాల్లో పర్యటించారు. స్థానిక గ్రామాలైన ఆర్డీపురం, ఓడ్డిచెరువు, వేములోవ, పిడతమామిడి ప్రజలను అప్రమత్తం చేశారు. నాలుగు నెలల్లో 20 పశువులపై పెద్ద పులి దాడి చేసిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

రాత్రి, తెల్లవారుజాము సమయాల్లో ప్రజలు ఒంటరిగా అడవి వైపు వెళ్లవద్దని అధికారులు తెలిపారు. పశువులను బయటకు వదలొద్దని విజ్ఞప్తి చేశారు. బెబ్బులి దాడిలో మృతి చెందిన పశువులకు నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు. పులి కనిపించినా, విసర్జన అవశేషాలు, పులి పాదముద్రలు, పశువులపై దాడులు, అసాధారణ వన్యప్రాణి కదలికలు గమనించినా వెంటనే సమీప అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించాలని చెప్పారు. నిర్ధారణలేని సమాచారాన్ని, వదంతులను ప్రచారం చేయవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.

సురక్షితంగా బంధించేందుకు చర్యలు : పాపికొండలు ప్రాంతంలో పులిని సురక్షితంగా బంధించేందుకు అటవీశాఖ పటిష్టచర్యలు తీసుకుందని రాజమహేంద్రవరం సర్కిల్‌ సీసీఎఫ్‌ డా.టి. జ్యోతి పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీన రాజవొమ్మంగి రేంజ్‌ పరిధిలో వాతంగి, కొండలింగంపర్తి బీట్‌ ప్రాంతాల్లో పులి తొమ్మిది పశువులను చంపినట్టు సమాచారం అందిందని తెలిపారు. వెంటనే అటవీశాఖ అధికారులు పరిహారం అందజేశారని వివరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ప్రధాన ముఖ్యఅటవీ సంరక్షణాధికారి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పరు.

క్షేత్రస్థాయిలో సమర్ధవంతమైన సమన్వయం, ప్రజల భద్రత, పులిని సురక్షితంగా బంధించేందుకు అవసరమైన ఆదేశాలు ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నారని డా.టి. జ్యోతి వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో బెబ్బులిని పట్టుకునేందుకు ప్రత్యేక రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగాయని చెప్పారు. వీలైనంత త్వరలో దానిని బంధిస్తామని డా.టి. జ్యోతి వివరించారు.

మూడు సంవత్సరాల మగపులి : సుమారు మూడు సంవత్సరాల మగపులి 2026 జనవరిలో తెలంగాణ నుంచి ఏపీలోకి ప్రవేశించిందని అధికారులు తెలిపారు. ఈ బెబ్బులిని ఫిబ్రవరి ఆరో తేదీన తూర్పుగోదావరి జిల్లా కూర్మాపురంలో సురక్షితంగా బంధించి, విశాఖలోని యానిమల్‌ రెస్క్యూ సెంటర్‌కు తరలించామని చెప్పారు. ఆవాస అనుకూలత, ఆహార లభ్యత, సంరక్షణ అవకాశాలపై శాస్త్రీయ అంచనాల ఆధారంగా కమిటీ ఏకగ్రీవంగా పులిని రంపచోడవరం డివిజన్‌ పరిధిలోని పాపికొండ జాతీయవనంలో విడుదల చేయాలని సిఫార్సు చేసిందని వివరించారు. ఈ మేరకు ఫిబ్రవరి నెల 14న దానికి నిరంతర పర్యవేక్షణ కోసం రేడియోకాలర్‌ను అమర్చి కొండమొదలు సమీపంలోని విడుదల చేశామన్నారు. అప్పటి నుంచి పోలవరం జిల్లా ప్రజలను హడలెత్తిస్తుందని వెల్లడించారు.

తూర్పుగోదావరి జిల్లాను వీడని పెద్దపులి - భయాందోళనలో ప్రజలు

పోలవరం మండలలోని ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో పెద్ద పులి సంచారం