నేటి నుంచి 3వ విడత పులుల గణన ప్రారంభం - తొలుత మార్కాపురం డివిజన్‌లోనే!
దేశంలో ఎన్‌టీసీఏ నాలుగేళ్లకోసారి పులుల గణన నిర్వహణ - నల్లమలలోని ప్రధాన ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాల ఏర్పాటు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 3, 2026 at 11:57 AM IST
Tiger Census Third Phase Counting Begins in Nallamala Forest : నల్లమలలో నేటి నుంచి మూడో విడత పులుల గణన ప్రారంభం కానుంది. ఇందుకు అవసరమైన చర్యలను అటవీ శాఖ చేపట్టింది. దేశంలో ఎన్టీసీఏ 4 ఏళ్లకు ఒకసారి పులుల గణన నిర్వహిస్తుంది. 3 విడతల్లో నిర్వహించే గణనలో ఇప్పటివరకు 2 విడతలు పూర్తి అయ్యాయి. తొలి విడతలో డిసెంబరు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు చేపట్టారు.
అటవీశాఖ సిబ్బంది తొలి 3 రోజులు మాంసహార జంతువులు, మరో 3 రోజులు శాఖహార జంతువులు, అటవీ స్థితిగతులు పరిశీలించారు. అలాగే వృక్ష సంపద, వేట, మానవ ప్రమేయంతో అటవీ ప్రాంతానికి కలిగిన నష్టాలు, పులుల మలమూత్రాలు తదితర వాటిని సేకరించారు. వీటిని ఫోన్లో ఎం-స్ట్రైప్స్ ఎకలాజికల్ యాప్‌లో వివరాలను నిక్షిప్తం చేశారు.
2వ విడతలో ఎన్‌టీసీఏ శాటిలైట్ వ్యవస్థను ఉపయోగించి అడవుల స్థితిగతులు, వన్యప్రాణుల సంచారం పసిగట్టారు. పులుల గణనకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అవి సంచరించే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఎదురెదురుగా 2 ట్రాప్ కెమెరాలు బిగిస్తారు. వీటిలో బంధించిన చిత్రాలను సేకరించి వాటి చారలను పరిశీలిస్తారు. ఒకదానికి ఉన్న చార మరొక దానికి ఉండదు. దీంతో వాటి లెక్క పక్కాగా తేలుతుంది.
తొలుత ఆ డివిజన్‌లోనే: మార్కాపురం,ఆత్మకూరు అటవీ డివిజన్లలో శనివారం నుంచి పులుల గణన చేపట్టనున్నారు. మార్కాపురం, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఎన్‌ఎస్‌టీఆర్‌లో మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, ఆత్మకూరు అటవీ డివిజన్లు ఉన్నాయి. ఇందులో భాగంగా మార్కాపురం డివిజన్లోని మార్కాపురం, దోర్నాల, కొర్రప్రోలు, గంజి వారిపల్లె, నెక్కంటి, యర్రగొండపాలెం, వీపీసౌత్ అటవీ రేంజ్లోని 44 బీట్ల పరిధిలో 703 పాయింట్లను పులులు సంచరించే ప్రదేశాలుగా గుర్తించారు.
ఆయా ప్రదేశాల్లో 1,406 కెమెరాలు ఏర్పాటు చేశారు. 40 మెగా పిక్సెల్ సామర్థ్యం, సెన్సార్ సిస్టంతో రూపొందించిన ఇన్ ప్రారెడ్ కెమెరాలు బిగించారు. ఫిబ్రవరి 10వ తేదీ వరకు కెమెరాలను ఉంచి పులుల చిత్రాలను సేకరించనున్నారు. ఆ సమాచారాన్ని ఎన్టీసీఏకు పంపిస్తారు.
నేటి నుంచి లెక్కింపు:-
' మార్కాపురం, ప్రకాశం, కర్నూలు జిలాల్లో 2,36,100 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో నేటి నుంచి 40 రోజుల పాటు పెద్ద పులుల గణన ప్రక్రియను నిర్వహించనున్నాం. మార్కాపురం, అమ్మకూర్ డివిజన్‌ల్లో ముందుగా పులుల గణన ప్రారంభం అవుతుంది.' - మహ్మద్ అబ్దుల్ రవూఫ్, డిప్యూటీ డైరెక్టర్, మార్కాపురం అటవీశాఖ
నాలుగు దశల్లో కొనసాగనున్న ప్రక్రియ: దేశవ్యాప్తంగా పెద్ద పులుల సంఖ్య తేల్చేందుకు 10 నెలల సమయం పడుతుంది. మొత్తం 4 దశల్లో ఈ ప్రక్రియ జరుగుతుంది. మొదటి దశలో అడవిలో సంచరించే పెద్ద పులుల పాదముద్రలను సేకరిస్తారు. చెట్లపై అవి గీసిన చారలు ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆ వివరాలు అన్నింటినీ నమోదు చేస్తారు. ఇలా వారం రోజుల పాటు ఈ ప్రక్రియ సాగుతుంది. 2వ దశలో శాటిలైట్ల సాయంతో అటవీ ప్రాంతంలో ఫొటోలు తీస్తారు.
ఆ తర్వాత దశలో అవి సంచరించే ప్రదేశాల్లో ప్రతి 4 చదరపు కిలోమీటరు పరిధిలో ఎదురెదురు చెట్లకు 2 ట్రాప్ కెమెరాలు చొప్పున బిగిస్తారు. ఆ కెమెరాల్లో నమోదైన చిత్రాలను సేకరిస్తారు. ఇలా 3 స్థాయిల్లో గుర్తించిన అంశాలను 4వ దశలో విశ్లేషించి వాస్తవ పులుల సంఖ్యను లెక్కకడతారు. రాష్ట్రంలో నాగార్జున సాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వు విస్తీర్ణం 3,296.31 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ఇందులో ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాలు విస్తరించి ఉన్నాయి.
ఎన్‌ఎస్‌టీఆర్‌లో పులుల గణన - ఎలా లెక్కిస్తారంటే!
పులుల గణన ప్రారంభం- 3 విడతల్లో ప్రక్రియ- ఎందుకు? ఎలా చేస్తారు?

