అభయారణ్యం నుంచి బయటికొచ్చిన బెబ్బులి - పాపికొండలకు తగ్గిన పర్యాటకుల సంఖ్య
ఏలూరు జిల్లాలో మరోసారి పెద్దపులి సంచారం - పాపికొండల అభయారణ్యం నుంచి బయటికొచ్చిన బెబ్బులి - పులి దాడిలో 2 ఆవులు మృతి- సమీప అటవీ ప్రాంతాల్లో ఒంటరిగా తిరగవద్దని అటవీ అధికారుల సూచన

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 24, 2026 at 12:15 PM IST
Tiger Terror in Eluru District : ఏలూరు జిల్లాలో మరోసారి పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న పాపికొండలు అభయారణ్యం నుంచి బయటకు వచ్చిన పులి, బుట్టాయగూడెం మండల పరిధిలోకి ప్రవేశించింది. దీంతో స్థానిక గిరిజన గ్రామాలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ బెబ్బులి భయం పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూపడంతో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన పాపికొండలు ఒక్కసారిగా వెలవెలబోయాయి.
పశువులపై పెద్దపులి పంజా: బుధవారం తెల్లవారుజామున నిమ్మలగూడెం గ్రామ శివారులోని పాలకుంట చెరువు వద్దకు వచ్చిన పెద్దపులి, అక్కడ మేతకు వెళ్లిన రెండు ఆవులపై దాడి చేసి చంపేసింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పులి అడుగుజాడలను పరిశీలించారు. వన్యప్రాణి మెడకు అమర్చిన రేడియో కాలర్ ఆధారంగా దాని కదలికలను క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
రంగంలోకి "హనుమాన్" బృందాలు: గత కొంతకాలంగా ఆయా ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తుండటంతో స్థానిక ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. రోజుకో గ్రామంలో పులి అడుగుజాడలు కనిపిస్తుండటంతో అటవీశాఖ అధికారులు దానిని ప్రాణాలతో పట్టుకునేందుకు భారీ ఆపరేషన్ ప్రారంభించారు. ఇటీవలె పెద్దపులి పోలవరం జిల్లా దేవీపట్నం మండలం తొయ్యేరు గ్రామం సమీపంలోని అటవీ కొండపై తలదాచుకున్నట్లు నిర్ధారించారు. దీంతో అటవీ సిబ్బంది ఆ కొండ చుట్టుపక్కల ప్రాంతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
పులిని ఎట్టి పరిస్థితుల్లోనూ సురక్షితంగా బంధించాలని అటవీశాఖ నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి, అటవీ శాఖకు చెందిన నిపుణులైన "హనుమాన్" బృందాలను రంగంలోకి దించింది. ఈ ప్రత్యేక బృందాలు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకుని పులిని బోనులో బంధించేందుకు పక్కా వ్యూహాలు రచిస్తున్నాయి.
థర్మల్ డ్రోన్లతో గాలింపు: పులి కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు అధికారులు అధునాతన టెక్నాలజీని వాడుతున్నారు. అధునాతన 'థర్మల్ డ్రోన్ల'ను ఉపయోగిస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా డ్రోన్లతో నిఘా పెట్టారు. దట్టమైన అడవిలో, చీకట్లో కూడా పులి ఎక్కడుందో ఈ డ్రోన్లు పసిగడతాయి. ఈ డ్రోన్లు ఇచ్చే కచ్చితమైన సమాచారంతో అటవీ సిబ్బంది అడుగులు వేస్తున్నారు.
అధికారుల హెచ్చరికలు: పులి సంచార ప్రాంతాలైన దండిపూడి, నిమ్మలగూడెం పరిసర గ్రామాల్లో అటవీ అధికారులు మైకుల ద్వారా దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గ్రామాల్లో తిరుగుతూ నిరంతరం అవగాహన కల్పిస్తున్నారు. స్థానికులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. పొలాలకు, అటవీ ప్రాంతాల్లోకి ఎవరూ ఒంటరిగా వెళ్లవద్దని, రాత్రి వేళల్లో పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని సూచించారు.
గ్రామస్థులు ఎవరూ కూడా అనవసరంగా కొండ ప్రాంతాలకు, అడవులకు వెళ్లొద్దని హెచ్చరించారు. పశువులను అడవి అంచుల్లో లేదా గ్రామ శివార్లలో తాళ్లతో కట్టి వదిలివేయరాదని చెప్పారు. రాత్రి సమయంలో పశువులను తప్పనిసరిగా సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని సూచించారు. స్థానికులు సైతం రాత్రిపూట ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. తద్వారా పులి దాడి నుంచి తప్పించుకోవచ్చని స్థానికులకు సూచనలు చేశారు.
తగ్గిన పర్యాటకుల సంఖ్య: మరోవైపు అటవీ ప్రాంతంలో పులి కదలికల నేపథ్యంలో పాపికొండల పర్యాటకానికి బ్రేక్ పడింది. గోదావరిలో బోటు ప్రయాణాలు, చేపల వేటపై ఆంక్షలు విధించడంతో పర్యాటకుల సంఖ్య ఒక్కసారిగా పడిపోయింది. పులిని అడవిలోకి పంపించేందుకు ప్రత్యేక రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి.
రాత్రంతా ప్రత్యేక ఆపరేషన్ - డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి
పోలవరం ఏజెన్సీలో 'ఆపరేషన్ బిగ్ క్యాట్' - తొయ్యేరు కొండపై పెద్దపులి మకాం

