దేవీపట్నం పరిసరాల్లో పెద్దపులి సంచారం - భయాందోళనలో స్థానికులు
దేవీపట్నం పరిసరాల్లో రెండు దూడలపై దాడి చంపిన పెద్దపులి - పోలవరం ప్రాజెక్టు పరిసరాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అటవీశాఖ అధికారులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : September 3, 2026 at 12:12 PM IST
Tiger Again Spotted In Devipatnam : గత రెండు నెలలుగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన పెద్ద పులి మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. గోదావరి నదిని దాటి దేవీపట్నం ప్రాంతంలోకి ప్రవేశించింది. జూన్ 23న, ఇది పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం 'తెలిబేరు' సమీపంలో ఉన్న పాపికొండల అభయారణ్యం నుంచి గోదావరిని దాటి ఏలూరు జిల్లాలోని పోలవరం మండలానికి చేరుకుంది. శివగిరి, పోలవరం ప్రాజెక్ట్ మధ్య ఉన్న ప్రాంతంలో దాదాపు నెల రోజుల పాటు సంచరిస్తూ, పశువులను వేటాడి చంపిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత అది పోలవరం మండలం దాటి బుట్టాయగూడెం, జీలుగుమిల్లి ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. బుధవారం నాడు తిరిగి వెనక్కి మళ్లిన ఆ పులి, తెల్లవారుజామున పోలవరం సమీపంలోని సింగనపల్లి వద్ద మళ్లీ గోదావరిని దాటి దేవీపట్నంలోకి ప్రవేశించింది. ఇది పాత పోలీస్ స్టేషన్ దగ్గరలోని ఉమా చోడేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఉన్నట్లు సమాచారం. దీనివల్ల, సాధారణంగా గోదావరిలో చేపలు పట్టే మత్స్యకారులు దేవీపట్నం పోలీస్ స్టేషన్ సమీప ప్రాంతాన్ని ఖాళీ చేసి పోశమ్మగండికి తరలివెళ్లారు.
వరద నీరు ఇంకా కొనసాగుతుండటం : 70 రోజుల తర్వాత పులి తిరిగి దేవీపట్నానికి రావడంతో, వరద ముప్పు ఉన్న గ్రామాల నుంచి తరలించిన ప్రజలలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఉదయం నుంచే ఆయా గ్రామాలలోని పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు చేపట్టారు. అయితే దేవీపట్నం ప్రాంతంలో వరద నీరు ఇంకా తగ్గకపోవడంతో, అటవీ శాఖ అధికారులు, సహాయక బృందాలు ప్రస్తుతం ఆ ప్రాంతానికి చేరుకోలేకపోతున్నాయి. తమ పశువులు ఉన్న తోయ్యేరు, గనుగులగొండు, ఏనుగులగూడెం, లింగవరం పరిసర ప్రాంతాలకు వెళ్లాలంటే పులి భయంతో వెనుకాడాల్సి వస్తోందని నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు.
భయాందోళనలో ప్రాజెక్ట్ పరిసర ప్రజలు : ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఇటీవల పులి సంచారం కలకలం రేపింది. ఈ విషయంపై ప్రాజెక్టు ఇంజనీర్లు, ఏజెన్సీ ప్రతినిధులకు సమాచారం అందించారు. పాత దేవరగుండి సొరంగం వద్ద ఉన్న రెగ్యులేటర్ సమీపంలో పులి తిరుగుతుండగా స్థానికులు గమనించారు. ఆ ప్రాంతంలో పులి రెండు దూడలపై దాడి చేసి చంపిందని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనతో సమీప గ్రామాల ప్రజలు, ప్రాజెక్టు కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
పోలవరం ప్రాజెక్టు సమీపంలో పెద్దపులి సంచారం - భయాందోళనలో ప్రజలు

