పిల్లలు సెల్ఫోన్లకే పరిమితమవుతున్నారా? - ఈ సెలవుల్లో 'హాలిడేస్ డైరీ' ట్రై చేయించండి!
పిల్లలకు దసరా సెలవులు వచ్చాయి. తరచూ మారాం చేస్తున్నారని వారిని మొబైళ్లతోనే కాలక్షేపం చేయకుండా ఏదో కొత్త నైపుణ్యం నేర్చుకునేలా ప్రోత్సహించాలి. గ్రామాల్లో పొలాలు లేదా నగరాల్లో కొత్త ప్రాంతాలకు తిప్పి చూపించాలి.

Published : October 11, 2026 at 5:13 PM IST
Children Dasara Holidays Planning : దసరా పండుగ వచ్చిందంటే చాలు బడి పిల్లలకు ముందుగా వరుస సెలవులు గుర్తొస్తాయి! అప్పట్లో స్మార్ట్ఫోన్లు లేకపోవడంతో ఈ సెలవు రోజుల్లో అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యల చెంతన సరదాగా గడిపేవారు. ఊరు, పొలాల్లో తిరిగి ఏదో ఓ కొత్త విషయాలను తెలుసుకునేవారు.
కానీ ఇప్పుడు పట్టణాల నుంచి సొంతూళ్లకు వెళ్లినా ఎప్పుడూ చేతిలో ఫోన్, లేదంటే టీవీ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. తేరుకునేలోపే సెలవులు అయిపోతాయి. స్కూళ్లు తిరిగి తెరిచే సమయానికి 'అసలు ఇన్ని రోజులు ఏం చేశాం?' అనే ప్రశ్న మెదులుతుంది. అలా కాకుండా ఈ సెలవుల్లో పిల్లలకు కొత్త అనుభవాలను పరిచయం చేస్తే, వారు కొన్ని కొత్త అంశాలు నేర్చుకునే వీలుంటుంది.
గ్రామ సందర్శన ఓ ప్రత్యేక అనుభవం
ఈ సెలవులకు పట్టణాల్లో, హాస్టళ్లలో చదువుతున్న పిల్లలు తమ సొంత గ్రామాలకు వెళ్తుంటారు. అక్కడ నానమ్మ, తాతయ్యలతో సమయం గడపడం ఓ విశిష్ట అనుభూతి. వారి వెంబడే ఉంటే పంటలు, చెరువులు, పశువులు ఇలా గ్రామీణ జీవన విధానాన్ని దగ్గరగా చూడొచ్చు. దీని ద్వారా పిల్లలు పుస్తకాల్లో చదివిన వ్యవసాయం, పంటల సాగును ప్రత్యక్షంగా చూడగలరు. వీలైతే మట్టిలో మొక్కలు నాటడం లేదా మొక్కలకు నీరు పోయడం వంటి చిన్న చిన్న తోట పనుల్లో పాలు పంచుకునేలా చేయాలి. దీనిద్వారా పిల్లలకు ప్రకృతి పట్ల ఆసక్తి పెరుగుతుంది.
పెద్దల కథలే పిల్లలకు పాఠాలు
నాన్నమ్మ, తాతయ్య వద్ద కూర్చొని వారి చిన్ననాటి సంగతులు, జ్ఞాపకాలు, అప్పుడు పండుగలు జరుపుకునే విధానం గురించి తెలుసుకోవచ్చు. వీటితో పాటు అప్పట్లో ఆడే ఆటలు, ఇంటి వంటలు, గ్రామంలోని ఆచారాలు ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకుంటారు. ఈ సంగతులను రాసుకోవడమో లేదా ఆడియోగానో రికార్డ్ చేసుకుంటే కుటుంబ చరిత్రను భద్రపరచడంలో సహాయపడినట్లు కూడా అవుతుంది.
ఈ విధంగా ప్లాన్ చేసుకోండి
- ఉదయం: వ్యాయామం, ఆటలు
- మధ్యాహ్నం: పుస్తకాలు చదవడం
- సాయంత్రం: ఏదైనా కొత్త నైపుణ్యం లేదా కళ నేర్చుకోవడం
- రాత్రి : కుటుంబ సభ్యులతో మాట్లాడటం, కథలు వినడం
కొత్త స్కిల్ కోసం రోజులో కొద్దిసేపు
కొందరు సెలవుల్లోనూ పిల్లలను పూర్తిగా పాఠ్య పుస్తకాలకే పరిమితం చేస్తుంటారు! అలా చేయకుండా వారికి ఆసక్తి ఉన్న కొత్త నైపుణ్యాన్ని నేర్పించే ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు పెయింటింగ్, సంగీతం, డ్యాన్స్, మట్టితో బొమ్మలు చేయడం, కాగితపు కళలు, వంట, కుట్టుపని, తోటపని వంటి వాటిలో దేన్నైనా ఎంచుకోవచ్చు.
అలాగని రోజంతా వీటికే కేటాయించే అవసరం లేదు. రోజులో కేవలం ఓ గంటసేపు సాధన చేసినా సెలవులు ముగిసేలోపు వారు ఓ కొత్త నైపుణ్యంలో ప్రావీణ్యం సంపాదించొచ్చు. అలాగే కనీసం రెండు లేదా మూడు పుస్తకాలు చదవేలా వారిని ప్రోత్సహించాలి. వీలైతే పిల్లలకు సామాజిక బాధ్యత పట్ల కూడా అవగాహన కల్పించొచ్చు.
కుటుంబంతో ఓ రోజు
ప్రతిసారి సెలవుల్లో ఖరీదైన టూర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. కుటుంబంతో కలిసి నగరంలోని పార్కు, జూ, మ్యూజియం, చారిత్రక ప్రదేశం, సరస్సు లేదా ప్రకృతి ప్రదేశాన్ని సందర్శించొచ్చు. పిల్లలు తాము చూసిన వాటి గురించి నోట్ రాసుకోవచ్చు. ఆయా ప్రాంతాల్లో ఫొటోలు తీసి దాన్ని 'నా హాలిడేస్ డైరీ'గా రూపొందించుకోవచ్చు. సెలవులు అంటే కేవలం సమయం గడపడం మాత్రమే కాదు. జీవితానికి కొత్త అనుభవాలను జోడించుకోవడం కూడా. అందుకే ఈ సెలవులను పిల్లలకు ఆనందం, వినోదంతో పాటు జ్ఞాపకాలు, విజ్ఞానం, కొత్త నైపుణ్యాలను అందించేలా మార్చుకుందాం.
దసరా సెలవులొచ్చేశాయ్ - స్మాల్ టూర్ ప్లాన్ చేయండి - ఈ ప్రదేశాలను చుట్టేసి రండి!

