అంబరాన్నంటిన యానాం ప్రజా ఉత్సవాలు - ప్రదర్శనలు, ఫ్యాషన్ షోలతో ఆకట్టుకున్న ప్రదర్శనలు
కేంద్రపాలిత ప్రాంతం యానాంలో రెండో రోజు యానం ప్రజా ఉత్సవాలు - జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో పుదుచ్చేరి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 8, 2026 at 10:14 PM IST
Yanam Public Celebrations: కేంద్రపాలిత ప్రాంతం యానాంలో రెండో రోజు యానం ప్రజా ఉత్సవాలు సంక్రాంతికి ఒక వారం ముందే అంబరానంటేలా జరిగాయి. స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో పుదుచ్చేరి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న 22వ యానాం ప్రజా ఉత్సవాలు రెండవ రోజు ఇతర రాష్ట్రాల కళాకారుల ప్రదర్శనలు, ఫ్యాషన్ షోలతో హోరెత్తాయి. ఉత్సవాలను తిలకించేందుకు ప్రజలు ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేలాదిగా తరలి వచ్చారు. మంచుకురిసే చలిలోనూ ఈవెంట్ ప్రాంగణమంతా కళాకారుల ప్రదర్శనలతో వేడెక్కింది. కాంతార నృత్య ప్రదర్శన, కోల్‌కత్తాకు చెందిన కళాకారుల సాంప్రదాయమైన వస్త్రధారణ, ఫ్యాషన్షోతో పాటు నెల్లూరు కళాకారిణుల మాస్ డాన్స్‌కు వీక్షకులంతా ఫిదా అయ్యారు.
పాఠశాలల చిన్నారుల రాంప్ వాక్: ముంబయి కళాకారుల ఫ్యాషన్ షోకు పోటీగా స్థానిక పాఠశాలల చిన్నారులు కూడా రాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు. బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కండల వీరులు తమ దేహాన్ని వివిధ భంగిమలలో ప్రదర్శించారు. గత ఏడాది సూపర్ హిట్ అయిన "గోదారి గట్టు మీద" పాటకు స్టెప్పులేసి అలరించారు. మొదట సాంప్రదాయ వస్త్రధారణతో ప్రదర్శించిన నారీమణులు ట్రెండ్ మార్చి మోడ్రన్ డ్రెస్సులతో ప్రదర్శన ఇవ్వడంతో కుర్రకారంతా కేరింతలు కొట్టారు. రష్యన్ భామ బెల్లీ డాన్స్ వీక్షకులను ఆకట్టుకుంది.
సంక్రాంతికి ముందే అంబరాన్నంటేలా వేడుకలు: సంక్రాంతి అనగానే కోస్తా జిల్లాల్లో రంగవల్లులు గొబ్బెమ్మలు హరిదాసులు గంగిరెద్దులు కోడిపందేలు గుర్తొస్తాయి. సంక్రాంతి పండగ వస్తోందంటే గోదావరి జిల్లాల్లో మరీ ముఖ్యంగా కోనసీమలోని పచ్చని పల్లెలన్నీ కొత్తశోభను సంతరించుకుంటాయి. కోడిపందేలు, ప్రభల తీర్థాలు, నోరూరించే పిండివంటలు ఎక్కడెక్కడివారినో రా రమ్మని ఆహ్వానిస్తాయి. కేరళలో ఓనం లాంటి ప్రత్యేక సందర్భాల్లో నిర్వహించే పడవ పోటీలు ఈసారి సంక్రాంతికి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. ఇంతవరకు స్థానిక ప్రజలు, సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి ఉత్సవాల్ని రాష్ట్రప్రభుత్వం నిర్వహించబోతుంది. బ్రాండ్ ఇమేజ్ కల్పించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. ఆత్రేయపురం, ఎస్.యానాం, పిఠాపురాల్లో సంక్రాంతి సంబరాల్ని అట్టహాసంగా నిర్వహిస్తోంది. డ్రాగన్ పడవ పోటీలు, ఈత, గాలిపటాల పోటీలు, మహిళలకు రంగవల్లుల పోటీలు, కోనసీమ సంప్రదాయ పిండివంటలతో ప్రత్యేక ఫుడ్‌ఫెస్టివల్ నిర్వహిస్తోంది.
మూడు రోజులపాటు సందడే సందడి: ఆత్రేయపురం ప్రాంతం ఈ సంక్రాంతికి మూడు రోజులపాటు కోలాహలంగా మారబోతోంది. ఈ నెల 11న ఆత్రేయపురం రేవులోని బొబ్బర్లంక ప్రధాన కాలువలో ఈత పోటీలు నిర్వహిస్తున్నారు. 14 ఏళ్ల వయసు దాటినవారు పోటీల్లో పాల్గొనవచ్చు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.8వేలు, రూ.6వేలు, రూ.4వేల చొప్పున అందిస్తారు. ఆత్రేయపురం పేరు చెబితే నోరూరించే పూతరేకులతో పాటు, అక్కడి లొల్ల లాకులూ గుర్తుకొస్తాయి. అక్కడ గత సంవత్సరం తొలిసారి సంక్రాంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలకు ప్రభుత్వం రూ.కోటి కేటాయించింది. ఉత్సవాల్ని తిలకించేందుకు రోజూ 10 వేలకుపైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
కేరళను తలపించేలా పడవ పోటీలు: కేరళలో ఓనం పండగ వంటి ప్రత్యేక సందర్భాలు, ఉత్సవాల్లో నిర్వహించే పడవ పోటీలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. సన్నగా, పొడవుగా ఉండే ఈ పడవల్ని అక్కడ స్నేక్ బోట్స్‌గా పిలుస్తారు. అళప్పుజలోని పున్నమడలేక్‌లో జరిగే నెహ్రూ ట్రోఫీ, అరన్‌ముల, చాంపక్కుళం, కొచ్చి లాంటిచోట్ల జరిగే ఈ పోటీల్ని తిలకించేందుకు దేశ, విదేశాల నుంచి వేలసంఖ్యలో పర్యాటకులు తరలివస్తారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు పడవ పోటీల్ని చూడటానికి ఇక కేరళకు వెళ్లాల్సిన పనిలేదు. రాష్ట్రప్రభుత్వం ఆత్రేయపురంలోనే ఆ అవకాశం కల్పిస్తోంది. సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా కేరళ తరహాలో డ్రాగన్ పడవ పోటీలు నిర్వహించబోతోంది. ఆత్రేయపురంలోని బొబ్బర్లంక ప్రధాన కాలువలో ఈ నెల 12, 13 తేదీల్లో పడవ పోటీలు జరుగుతాయి. కేరళతో పాటు, ఉమ్మడి ఉభయగోదావరి, అనంతపురం, విశాఖ, కృష్ణా తదితర జిల్లాల నుంచి 25-30 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. మొదటి బహుమతిగా రూ.2లక్షలు, రెండో బహుమతిగా రూ.లక్ష అందజేస్తారు.
సమాజంలో శాస్త్ర, సాంకేతికతపై నమ్మకాన్ని పెంపొందించాలి: వెంకయ్య నాయుడు
జలాలు సముద్రం పాలైతే ఎవరికి ఉపయోగం - వాడుకుంటే మేలే కదా: సీఎం చంద్రబాబు

