పోలీసుల ఇళ్లలో చోరీ - బంగారు ఆభరణాలు, నగదు అపహరణ
ఒకే రోజు రెండు ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన దొంగలు - భారీ ఆభరణాలతో పాటు, నగదు దోచుకెళ్లిన దుంగడుగులు - పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 25, 2026 at 2:12 PM IST
Two Houses That Were Theft : రక్షణ కల్పించాల్సిన పోలీసుల ఇళ్లకే రక్షణ కరువైతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటనే ప్రశ్న కర్నూలు నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. రక్షక భటుల ఇళ్లే లక్ష్యంగా శ్రీనివాసనగర్‌లో దొంగలు పడ్డారు. హెడ్ కానిస్టేబుల్, విశ్రాంత ఆర్‌ఎస్‌ఐ ఇళ్ల తాళాలు పగలగొట్టి ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. శాంతిభద్రతలను కాపాడే పోలీసుల ఇళ్లలోనే ఇంతటి భారీ చోరీలు జరగడంతో స్థానిక సామాన్య ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దొంగలను పట్టుకునేందుకు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇంట్లో లేని సమయంలో చోరీ : కర్నూలు నగరంలో ఇద్దరు పోలీసుల ఇళ్లలో దొంగతనం చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. నాలుగో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న శ్రీనివాసనగర్ కాలనీలో ఏపీఎస్పీ రెండో పటాలానికి చెందిన విశ్రాంత ఆర్ఎస్సై సుబ్బయ్య, ఏపీఎస్పీ రెండో పటాలం హెడ్ కానిస్టేబుల్ మహేశ్ వేర్వేరు ఇళ్లలో నివాసం ఉంటున్నారు. మహేశ్ ఈనెల 22వ తేదీన ఆయన బంధువు అనారోగ్యంతో చనిపోవటంతో అంత్యక్రియల నిమిత్తం నంద్యాల జిల్లా తూడిచెర్ల వెళ్లారు. ఆయన ఇంట్లో చోరీ జరిగినట్లు స్థానికులు గుర్తించి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఇంటికి చేరుకున్న ఆయన అంతా పరిశీలించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 23 తులాల బంగారు ఆభరణాలు, ఆరు తులాల వెండి ఆభరణాలు అపహరణకు గురైనట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆభరణాలు, నగలు చోరీ : మరో కేసులో ఆర్ఎస్ఐ సుబ్బయ్య ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలిసి చర్చికి వెళ్లారు. మధ్యాహ్నం తిరిగి వచ్చేసరికి దొంగలు వీరి ఇంటిని దోచేశారు. బీరువాలో ఉన్న ఐదు తులాల బంగారు ఆభరణాలు, ఐదు తులాల వెండి వస్తువులు, రూ.30 వేల నగదు అపహరణకు గురైనట్లు బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండిళ్లలో నేరాలకు పాల్పడిన దొంగలు ఒకరేనని, పగలే చోరీలకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితుల కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
మేకలను దొంగతనం చేస్తుండగా చూశాడని 11 ఏళ్ల బాలుడి దారుణ హత్య- ఆపై హైడ్రామా!
తిరుపతి సోనోవిజన్‌లో భారీ చోరీ - గోడకు కన్నమేసి 150 ఆండ్రాయిడ్లు, 50 ఐఫోన్లు స్వాహా

