నా భర్తలా నేను చూసుకోలేను - ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
తల్లి, కుమార్తె మృతి కుమారుడి పరిస్థితి విషమం - భర్త ఆకస్మిక మరణంతో మనోవేదన - పెంచిన చేత్తోనే పిల్లలకు విషపూరిత ఆహారాన్ని తినిపించి తానూ తిని ఆత్మహత్య

Published : January 2, 2026 at 12:03 PM IST
Mother Daughter Died in kalwakurthy : సాధారణంగా ఓ మధ్య తరగతి కుటుంబం ఎలా ఉంటుంది. ఉండటానికి ఇల్లు, చేయడానికి ఒక చిన్న ఉద్యోగం, అలా అలిసిపోయి సాయంత్రం ఇంటికి రాగానే పిల్లలతో ఆటలు, కబుర్లు. ఆ తర్వాత రాత్రి అందరూ కలిసి భోజనం వంటివి చేస్తుంటారు. సెలవు రోజుల్లో మాత్రం సినిమాకో లేక బయటకో వెళుతూ ఉంటారు. ఇలా ఆనందంగా సాగుతున్న ఓ సామాన్యుడి కుటుంబంలో ఊహించని విపత్తు ఎదురైతే వారి జీవితాలు ఎలా మారుతాయి? ఇలానే ఓ సామాన్య కుటుంబంలో అనుకొని సంఘటన జరిగి వారి జీవితాలనే తారుమారు చేసింది. వివరాల్లోకి వెళితే,
మనస్తాపంతో ఇలా : భార్యాభర్తలు ఇద్దరు ముత్యాల్లాంటి పిల్లలతో ఉన్న చిన్న జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. ఈ కుటుంబం ప్రశాంతమైన జీవితాన్ని సాగిస్తుండగా ఆ ఇంటి పెద్ద, కడవరకూ తోడుంటానని చెప్పిన భర్త హఠాత్తుగా మరణించాడు. దీంతో ఆ ఇల్లాలు ఏం చేయాలో తెలీక కుంగిపోయింది. తన భర్త మాదిరి పిల్లలను పోషించలేకపోతున్నాను అని కొన్ని రోజులుగా మనోవేదనకు గురైంది.
ఈ క్రమంలో ఆ తల్లి కఠిన నిర్ణయం తీసుకుంది. నవ మాసాలు మోసి, పెంచిన చేత్తోనే పిల్లలకు విషపూరిత ఆహారాన్ని తినిపించి తానూ తిని తనువు చాలించింది. ఈ ఘటనలో తల్లితో పాటు కుమార్తె మృతి చెందగా, ప్రస్తుతం కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకరమైన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో జరిగింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల వివరాల ప్రకారం : వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రానికి చెందిన భీమ్శెట్టి ప్రకాశ్(47), ప్రసన్న (40) దంపతులకు కుమారుడు ఆశ్రిత్రామ్ (15), కుమార్తె మేఘన (13) వీళ్లు కల్వకుర్తిలో నివాసం ఉంటున్నారు. ప్రకాశ్ అక్కడే పుస్తకాల దుకాణాన్ని నిర్వహిస్తూ జీవనోపాధి పొందేవారు. 2025 నవంబరు 14న ఉన్నటుండి షాప్‌లో ఉండగానే ఛాతీ నొప్పి రావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో ఆ ఇంటి ఇల్లాలు అప్పట్నుంచీ భర్త లేరనే బాధను ఎప్పుడూ వెంటాడుతునే ఉండేది. ప్రకాశ్ మరణం తర్వాత ఆ దుకాణాన్ని ఆమె తమ్ముడు చక్రధర్‌తో కలసి నిర్వహిస్తున్నారు.
పిల్లలకు విషం కలిపిన ఆహారాన్ని పెట్టి : ప్రసన్న తన భర్త లేరనే బాధ ఆమెలో రోజురోజుకు ఎక్కువతుంది. దీంతో జనవరి 1న (గురువారం) మధ్యాహ్నం తన ఇద్దరు పిల్లలకు విషం కలిపిన ఆహారాన్ని పెట్టి తానూ తిన్నది. ఆ తర్వాత వారంతా అపస్మారకస్థితికి చేరుకున్నారు. తన తమ్ముడు చక్రధర్ ఇంటికెళ్లి చూడగా అప్పటికే వారు ముగ్గురూ వాంతులు చేసుకుని అపస్మారకస్థితికి చేరుకున్నారు. వీరిని గమనించిన స్థానికులు అక్కడి నుంచి కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి వారిని తరలించారు. చికిత్స పొందుతూ అమ్మాయి అక్కడే మృతి చెందింది.
మార్గం మధ్యలోనే తల్లి మృతి : తల్లికి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందారు. ప్రస్తుతం ఆమె కుమారుడు కల్వకుర్తిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ చిన్నారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలంలో ప్రసన్న రాసిన నాలుగు పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లెటర్లో ఏం ఉందో ఇంకా తెలియాల్సి ఉంది. అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
'అమ్మ, నాన్న, తమ్ముడు క్షమించండి' - అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
లవర్ కోసం లండన్ నుంచి వచ్చి - పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తనువు చాలించి

