ETV Bharat / state

నీళ్లు లేక ఎండుతున్న పంటలకు ట్యాంకర్లతో నీరు - తిమ్మారెడ్డిగూడ రైతుల అవస్థలు

Farmers watering crops by tankers - రాష్ట్రంలో ఎల్​నినో ప్రభావం తీవ్రమవుతోంది. వర్షాలు పడకపోవడంతో పాటు ఉన్న భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతులు పంటలను బతికించుకునేందుకు ట్యాంకర్లను తెప్పించుకునే దుస్థితి ఏర్పడింది.

Etv Bharat
ఎల్​నినో ప్రభావంతో అడుగంటిన భూగర్భజలాలు (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : October 13, 2026 at 3:49 PM IST

2 Min Read
Choose ETV Bharat

Farmers Watering Crops By Tankers : వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో వరి పంటను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నాడు. పొలంలో నీరు లేక వరి పంట ఎండిపోతుండటంతో ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి పంటకు అందిస్తున్నారు. రోజుకు రూ.1,000 అద్దె చెల్లిస్తూ పంటను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న రైతుల పరిస్థితి అన్నదాతల కష్టాలకు అద్దం పడుతోంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడ గ్రామంలో చోటుచేసుకుంది.

తగ్గిన విద్యుత్​ సరఫరా

గ్రామానికి చెందిన రాజు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలాలు తగ్గిపోయితున్నాయి. దాంతో బోరుబావుల్లో నీటి మట్టం పడిపోవడంతో సకాలంలో నీరు అందడం లేదు. దీనికి తోడు విద్యుత్ సరఫరా కూడా సక్రమంగా లేకపోవడంతో పంటకు నీరు పెట్టలేని పరిస్థితి నెలకొంది. పంటకు నీరు అందక ఎండిపోతుండటంతో ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తుందని తెలిపాడు.

పంటలకు నీరు లేక ఇబ్బంది పడుతున్న తిమ్మారెడ్డిగూడ రైతులు (ETV Bharat)

రోజుకు 10 నుంచి 15 ట్యాంకర్లు

గత వారం రోజులుగా రోజుకు 10 నుంచి 15 ట్యాంకర్ల నీటిని పొలానికి తరలిస్తూ పంటను బతికించుకునేందుకు శ్రమిస్తున్నట్లు రైతు రాజు తెలిపాడు. మరో 20 రోజుల పాటు ఇదే విధంగా నీటిని అందిస్తేనే పంట చేతికి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. లేదంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని విచారం వ్యక్తం చేశాడు. ఇప్పటికే అర ఎకరం వరి పంట పూర్తిగా ఎండిపోవడంతో ఆ భూమిలో పశువులను మేపాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపాడు.

"ఇంకా 20, 25 రోజులు పంటకు నీరు ఖచ్చితంగా పోయాలి. 25 రోజులు పోస్తేనే నోట్లోకి కొన్ని ముద్దలు వస్తాయి. లేదంటే మనం వదిలేసుకోవాల్సిందే. వదిలేసుకున్నాం అంటే తినటానికి కూడా ఉండదు. ప్రభుత్వం మమల్ని పట్టించుకోవాలి. మాకు ఏ పంట వేసుకోవాలి, ఏది వేసుకోవద్దని అధికారులు సూచనలు ఇవ్వాలి. ఎల్​నినోపై మాకు అవగాహన కల్పించాలి" - రాజు, రైతు

స్పందించని అధికారులు

ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటునా ఇప్పటివరకు వ్యవసాయ శాఖ అధికారులు కానీ, ఇతర సంబంధిత అధికారులు కానీ స్పందించలేదని రైతులు వాపోతున్నారు. పంట సాగు చేసే సమయంలో నీటి లభ్యత, విద్యుత్ సరఫరా వంటి సమస్యలపై రైతులకు తగిన సూచనలు అందించాలని కోరారు. ఇప్పటికే కరెంట్ కష్టాలు ఎక్కువగా ఉన్నపటికీ పట్టపగలే లైట్స్ వెలుగుతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలని రైతు విజ్ఞప్తి

వరి పంటను కాపాడుకునేందుకు అప్పులు చేసి మరీ నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాజు లాంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వ్యవసాయానికి సకాలంలో విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. అలాగే పంటలకు నీటి కొరత ఏర్పడిన ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించి రైతులకు అవసరమైన సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటల పరిస్థితిని అంచనా వేసి తగిన సలహాలు, సూచనలు అందించాలని కోరుతున్నారు.

బండలే తప్ప బిందెడు నీళ్లు లేవు - రాష్ట్రంలో అడుగంటుతున్న భూగర్భజలాలు