అ'ధనం'గా చెల్లిస్తేనే ఆరోగ్య శ్రీ - ప్రైవేట్ ఆసుపత్రుల వసూళ్లతో లబోదిబోమంటున్న రోగులు
ప్రైవేటు దందాతో లబోదిబోమంటున్న రోగులు - చిన్న సమస్య అయినా పెద్ద మొత్తంలో వసూళ్లు - పేద, మధ్య తరగతి వ్యక్తుల జేబులకు చిల్లులు

Published : May 4, 2026 at 9:32 AM IST
Private Hospital Money Scams in Telangana : రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ, ఈహెచ్ఎస్ ఇతర బీమాల పేరుతో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టానుసారంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నాయి. ఎలాంటి బిల్లులు, రసీదులు ఇవ్వకుండా కేవలం సొమ్ము మాత్రమే తీసుకుంటున్నారు. ఆసుపత్రుల సిబ్బంది రోగుల నుంచి నగదు డిమాండ్ చేస్తూ ఆధారాలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. గతంలో ఆరోగ్య శ్రీ జాబితాలో ఉన్న పేషెంట్లకు సంబంధించి ప్రతి ప్రొసీజర్‌కు ఒక ప్యాకేజీ రూపంలో ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్యాకేజీ ధరలను సైతం సర్కారు మారుస్తూ వస్తుంది. అయినప్పటికీ పలు ఆసుపత్రులకు ధనదాహం తీరడం లేదని రోగులు లబోదిబోమంటున్నారు. కేటాయించిన ప్యాకేజీల్లోనే చికిత్సలు చేయకుండా అదనంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్య మిత్ర సిబ్బంది పట్టనట్లు వ్యవహరిస్తుండటం, లోపాయికారీ ఒప్పందాల కారణంతో చూసీచూడనట్లు ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
- ఇటీవల వరంగల్‌కు చెందిన గృహిణి గర్భాశయ సంబంధిత వ్యాధితో వారం క్రితం శివారులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వైద్యులు గర్భ సంచి తొలగించాలని నిర్ణయించారు. దాదాపు రూ.2.5 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. దీంతో ఆరోగ్య శ్రీ పథకంలో రూ.లక్షన్నర వరకు వస్తుందని చెప్పి మిగతా నగదు రూ.లక్ష చెల్లించాలన్నారు. ఇక వారికి వేరే దారిలేక రూ.లక్ష చెల్లించారు. కానీ ఈ రూ.లక్షకు సంబంధించి చిన్న రసీదు కూడా ఇవ్వకపోవడంతో ఏమిటని ప్రశ్నించగా, అది అంతే అన్న సమాధానం రావడంతో రోగి బంధువులు అవాక్కయ్యారు.
బీమా సంస్థలను మోసం చేస్తున్న ఆసుపత్రులు : ఆరోగ్య శ్రీ కాకుండా కొన్ని ఆసుపత్రులు ప్రైవేటు బీమా సంస్థలను కూడా మోసం చేస్తున్నాయి. మెదక్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో శివారులోని ఆసుపత్రిలో చేరగా, ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. దీని కోసం రూ.లక్షలు ఖర్చవుతాయని తేల్చారు. వారికి ప్రైవేటు ఆరోగ్య బీమా ఉంది. అందులో అంత వచ్చే అవకాశం లేదని రూ.2 లక్షలు అదనంగా నగదు చెల్లించాలని కోరారు. వాస్తవానికి ప్రధాన చికిత్సలకు అయ్యే ఖర్చులను బీమా కంపెనీ నుంచి మినహాయించుకొని మిగతా వాటికి బిల్లులు ఇస్తారు.
రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇదంతా అధికారికంగా జరుగుతుంది. మరికొన్ని ఆసుపత్రుల్లో మాత్రం అదనంగా నగదు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. బీమా కార్డుతో చికిత్సలు పూర్తయినా మరింత పిండుకునేందుకు ఇలా నగదు కింద తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఇటువంటి అక్రమ దందాలను అరికట్టే బాధ్యత కలిగిన అధికారులే ఈ తరహా దందాకు పాల్పడుతున్నారు. వీరు చేసే పనులు చూస్తూ రోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేటులో 90 శాతం శస్త్రచికిత్సలే : మాతృత్వపు మమకారాన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు ఆసుపత్రులు జేబులు ఖాళీ చేస్తున్నారు. అనవసర ఆందోళనలు కలిగిస్తూ కడుపు కోతలు మిగుల్చుతున్నారు. చిన్న చిన్న కారణాల పేరిట అక్రమంగా వసూళ్లు చేస్తున్నారు. ప్రతి ఏడాది సర్కారు దవాఖానాలతో పోలిస్తే ప్రైవేటులోనే అత్యధికంగా ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రైవేట్‌కి వెళ్లిన వారికి 90 శాతం శస్త్ర చికిత్సలే చేస్తున్నారు. ప్రతి నెల పరిశీలన, ఔషధాలతో కలిపి రూ.10 వేలకు పైగా బిల్లులు వేస్తున్నారు. గర్భిణి కుటుంబ పరిస్థితిని వివరించకుండానే శస్త్ర చికిత్సను సిద్ధం చేయడం పరిపాటిగా మారింది.
మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ దవాఖానాలకు గర్భిణులు తరలివచ్చేలా సిబ్బందితో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించారు. ఫలితంగా చాలా వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. తల్లీబిడ్డల భవిష్యత్తు దృష్ట్యా సాధారణ ప్రసవాలు పెంచడమే లక్ష్యంగా గత ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పర్యవేక్షణ పెంచి కోతలు లేని కాన్పులకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి జిల్లాలోని యంత్రాంగం చొరవతో చాలా వరకు పరిస్థితులు మారి మళ్లీ మొదటికి వచ్చాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ సాధారణ కాన్పుతో పోలిస్తే సీ సెక్షన్ అధికంగా జరుగుతున్నాయి.
ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత – అసోసియేషన్ నిర్ణయం వెనుక అసలు కారణాలు ఇవే
చికిత్స పేరిట కాసుల వేట - చిన్న రోగానికైనా రూ.లక్షలు చెల్లించాల్సిందే!

