ETV Bharat / state

టిప్‌టాప్‌ దొంగ గుట్టు రట్టు - కల్యాణ మండపాలే టార్గెట్​

న్యాట్‌గ్రిడ్‌లో ఫొటో అప్‌లోడ్‌ చేయడంతో వెలుగులోకి విస్తుపోయే నిజాలు - గతంలో బంగారు నగల దుకాణం వ్యాపారం - నిందితుడిని పట్టుకున్న సీసీఎస్‌ పోలీసులకు సీపీ రాజశేఖరబాబు అభినందనలు

Thief arrested at krishna Disrtrict
Thief arrested at krishna Disrtrict (EENADU)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 8, 2026 at 10:51 AM IST

3 Min Read
Choose ETV Bharat

Thief Arrested In Krishna District : టిప్‌టాప్‌గా సంప్రదాయ వస్త్రాలు ధరిస్తాడు, సోగ్గాడిలా తయారవుతాడు. పెళ్లి ఇంట దగ్గరి బంధువులా కనిపిస్తాడు. చేతికి తళతళలాడే రెండు మూడు బంగారు ఉంగరాలు పెట్టుకుని ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరిస్తాడు. పెళ్లి ఇంట్లో ఉన్న వాళ్లు ఆదమరిచి ఉండగా బంగారం, వెండి వస్తువులను తీసుకుని ఉడాయిస్తాడు. ‘న్యాట్‌గ్రిడ్‌’లో అనుమానితుడి ఫొటోను అప్‌లోడ్‌ చేయగానే అతని నేర చరిత్ర మొత్తం ఒక్కసారిగా బట్టబయలైంది. పోలీసులు సైతం ఆశ్చర్యపోయేలా చేసిన అతడి వివరాలు ఇలా ఉన్నాయి.

వెండి బిందెల చోరీపై దృష్టి పెడితే : గత సంవత్సరం నవంబరు 7వ తేదీన విజయవాడ మాచవరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కల్యాణ మండపంలో పెళ్లివారికి చెందిన రెండు వెండి బిందెలు చోరీకి గురయ్యాయి. ఈ కేసు విషయమై సీసీఎస్‌ పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు సీసీ ఫుటేజీలను జల్లెడ పట్టి, వాటి ఆధారంగా ఒక వ్యక్తిని అనుమానించారు. పెళ్లి వీడియో నుంచి అతడి ఫోటోను సేకరించారు. అది మినహా ఈ కేసులో ఏ ఇతర ఆధారాలు లేకపోవడంతో సీసీఎస్‌ పోలీసులు నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ గ్రిడ్‌ ‘న్యాట్‌గ్రిడ్‌ను’ ఆశ్రయించారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే సమగ్ర నిఘా సమాచార వ్యవస్థనే న్యాట్‌గ్రిడ్‌ అంటారు. ముంబయిలో జరిగిన దాడుల తర్వాత అనుమానితుల కదలికలను ముందుగానే గుర్తించి భవిష్యత్తులో ప్రమాదాలను నివారించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. పోలీస్, బ్యాంకింగ్, వీసా, టెలికం, పన్నుల విభాగం తదితర 21 సంస్థల డేటా బేస్‌ను న్యాట్‌గ్రిడ్‌తో అనుసంధానం చేశారు. నిందితుడి ఫొటోను న్యాట్‌గ్రిడ్‌లో అప్‌లోడ్‌ చేయగానే అతడి పేరు నార్ల ధర్మేంద్ర (46)గా తేలింది. అతడు తెనాలికి చెందిన వాడిగా గుర్తించారు.

Dharmendra with finger rings
చేతికి బంగారు ఉంగరాలతో ధర్మేంద్ర (EENADU)

బంగారం వ్యాపారం చేసి : గతంలో ధర్మేంద్ర తెనాలిలో బంగారు నగల దుకాణం నిర్వహించేవాడు. దానిలో నష్టాలు వచ్చాయి. ఈ క్రమంలో వ్యాపారానికి సంబంధించిన పన్నులను ఎగ్గొట్టాడు. దానితో అతడిపై ‘సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌’ (సీబీడీటీ) కూడా కేసు నమోదు చేశారు. అనంతరం ఆ వివరాలు న్యాట్‌గ్రిడ్‌లో ఉంచారు. పోలీసులు నిందితుడి ఫొటోను దానిలో అప్​లోడ్​ చేయగానే అతడి వివరాలన్నీ పూర్తిగా బయటకు వచ్చాయి. బంగారం వ్యాపారంలో నష్టం రావడంతో దొంగతనాలకు ధర్మేంద్ర అలవాటుపడ్డాడు. కల్యాణ మండపాలకు చాలా దర్జాగా వెళ్లి, అక్కడి వారు ఆదమరిచి ఉన్నపుడు చోరీ చేసి ఉడాయించేవాడు.

పాత కేసుల చిట్టా : 2022లో ధర్మేంద్ర కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఒక కల్యాణ మండపంలో 91 గ్రాముల బంగారాన్ని చోరీ చేశాడు. ఆ కేసు వివరాలను సరిపోల్చి చూడగా, దానిలోనూ ఇతడి పాత్ర ఉందని తేలింది. చోరీ సొత్తు నుంచి 61 గ్రాముల బంగారాన్ని పోలీసులు తాజాగా స్వాధీనం చేసుకున్నారు. ఇవి కాక గుంటూరులో కూడా ఇదే తరహాలో కల్యాణ మండపాల్లో రెండు నేరాలు చేయగా అక్కడి పోలీసులు ధర్మేంద్రను అరెస్టు చేశారు.

పోలీసులకు సీపీ అభినందనలు : నిందితుడిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పట్టుకున్న సీసీఎస్‌ పోలీసులను సీపీ రాజశేఖరబాబు ప్రత్యేకంగా అభినందించారు. బృందం సీసీఎస్‌ ఏడీసీపీ ఎం.రాజారావు నేతృత్వంలో సాంకేతికతను ఆధారంగా చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. ఇతని వద్ద 2022 కేసుకు సంబంధించి రూ.9లక్షల విలువైన 61 గ్రాముల బంగారం, గత ఏడాది కేసులో రూ.3లక్షల విలువైన రెండు వెండి బిందెలను స్వాధీనం చేసుకున్నారు.

వైఎస్సార్సీపీ ఎంపీల ఆస్తులు గుట్టురట్టు - నివేదిక విడుదల చేసిన ఏడీఆర్ సంస్థ

ఇరుసుమండ బ్లో అవుట్‌ ఎఫెక్ట్ - 4 గ్రామాలకు ఇబ్బందులు, ఇంటింటా సర్వే