ETV Bharat / state

ఆరు నెలలుగా మూడు జిల్లాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న బెబ్బులి

ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశం - సాంకేతికతతో పులి వెతుకులాట - కనిపిస్తే సమాచారం ఇవ్వాలని అటవీశాఖ అధికారుల విజ్ఞప్తి

Tiger Terror in Three Districts Of State
Tiger Terror in Three Districts Of State (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 28, 2026 at 12:22 PM IST

3 Min Read
Choose ETV Bharat

Tiger Terror in Three Districts Of State : గత ఆరు నెలలుగా ఓ 'పులి' ఏలూరు, పోలవరం, తూర్పుగోదావరి జిల్లాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఆ పులి ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలోని అటవీ ప్రాంతంలో సంచరిస్తోంది. దాని కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అటవీ శాఖ అధికారులు ప్రత్యేక బృందాలతో నిఘా కొనసాగిస్తున్నారు. కాలర్‌ ఐడీ, ట్రాకర్‌, శాటిలైట్‌ సాంకేతికతను వినియోగిస్తూ దాని కదలికలను పర్యవేక్షిస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశం : ఈ పులి తొలుత ఛత్తీస్‌గఢ్‌ అడవుల నుంచి జనవరిలో ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి బుట్టాయగూడెం, కొయ్యలగూడెం మండలాల అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ స్థానికుల్లో భయాందోళనలు సృష్టించింది. అనంతరం జనవరి 31న తూర్పుగోదావరి జిల్లా అడవుల వైపు వెళ్లింది.

బంధించి విశాఖ జూకు తరలింపు : తూర్పుగోదావరి జిల్లాలోని రాయవరం సమీపంలో పులి సంచారం పెరగడంతో అటవీ శాఖ అప్రమత్తమైంది. పుణె నుంచి ప్రత్యేక నిపుణుల బృందాన్ని రప్పించి పులిని సురక్షితంగా బంధించారు. అనంతరం దానిని విశాఖపట్నం జంతు ప్రదర్శనశాలకు తరలించి కొంతకాలం సంరక్షణలో ఉంచారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పులి మెడకు ఆధునిక కాలర్‌ ఐడీ అమర్చి ఫిబ్రవరిలో పోలవరం జిల్లా పరిధిలోని పాపికొండల అభయారణ్యంలో తిరిగి వదిలిపెట్టారు.

మళ్లీ గ్రామాల వైపు పయనం : అభయారణ్యంలో విడిచిపెట్టిన తర్వాత కూడా పులి అడవుల్లోనే పరిమితం కాలేదు. ఏప్రిల్‌ 14న గోదావరి నదిని దాటి కొత్తూరు ముంపు గ్రామంలోకి ప్రవేశించింది. అక్కడ సుమారు వారం రోజుల పాటు సంచరిస్తూ గుంజవరం సమీపంలో ఒక దూడను చంపింది. అనంతరం పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తిరిగి ఏప్రిల్‌ 21న సింగన్నపల్లి వద్ద మళ్లీ గోదావరిని దాటి పోలవరం జిల్లా పరిధిలోని పూడిపల్లి గ్రామానికి చేరుకుంది. అక్కడ దాదాపు నెలరోజులు సంచరించిన తర్వాత తిరిగి ఈ నెల 21న సిరివాక సమీపంలో గోదావరిని దాటి ఏలూరు జిల్లా పరిధిలోకి ప్రవేశించింది. ప్రస్తుతం బుట్టాయగూడెం మండల అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

గ్రామస్తుల్లో ఆందోళన : పులి తరచూ గ్రామాల సమీపానికి రావడం, పశువులపై దాడి చేయడం వల్ల అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు భయంతో జీవిస్తున్నారు. రైతులు, పశువుల కాపరులు అడవుల్లోకి వెళ్లేందుకు వెనుకాడుతున్నారు. అటవీ శాఖ అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

గుర్తింపు కోసం :

  • కాలర్‌ ఐడీతో నిరంతర నిఘా : పులి కదలికలను ఖచ్చితంగా గుర్తించేందుకు విశాఖ జూలోనే దాని మెడకు సౌరశక్తితో పనిచేసే ఆధునిక కాలర్‌ ఐడీ అమర్చారు. సూర్యరశ్మి తగిలినప్పుడల్లా ఈ పరికరం స్వయంచాలకంగా ఛార్జ్‌ అవుతూ పులి ఉన్న ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని పంపిస్తుంది. దీంతో అధికారులు దాని సంచార మార్గాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.
  • ట్రాకర్‌తో కదలికల గుర్తింపు : అటవీ సిబ్బంది ప్రత్యేక ట్రాకర్‌ పరికరాలను వినియోగిస్తున్నారు. యాంటెన్నా రూపంలో ఉండే ఈ ట్రాకర్‌ సుమారు 500 మీటర్ల పరిధిలో ఉన్న పులి కదలికలను గుర్తించగలదు. రాత్రి మొత్తం ఛార్జింగ్‌లో ఉంచి పగలంతా వినియోగించేలా వీటిని సిద్ధం చేస్తున్నారు. కాలర్‌ ఐడీ నుంచి వచ్చే సంకేతాల ఆధారంగా ట్రాకర్‌తో పులి ఉన్న ప్రాంతాన్ని మరింత ఖచ్చితంగా గుర్తిస్తున్నారు.
  • శాటిలైట్‌ ఆధారంగా పర్యవేక్షణ : మంగళగిరిలోని అటవీ శాఖ ప్రధాన కార్యాలయంలో శాటిలైట్‌ ద్వారా అందే సంకేతాలను ప్రత్యేక యాప్‌ ద్వారా నిరంతరం పరిశీలిస్తున్నారు. అక్కడి నుంచి వచ్చిన సమాచారాన్ని వెంటనే జిల్లా అటవీ శాఖ అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి పంపిస్తున్నారు. ఆ వివరాల ఆధారంగా ట్రాకర్‌ సహాయంతో పులి జాడను గుర్తిస్తూ రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయి.

ప్రత్యేక బృందాల కృషి : పులి సంచారాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు జిల్లా అటవీ శాఖ అధికారులతో పాటు ప్రత్యేక రెస్క్యూ బృందాలు, బెంగళూరు నుంచి వచ్చిన వన్యప్రాణి నిపుణులు సంయుక్తంగా పనిచేస్తున్నారు. పులి అడవుల్లోనే ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామాల్లోకి వస్తే వెంటనే స్పందించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజలు ఒంటరిగా అడవుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, పులి కనిపించిన వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

అభయారణ్యం నుంచి బయటికొచ్చిన బెబ్బులి - పాపికొండలకు తగ్గిన పర్యాటకుల సంఖ్య

బెబ్బులి రీ ఎంట్రీ - భయాందోళనలో ప్రజలు