కర్ణాటకలో రైలు ప్రమాదం - ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఏపీవాసులు మృతి
పట్టాలు దాటుతుండగా ఢీకొన్న రైలు - మృతులు హిందూపురం పట్టణానికి చెందినవారిగా గుర్తింపు - అవ్వ, ఇద్దరు మనవరాళ్ల మరణంతో రోదిస్తున్న కుటుంబం

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 31, 2026 at 4:35 PM IST
Three People Died By Hitting Train : కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లా దొడ్డబల్లాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో ఒక అవ్వ, ఆమె ఇద్దరు మనవరాళ్లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన హస్నాబాద్ వాసులుగా రైల్వే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
ఒక రైలు ప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. కర్ణాటకలోని దొడ్డబల్లాపూర్ ప్రాంతంలో ఉన్న బంధువులను కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. దొడ్డబల్లాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని ముత్తూరు వద్ద పట్టాలు దాటుతుండగా, లతూర్-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 16584) ఢీకొనడంతో ఇర్ఫానా (46), ఆమె మనవరాళ్లు రుక్యానా (13), రఖియా (8) మరణించారు. వారు తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ వారిని ఢీకొట్టడంతో ఆ ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.
వారి రాక కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులను ఈ ముగ్గురి మరణ వార్త తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులను కోల్పోవడంతో హిందూపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

