కనీస ప్రమాణాలు కరవు - అనుమతులు అంతంతమాత్రమే - ఏపీలో ఆర్వో ప్లాంట్ల నిర్వహణలో అక్రమాలు
అపరిశుభ్ర వాతావరణంలో ప్రైవేట్ ఆర్వో ప్లాంట్ల నిర్వహణ - ఆరు నగరాల్లో 180కిపైగా అనుమతులు లేని ప్లాంట్లు - పట్టించుకోని అధికారులు - అనారోగ్యం పాలవుతున్న ప్రజలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 25, 2026 at 9:45 AM IST
|Updated : May 25, 2026 at 10:02 AM IST
Private RO Plants Operating in Unsanitary Environments: రాష్ట్రంలో అపరిశుభ్ర వాతావరణంలో ప్రైవేటు ఆర్వో ప్లాంట్లు నిర్వహిస్తున్నారు. 6 నగరాల్లో 180కి పైగా ప్లాంట్లకు కనీసం అనుమతులే లేవు. ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఏటా జనం డయేరియా, ఇతర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. రాష్ట్రంలో ఇదో పెద్ద సమస్యగా తయారైనా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.
180కి పైగా అనధికార ఆర్వో ప్లాంట్లు: పంపుల్లో వచ్చే నీటిలో కలుషిత పదార్థాలు కలుస్తాయనో, ఆర్వో ప్లాంట్ల నీళ్లయితేనే పరిశుభ్రంగా ఉంటాయన్న ఆలోచనతో చాలామంది ప్రైవేటు ఆర్వో ప్లాంట్ల నుంచి నీళ్లు కొని తెచ్చుకుంటున్నారు. అయితే వీటిలో ప్రమాణాలు పాటించకపోవడంతో జనం తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. పలు ప్రధాన నగరాల్లో అనుమతుల్లేకుండానే 180కి పైగా ఆర్వో ప్లాంట్లు నడుస్తున్నట్లు గుర్తించారు. వీటిలో నీరు నాణ్యంగా లేక డయేరియా ప్రబలుతోంది. ఏటా వేసవిలో ఇదో పెద్ద సమస్యగా తయారైనా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
ప్రబలుతున్న డయేరియా కేసులు: అపరిశుభ్ర నీటిలో డయేరియా 2024 ఫిబ్రవరిలో గుంటూరులో డయేరియా ప్రబలి గిరిజన బాలిక మృతి చెందింది. 70 మంది ఆసుపత్రుల్లో చేరారు. అదే ఏడాది మేలో విజయవాడ మొగల్రాజపురంలో డయేరియాతో 8 మంది మృతి చెందారు. వందల మంది ఆసుపత్రి పాలయ్యారు. 2025 సెప్టెంబరులో విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో194 డయేరియా కేసులు నమోదయ్యాయి. లైసెన్సు లేని 51 ఆర్వో ప్లాంట్లను అప్పట్లో అధికారులు మూసేశారు. విజయవాడ, గుంటూరులో గత రెండేళ్లలో భారీగా నమోదైన డయేరియా కేసుల నేపథ్యంలో ఆర్వో ప్లాంట్లపై ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేస్తామని అప్పట్లో అధికారులు ప్రకటించారు. ఈ నంబర్లు ఆర్వో ప్లాంట్లలోనూ అందరికీ కనిపించేలా పెడతామన్నారు. రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు.
ప్రమాణాలు పాటించకుంటే ఫిర్యాదు: ప్రైవేటు ఆర్వో ప్లాంట్లలో ఫిల్టర్లు, యూవీ పరికరాలు సకాలంలో మార్చకపోవడంతో పాటు నీటి పరీక్షలు చేయడం లేదు. దీని వల్ల నీటిలో ఈ-కొలి, క్లెబ్సిల్లా లాంటి బ్యాక్టీరియా కలుస్తోంది. తక్కువ హైడ్రోజన్ సామర్థ్యం గల నీటి సరఫరా జరుగుతోంది. దీని వల్ల జనం డయేరియా, వాంతులు, కడుపునొప్పి బారిన పడుతున్నారు. ప్రైవేటు ఆర్వే ప్లాంట్ల నిర్వహణకు నిర్దేశిత ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్లాంటు పరిసరాల్లో చెత్త, మురుగునీరు ఉండకూడదని ఫిల్టర్లు, మెంబ్రేన్లు, యూవీ పరికరాలు గడువులోగా మార్చాలంటున్నారు. ప్రమాణాలు పాటించకుంటే జనం పుర, నగరపాలక సంస్థల అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
ప్రజలకు శాపంగా మారిన పలు ఆర్వో ప్లాంట్లు - నీటిలో ప్రమాదకర 'ఈ-కోలి' బ్యాక్టీరియా
మూణ్నాళ్ల ముచ్చటగానే ఆర్వో ప్లాంట్లు - తాగునీటికి తల్లడిల్లుతున్న విద్యార్థులు

