ETV Bharat / state

రాత్రంతా ప్రత్యేక ఆపరేషన్ - డ్రోన్​ కెమెరాలకు చిక్కిన పెద్దపులి

ఏజెన్సీ ప్రాంతాల్లో కొనసాగుతున్న పెద్దపులి సంచారం - నేలకోట, పూడిపల్లి సొరంగం వద్ద సంచరిస్తున్నట్లు గుర్తింపు - పులిని సజీవంగా బంధించేందుకు రెస్క్యూ బృందాల యత్నం -డ్రోన్ సాయంతో పులి కదలికలు గమనిస్తున్న అధికారులు

Tiger Spotted at Devipatnam Hills Polavaram District
Tiger Spotted at Devipatnam Hills Polavaram District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 7, 2026 at 2:09 PM IST

2 Min Read
Choose ETV Bharat

Tiger Terror in East Godavari : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ పరిధిలో గత కొద్ది రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి సంచారం ఆదివారం తీవ్ర కలకలం రేపింది. దేవీపట్నం మండలం నేలకోట-పూడిపల్లి సొరంగం (టన్నెల్) పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు నిర్థారించారు. గత కొన్ని రోజులుగా స్థానిక గ్రామాల్లో లేగదూడలపై దాడులు చేస్తూ భయాందోళనలు సృష్టిస్తోంది. పులిని సురక్షితంగా బంధించేందుకు అటవీశాఖ శనివారం రాత్రంగా ప్రత్యేక ఆపరేషన్‌ కొనసాగించింది.

క్షేత్రస్థాయిలో డీఎఫ్​వో మకాం: పోలవరం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో సంచరిస్తూ లేగదూడలపై దాడి చేస్తున్న పెద్దపులి సంచారం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం దేవీపట్నం మండలం నెలకోట, పూడిపల్లి సొరంగం సమీపంలోని కొండ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులిని సజీవంగా బంధించేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. డీఎఫ్​వో రామచంద్రరావు స్వయంగా ఘటనా స్థలంలో రాత్రంతా మకాం వేసి ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. నిన్న రాత్రి 7 గంటల నుంచి అటవీశాఖ సిబ్బంది డ్రోన్ సాయంతో పులి కదలికలను గమనిస్తున్నారు.

పులి సంచరిస్తున్న తాజా దృశ్యాలను డ్రోన్ సాయంతో తెలుసుకున్నారు. అది సమీప గ్రామాల వైపు వెళ్లకుండా విజయవంతంగా నియంత్రించారు. పులిపై నిరంతర నిఘా కొనసాగించడం ద్వారా దానిని కొండ ప్రాంతానికే పరిమితం చేయగలిగారు. ఆపరేషన్‌లో భాగంగా అటవీశాఖ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా, సాహసోపేతంగా విధులు నిర్వహించినట్లు అటవీశాఖ తెలిపింది.

బెంగళూరు నిపుణుల సాంకేతిక వ్యూహాలు: ప్రస్తుతం పులి కొండ ప్రాంతంలోనే ఉండగా గ్రామాల వైపు ప్రవేశించకుండా అటవీ శాఖ, ప్రత్యేక "హనుమాన్" రెస్క్యూ బృందాలు, వెటర్నరీ నిపుణులు, ఇతర ఫీల్డ్ సిబ్బంది సంయుక్తంగా చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఆపరేషన్​లో భాగంగా బెంగళూరు నుంచి వచ్చిన వన్యప్రాణి నిపుణుల బృందం పులి కదలికలు, భద్రతా చర్యలపై సాంకేతిక సలహాలు అందిస్తోంది.

యుద్ధ ప్రాతిపదికన చర్యలు: పులిని సురక్షితంగా బంధించేందుకు అటవీ శాఖ దాదాపు 200 మందికి పైగా అధికారులు, సిబ్బందిని మోహరించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో, పులులపై మత్తుమందు ప్రయోగించి బంధించడంలో అనుభవం కలిగిన బెంగళూరుకు చెందిన నిపుణుల ప్రత్యేక బృందం పులిని బంధించేెందుకు యత్నిస్తుంది.

ఈ క్రమంలోనే బెబ్బులి సంచరిస్తున్న ప్రాంతాలకు దగ్గరగా వెళ్లి ప్రత్యేక బృందాలు ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. మత్తుమందు ప్రయోగానికి అనువైన అవకాశాన్ని గుర్తించేందుకు 6 ర్యాపిడ్ రెస్క్యూ టీమ్‌లు, 5 ప్రజా అవగాహన బృందాలు, 4 ట్రాంక్విలైజింగ్ బృందాలు, 2 డ్రోన్ బృందాలు, 2 వీహెచ్ఎఫ్ యాంటెన్నా బృందాలతో పాటు కేజ్ బృందం, వన్యప్రాణి అంబులెన్స్ బృందం, ఫ్రంట్‌లైన్ సిబ్బందితో కూడిన మొత్తం 21 హనుమాన్ బృందాలు సమన్వయంతో పని చేస్తున్నాయి.

అధికారుల హెచ్చరికలు: గ్రామాల్లో పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్ (PAS) ద్వారా అధికారులు ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఎవరూ బయట సంచరించొద్దని హెచ్చరిస్తున్నారు. ప్రజలు గుంపులుగా చేరవద్దని, పులిని చూడటానికి యత్నించవద్దని సూచిస్తున్నారు. ప్రస్తుతం నిపుణుల పర్యవేక్షణలో పెద్దపులి ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది.

పోలవరం ఏజెన్సీలో పెద్దపులి - త్వరలోనే పట్టుకుంటామంటున్న అధికారులు

ఏ రెండు పులుల చారలు ఒకేలా ఉండవు! - అడవుల్లో వ్యాఘ్రాలను ఎలా లెక్కిస్తారంటే!