ETV Bharat / state

రీల్స్ చూసి ఆ పంటల సాగు లాభమనుకుంటే భ్రమే! క్షేత్రస్థాయిలో అన్నదాతలకు అవాంతరాలెన్నో

సోషల్ మీడియా హైప్​తో కొత్త రకాల పండ్ల సాగుకు మొగ్గు చూపుతున్న యువ రైతులు - ప్రయోగాలు చేసి తీవ్ర స్థాయిలో నష్టాలు - తగిన సలహాలు, సూచనలతో సాగు చేయాలంటున్న నిపుణులు

Facing Losses In Reality For Young Farmers
Facing Losses In Reality For Young Farmers (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 8, 2026 at 10:27 AM IST

3 Min Read
Choose ETV Bharat

Facing Losses In Reality For Young Farmers : స్మార్ట్‌ఫోన్ తెరపై కనిపించే రంగురంగుల డ్రాగన్ ఫ్రూట్స్, యాపిల్ బేర్స్, విదేశీ పండ్ల తోటలు నేటి యువ రైతులలో కొత్త ఆశలను, ఆకర్షణను రేకెత్తిస్తున్నాయి. అయితే యూట్యూబ్ వీడియోల 'వ్యూస్' ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ 'లైక్స్' చూసి మురిసిపోయి స్థానిక వాతావరణ పరిస్థితులు, నేల స్వభావాన్ని విస్మరించి ఉద్యాన పంటల్లో ప్రయోగాలు చేయడం యువతను తీవ్ర నష్టాల్లోకి నెడుతోంది. వ్యవసాయంలో ప్రయోగాలు చేయడం తప్పు కాదు, కానీ సోషల్ మీడియాలో చూపించే 'డిజిటల్ దిగుబడులు' క్షేత్రస్థాయి 'ఆచరణాత్మక అనుభవానికి' ప్రత్యామ్నాయం కాలేవు. పక్క రాష్ట్రంలోనో, మరో దేశంలోనో పండిన పంట మన ఊరి మట్టికి, మన ప్రాంత ఉష్ణోగ్రతకు తట్టుకుంటుందా? లేదా? అనే కనీస అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టడంపై ఇప్పుడు తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.

జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం : అవిభక్త అనంతపురం జిల్లాలో ఇటీవల ఆపిల్, అవకాడో, లాంగన్, మకాడమియా వంటి పంటల సాగు మొదలైంది. ఒక రైతు ఆపిల్ సాగులో లాభం పొందారన్న వార్తలకు ఆకర్షితులై, చాలా మంది సరైన పరిశీలన లేకుండానే ఈ మొక్కలను సేకరించడానికి నర్సరీలకు పరుగులు తీస్తున్నారు. ప్రారంభంలో భారీ పెట్టుబడి అవసరమైనప్పటికీ, వారు ఈ సాహసం చేస్తున్నారు. మరోవైపు ఈ విదేశీ పండ్లకు స్థానికంగా పెద్దగా డిమాండ్ లేదు. ఇప్పటికే పంట చేతికి వచ్చిన వారు, తమ ఉత్పత్తులను మహానగరాలకు తరలించడానికి అయ్యే అధిక రవాణా ఖర్చులు, మధ్యవర్తుల కమిషన్ల వల్ల నిరాశ చెందుతున్నారు. ఇప్పటివరకు కేవలం ఒక రైతు మాత్రమే ఆపిల్ పంటను సాధించారని నిపుణులు పేర్కొంటున్నారు. రెండు, మూడు సంవత్సరాల దిగుబడిని గమనించి, సరైన అంచనా వేసే వరకు వీటిని నాటవద్దని వారు సూచిస్తున్నారు.

పెట్టుబడి భారం : ఆపిల్ మొక్కల కొనుగోలు, బిందు సేద్యం (drip irrigation) ఏర్పాటు, ఎరువులు కూలీల ఖర్చు కలిపి ఎకరాకు రూ.2 లక్షలకు పైగా అవుతుంది. ఒక రకమైన నట్ (గింజ జాతి) అయిన మకాడమియా సాగుకు రూ.3 లక్షలకు పైగా ఖర్చవుతుంది, పైగా ఈ చెట్లు ఫలాలను ఇవ్వడానికి 5 నుంచి 6 సంవత్సరాలు పడుతుంది. అంతేకాకుండా ఇది కరువును తట్టుకునే రకం కాదు. లీచీ జాతికి చెందిన లాంగన్ పండు విషయంలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. జిల్లాలో ప్రస్తుతం సాగులో ఉన్న ఇటువంటి తోటల నుంచి ఇంకా మొదటి పంట రాలేదు.

వైవిధ్యమే కీలకం : సవాళ్లు ఉన్నప్పటికీ, అటువంటి పంటలను సాగు చేయాలని నిర్ణయించుకున్న వారు ఒకే రకమైన పండ్ల మొక్కలను పెద్ద సంఖ్యలో నాటడం మానుకోవాలి. దానికి బదులుగా తక్కువ విస్తీర్ణంలో వివిధ రకాలను ప్రయోగాత్మకంగా నాటాలి. కనీసం మూడేళ్లపాటు దిగుబడిని, స్థానిక వాతావరణానికి అవి తట్టుకునే సామర్థ్యాన్ని గమనించి, పంటపై నమ్మకం కలిగిన తర్వాతే పెద్ద ఎత్తున సాగు చేపట్టాలి. రైతులు తప్పనిసరిగా నేల, నీటి పరీక్షలు చేయించుకోవాలని, ఉద్యానవన శాఖ అధికారుల సూచనలను పాటించాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఉమాదేవి సూచించారు. జిల్లాలో ప్రస్తుతం అవకాడో సాగు ఆశాజనకంగా ఉండి మంచి దిగుబడులు నమోదవుతున్నప్పటికీ, దీనికి స్థానికంగా డిమాండ్ తక్కువగా ఉంది. తమ సొంత మార్కెటింగ్‌ను నిర్వహించుకోగల సామర్థ్యం ఉన్నవారు మాత్రమే ఈ పంటను సాగు చేయడాన్ని పరిగణించాలని నిపుణులు సూచిస్తున్నారు.

తగిన ఎంపికలు :

  • సాంప్రదాయ పండ్ల తోటలు: సీతాఫలం, దానిమ్మ, మామిడి, బొప్పాయి ,అరటి (బిందు సేద్యం ఉపయోగించి)
  • తక్కువ నీటితో పెరిగే పంటలు: జామ, సీతాఫలం, అంజూర పండు, రేగు పండు
  • వేడిని తట్టుకునే పంటలు: డ్రాగన్ ఫ్రూట్ -ఖర్జూరం

కొద్దిపాటి నీటి వనరులతోనే ఏడాది పొడవునా పంటలు - ఆదర్శంగా నిలుస్తున్న గిరిజన రైతులు

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం - పంటలు ధ్వంసం