ETV Bharat / state

మేడారానికి కొత్త కళ - పూర్తైన గద్దెల నిర్మాణం

ప్రధాన స్వాగత తోరణంపై సమ్మక్క వంశీయుల చరిత్ర తెలిపే 59 బొమ్మలు - 250 మంది శిల్పులతో బొమ్మల చిత్రీకరణ - చెట్లను దాదాపు తొలగించకుండానే అభివృద్ధి పనులు

Medaram Jathara In Telangana
Medaram Jathara In Telangana (EENADU)
author img

By ETV Bharat Telangana Team

Published : December 24, 2025 at 10:47 AM IST

3 Min Read
Choose ETV Bharat

Medaram Jathara In Telangana : ప్రతి ఏడు జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను ఎప్పటిలా కాకుండా ఈసారి కొత్తగా, మరింత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఈ జాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరుగనుంది. దీనికి తెలంగాణతో పాటు చుట్టుపక్కల ఉండే రాష్ట్రాల నుంచి కోటి మందికి పైగా భక్తులు తరలి వస్తారని అంచనా. ఈ ఏడాది ఎప్పుడూ ఉండే తాత్కాలిక సౌకర్యాలతో పాటు శాశ్వత నిర్మాణాలపై సర్కారు దృష్టి సారించింది. ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా రూ.251 కోట్లతో మేడారం అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. వనదేవతల గద్దెల విస్తరణ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ పనులకే రూ.101 కోట్లు ఖర్చు చేస్తోంది.

ఐదు స్వాగత తోరణాల ఏర్పాటు : గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా పటిష్ఠంగా ఉండేలా రాతితో పునర్నిర్మిస్తున్నారు. దానికోసం 46 పిల్లర్లతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాకారం ఉండనుంది. వీటి మధ్య 40 అడుగుల వెడల్పుతో మూడు, 30 అడుగుల వెడల్పుతో ఐదు స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. గద్దెల ప్రాంగణానికి ఎదుట 50 అడుగుల వెడల్పు ప్రధాన స్వాగత తోరణం ఉంటుందని చెప్పారు. పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను సమ్మక్క-సారలమ్మ గద్దెలు ఉండే వరుసలోకి మారుస్తున్నారని తెలియజేశారు. ఈ ఏర్పాటు భక్తులంతా ఒక వరుసలో దర్శనానికి వెళ్లేందుకు చేస్తున్నారు. వృత్తాకారంలో ఉండే గద్దె చుట్టూ 8 స్తంభాలు ఉంటాయి. దాని మధ్యలో వెదురు బొంగులతో తీర్చిదిద్దుతున్నారు.

Medaram Jathara In Telangana
పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దె (EENADU)

తోరణంపై 59 బొమ్మలతో సమ్మక్క చరిత్ర: తాళపత్రాల్లోని కోయ వంశీయుల చరిత్రను ప్రాంగణం గోడలపై చిహ్నాలుగా, బొమ్మలుగా చెక్కించారు. దీని కోసం ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు తెలుపు రంగు రాళ్లను తరలించి శిల్పులతో చెక్కించాకించి, మేడారానికి తీసుకొస్తున్నారు. సమ్మక్క వంశీయుల చరిత్ర తెలిపే 59 బొమ్మలను ప్రధాన స్వాగత తోరణంపై చెక్కారు. సమ్మక్కది రాయి బందానీ 5వ గొట్టు వంశం. వీరి ఇంటి దైవమైన ఒక కొమ్ము ఉండే దుప్పి రెండువైపులా అడవి దున్న కొమ్ములు, నెమలి ఈకలు తోరణం అగ్రభాగాన చెక్కారు. మిగతా శిలలపై గొట్టుల వంశీయుల చరిత్ర, వారు పూజించిన జంతువులు, జీవనశైలిని తెలిపే చిత్రాలు చెక్కారు. ఇలా దాదాపు 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించి ఏడు వేల బొమ్మలుంటాయని చెబుతున్నారు.

15 మంది విద్యార్థుల సాయంతో చిత్రాల రూపకల్పన : డాక్టర్‌ హరిప్రసాద్‌ ఆధ్వర్యంలో 250 మంది శిల్పులు పనిచేశారు. స్థపతులు ఈమని శివనాగిరెడ్డి, డాక్టర్‌ మోతీలాల్‌ పర్యవేక్షిస్తున్నారు. సమ్మక్క-సారలమ్మ ఆర్కియాలజీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన 15 మంది విద్యార్థులు ఈ చిత్రాల రూపకల్పన చేయడానికి సాయం అందించారు. ఇది తమ 15 ఏళ్ల శ్రమ అని రీసెర్చ్‌ సెంటర్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ మైపతి అరుణ్‌ తెలిపారు. గద్దెల ప్రాంగణానికి సమీపంలో ఇదివరకు ఉన్న చెట్లను దాదాపు తొలగించకుండానే అభివృద్ధి పనులు చేపట్టారు. పునర్నిర్మాణం తర్వాత వనదేవతల పూజల్లో విశిష్టత కలిగిన బండారి, మర్రి, వెదురు, బూరుగ, వేప, ఇప్ప, కస్తు వంటి 12 రకాల చెట్లు, 140 రకాల ఆయుర్వేద మొక్కలు నాటనున్నారు.

విద్యుత్తు కోసం అదనపు సబ్‌స్టేషన్లు : మేడారం చేరుకునే మార్గంలో ఇరుకుగా ఉన్న రోడ్లు, వంతెనలను విస్తరించారు. గ్రామాల్లో రెండులేన్లుగా ఉన్న రోడ్లను నాలుగులేన్లుగా మార్చారు. స్థానికంగా డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మించారు. జంపన్న వాగుకు వెళ్లే మార్గాలను అభివృద్ధి చేసి, వాగు ఒడ్డును సుందరీకరించారు. నిరంతర విద్యుత్తు కోసం అదనంగా సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రాంగణం బయట క్యూలైన్లు, వాటికి రేకులతో పైకప్పు వేయనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అప్పగించిన బాధ్యతల మేరకు.. వరంగల్‌ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తరచూ పనులను పరిశీలిస్తూ.. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. పనులు వేగంగా పూర్తి చేసేలా ఆదేశాలిస్తున్నారు. మంత్రులు సీతక్క, సురేఖ సైతం ఎప్పటికప్పుడు పనుల పరిశీలన చేస్తున్నారు.

ఇవాళ మేడారానికి రావొద్దు - భక్తులకు మంత్రి సీతక్క విజ్ఞప్తి

డిసెంబరు 30 నాటికి మేడారం పనులు పూర్తికావాలి : సీఎం రేవంత్‌రెడ్డి