తెలుగు వెలుగుల వేడుక 'అనురాగ సంగమం' నేడే ప్రారంభం
మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు సిద్ధమైన గుంటూరు - నేటి నుంచి మూడు రోజులపాటు నిర్వహణ -ఐదు ప్రాంగణాల్లో కార్యక్రమాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 3, 2026 at 9:25 AM IST
World Telugu Conference Begins in Guntur Today : మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు గుంటూరులో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు (శనివారం) ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవ సభ జరగనుంది. అన్నమయ్య కీర్తనల సహస్ర గళార్చన నడుమ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విశ్వయోగి విశ్వంజీ, ఏపీ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అదే సమయంలో మహాసభల ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేసిన నాలుగు ఉపవేదికలపై సన్మానాలు, సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, తెలుగు చలనచిత్ర గీతాలాపనలు మొదలు కానున్నాయి.
రామోజీరావు హస్తకళల ప్రాంగణం : ఈ కార్యక్రమాలు రాత్రి 11 గంటల వరకు జరుగుతాయని మహాసభల నిర్వాహకుడు, ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఆధ్యాత్మిక వేదికపై ప్రవచనాలు, హోమాలు, కల్యాణాలు ఉంటాయన్నారు. ప్రధాన వేదిక ముందు ఏర్పాటు చేసిన రామోజీరావు హస్తకళల ప్రాంగణంలో తెలుగు భాష ప్రాచీనత్వాన్ని ప్రస్ఫుటించేలా పురాతన సాహిత్యం, ప్రాచీన నాణేలు, తెలుగు సంప్రదాయ వంటకాలు సందడి చేయనున్నాయి. సాయంత్రం ఏర్పాటు చేసిన ఆంధ్ర శ్రీపూర్ణకుంభ పురస్కారాల సభకు ముఖ్య అతిథిగా ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు హాజరు కానున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్.మానవేంద్రనాథ్‌రాయ్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, విశ్వహిందూ పరిషత్తు సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొననున్నారు.
ఈ సభలకు తెలుగువారి 'అనురాగ సంగమం'గా నామకరణం చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. మొత్తం 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ సభలు జరగనున్నాయి. అయితే ప్రధానంగా 10 ఎకరాల్లో పార్కింగ్, మరో 10 ఎకరాల్లో వేదికలు ఏర్పాటవుతున్నాయి. దాదాపు 5,000 మంది కూర్చునేలా నందమూరి తారకరామారావు పేరుతో ప్రధాన వేదికను నిర్మిస్తున్నారు. కవి సమ్మేళనాలకు జాషువా, కరుణశ్రీ వేదిక, అవధానాల ప్రదర్శనల కోసం కొప్పరపు కవుల వేదిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తూము నరసింహదాసు వేదిక, పాడనా తెలుగు పాట కోసం ఘంటసాల, ఎస్.పి.బాలు వేదికలు ఏర్పాటు చేస్తున్నారు.
రెండో రోజు మారిషస్ అధ్యక్షుడు హాజరు : 4వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న సభలకు మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్‌బీర్ గోకుల్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. శనివారం రాత్రికే ఆయన గుంటూరు చేరుకోనున్నారు. ఉత్తరాఖండ్ జ్యోతిష్మఠ్ జగద్గురు ఆదిశంకరాచార్య పీఠం ఉత్తరాధికారి స్వామి ప్రత్యక్ చైతన్య ముకుందానందగిరి శంకరాచార్య మహరాజ్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, శాసనమండలి ఛైర్మన్ పి.మోషేనురాజు, మంత్రులు పాల్గొంటారు. సాయంత్రం జరిగే కార్యక్రమాలకు త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి హాజరవుతారు. ఈ సందర్భంగా ఆంధ్ర సారస్వత సేవా పురస్కారాల ప్రదానం జరగనుంది.
ముఖ్యులు, ప్రత్యేక కార్యక్రమాలు : మహాసభల చివరి రోజైన సోమవారం ఉదయం కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు, గోవా గవర్నర్ అశోక్‌గజపతిరాజు, పలువురు మంత్రులు హాజరవుతారు. మూడో ప్రపంచ తెలుగు మహాసభల పోస్టల్ కవర్‌ను సీఎం ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం సభలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ‘మన తెలుగు భాష - అమృత భాష’ అంశంపై ప్రసంగించనున్నారు. సాయంత్రం జరిగే ముగింపు సభకు సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, మంత్రి లోకేశ్ హాజరుకానున్నాట్లు సమాచారం.
అవార్డుల ప్రదానం, సాహిత్య ప్రక్రియలు : మూడు రోజుల కార్యక్రమంలో అనేక తెలుగు సాహిత్య ప్రక్రియలు అలరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అష్టావధానాలు, తెలుగు గజల్ సదస్సులు, భక్తి సాహిత్యం, చలనచిత్ర సాహిత్యంపై ప్రసంగాలు, ఇష్టాగోష్ఠులు, గీతాలాపనలు, వివిధ రకాల పురస్కారాల ప్రదానం చేపట్టనున్నట్లు వివరించారు. తెలుగు సంప్రదాయ వంటకాలతో విందు ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సంబంధిత అధికారులు తెలుపుకున్నారు.
గుంటూరులో జనవరి 3 నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు
మాతృభాషకు పెద్దపీట వేయడం ప్రభుత్వం, ప్రజల బాధ్యత: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

