ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో విషాదం - ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య

చీమకుర్తి మండలం అగ్రహారంలో హృదయ విదారక ఘటన - ​భార్య వెళ్లిపోయిందన్న మనస్తాపంతో కన్నబిడ్డల ఉసురు తీసిన తండ్రి - పిల్లలకు విషమిచ్చి, ఆపై తానూ ఆత్మహత్య

​Prakasam Family Suicide
​Prakasam Family Suicide (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 19, 2026 at 10:16 AM IST

3 Min Read
Choose ETV Bharat

​Prakasam Family Death Case : కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడయ్యాడు. ఏ పాపం ఎరుగని ముగ్గురు పసికందులను నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్నాడు. మురిపెంగా పెంచుకున్న కూతుళ్లకు విషమిచ్చి చంపేసి, ఆ తర్వాత తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకరమైన, హృదయ విదారక ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కే.వి. అగ్రహారం ఈ దారుణానికి వేదికైంది. సుధాకర్‌ అనే వ్యక్తి గతంలో స్కూల్ బస్సు డ్రైవర్‌గా పని చేశాడు. ఇటీవల ఓ గ్రానైట్ క్వారీలో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. పెద్దమ్మాయి గోఅచ్యుత (13), రెండో అమ్మాయి పూజిత (11), చిన్నమ్మాయి లోకితశ్రీ (8).

పసివాళ్లకు విషం ఇచ్చాడు : కుటుంబ కలహాల నేపథ్యంలో సుధాకర్‌ భార్య మూడేళ్ల క్రితం అతడిని, పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. అప్పటినుంచి వృద్ధురాలైన తన తల్లి, ముగ్గురు పిల్లలతో కలిసి సుధాకర్‌ ఒకే ఇంట్లో ఉంటున్నాడు. భార్య లేని లోటు తెలియకుండా పిల్లలను సాకుతున్నాడు. అయితే ఏమనుకున్నాడో ఏమో కానీ ఊహించని దారుణానికి ఒడిగట్టాడు. రాత్రి పిల్లలకు భోజనం పెట్టి ముగ్గురినీ ఒకే మంచంపై పడుకోబెట్టాడు. సుధాకర్‌ తల్లి గేదెల వద్ద పడుకునేందుకు బయటకు వెళ్లిపోయింది. రాత్రి సమయంలో నిద్రపోతున్న ఆ పసివాళ్లకు విషం ఇచ్చాడు. ఉదయం సుధాకర్‌ తల్లి ఇంటికి వచ్చి పిల్లలను నిద్రలేపమంది. ఆ సమయంలో మంచం వద్దే ఉన్న సుధాకర్‌, "అప్పుడే నిద్రలేపొద్దు, వాళ్లను నేను తర్వాత లేపుతాను. టిఫిన్ తెచ్చి పెడతాను" అని చెప్పి బైక్‌పై బయటకు వెళ్లిపోయాడు.

"సుధాకర్ ముగ్గురు పిల్లలను ఒక మంచం మీద పడుకోబెట్టాడు. వాళ్ల అమ్మ వచ్చి పిల్లలను లేపుతుంటే 'అమ్మను లేపబాకండి, పడుకుంటారు, నేను టిఫిన్ తెస్తాను' అని చెప్పి వెళ్లిపోయాడు. వెళ్లిపోయి చెట్టుకి ఉరేసుకున్నాడు. వాళ్ల అమ్మ కాసేపు ఆగిన తర్వాత పిల్లలను లేపితే, వాళ్లు లేవలేదు. అప్పుడు ఇంటి పక్కన వాళ్లను పిలిస్తే పిల్లలు చనిపోయి ఉన్నారు. సుధాకర్ ఏమయ్యాడు అని వెతుకుతుంటే ఎవరికో చెట్టుకు ఎవరో వేలాడుతున్నట్లు కనిపించాడు. ఇతను గతంలో స్కూల్ బస్సుకు వెళ్లేవాడు, గేదెలు ఉండేవి. ఈ మధ్య ఒక నెల నుంచి క్వారీకి వెళ్తున్నాడు. అప్పులు అంటూ ఎవరికీ లేనివి ఏముంటాయి. కానీ అప్పుల వాళ్లు వచ్చి గొడవ చేసిన దాఖలాలు లేవు. భార్యాభర్తలకు కుదరక ఆమె మూడేళ్ల క్రితమే వెళ్లిపోయింది. మధ్యలో ఒకసారి ఆమె వచ్చి పిల్లలు కావాలని అడిగితే వీళ్లే పంపించలేదు." -స్థానికుడు

ఆ తర్వాత కాసేపటికి ఆ నాయనమ్మ పిల్లలను లేపే ప్రయత్నం చేసింది. ఎంతకీ వాళ్లు లేవకపోవడంతో భయపడి చుట్టుపక్కల వారిని పిలిచింది. అప్పటికే ఆ ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా మారిపోయారు. కళ్లముందే మనవరాలు విగతజీవులుగా పడి ఉండటంతో ఆ వృద్ధురాలి రోదనలు మిన్నంటాయి. మరోవైపు పిల్లల తండ్రి సుధాకర్‌ ఏమయ్యాడో అని గ్రామస్థులు వెతకడం ప్రారంభించారు. ఇంటికి పావు కిలోమీటరు దూరంలో ఉన్న ఓ చెట్టుకు సుధాకర్‌ ఉరేసుకుని విగతజీవుడిగా కనిపించాడు.

"కే.వి అగ్రహారంలో తండ్రి, ముగ్గురు కుమార్తెలు మరణించడం జరిగింది. మృతుడు ఏకుల సుధాకరు. భార్యతో గొడవల వల్ల ఆమె మూడేళ్ల క్రితం ఇతన్ని వదిలేసి వెళ్లింది. అప్పటినుంచి ఇతను, తన తల్లి, ముగ్గురు పిల్లలు ఒకే ఇంట్లో ఉంటున్నారు. రాత్రి పిల్లలు ముగ్గురూ భోజనం చేసి ఒకటే మంచం మీద పడుకున్నారు. నాయనమ్మ గేదెల వద్దకు వెళ్లేటప్పుడు తండ్రి పిల్లల దగ్గరే ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఉదయం ఆమె వచ్చేసరికి పిల్లలు అలాగే పడుకుని ఉన్నారు. నాయనమ్మ లేపేసరికి పిల్లలు ముగ్గురు చనిపోయి ఉన్నారు. సుధాకరు కూడా పావు కిలోమీటర్ దూరంలో పొలంలో ఓ చెట్టుకు ఉరివేసుకొని కనిపించాడు. ముగ్గురు పిల్లల మృతిపై ఒక కేసు, ఇతను ఉరివేసుకున్న ఘటనపై మరో కేసు మొత్తం రెండు కేసులు నమోదు చేసి చీమకుర్తి సీఐ, ఎస్సై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి దర్యాప్తు తర్వాతే అసలు కారణాలు తెలుస్తాయి." - శ్రీనివాసరావు, ఒంగోలు డీఎస్పీ

దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భార్య దూరమైందన్న మనస్తాపం, పిల్లల భవిష్యత్తుపై బెంగతోనే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కర్నూలు జిల్లాలో పురుగు మందు తాగి కుటుంబం ఆత్మహత్యాయత్నం - ఇద్దరు మృతి

శ్రీ సత్యసాయి జిల్లాలో విషాదం - అప్పుల భారంతో పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య