మెట్రో అప్పులు తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు - రుణాల పునర్ వ్యవస్థీకరణకు కసరత్తు
మెట్రో ఆపరేషన్స్ బాధ్యతలు ఏప్రిల్ నుంచి ఇక ప్రభుత్వానివే - రూ.15 వేల కోట్లతో స్వాధీనం చేసుకోనున్న సర్కార్ - కేంద్రం సహకరిస్తే రెండో దశ మెట్రో పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం

Published : February 27, 2026 at 10:23 AM IST
Government Hand Over the Metro Responsibility : మెట్రో రైలు నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం చేపట్టనుంది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మెట్రో కొనుగోలుకు ఆమోదం లభించడంతో తదుపరి చర్యలకు సర్కారు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో మెట్రోపై ఉన్న అప్పులే ప్రభుత్వానికి అతి పెద్ద సవాలు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న అప్పులకు వడ్డీ రేటు అధికంగా ఉంది. ఇది సర్కారుకు అదనపు భారం కానుండటంతో దీనిని తగ్గించుకునేందుకు రుణాల పునర్ వ్యవస్థీకరణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
సుమారు 20 ఏళ్ల కాల పరిమితితో తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు సేకరించేందుకు ఆర్థిక సంస్థలతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐ.ఆర్.ఎఫ్.సీ)తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఈ సంస్థ ఇచ్చే రుణాలకు 8 శాతం వడ్డీ ఉంటుంది. ఇంతకంటే తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే అవకాశాలపైనా అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఆర్థికపరమైన సవరణ మాత్రమే కాదని, మెట్రో ప్రాజెక్టు భవిష్యత్తును నిర్దేశించే చర్య అని అధికారులు పేర్కొంటున్నారు.
ఆదాయం తగ్గినా, అప్పుల భారం మాత్రం తగ్గలేదు : తొలి దశ మెట్రో నిర్మాణ పనులను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టారు. ప్రాజెక్టు వ్యయం రూ.15 వేల కోట్లు కాగా, అందులో సుమారు రూ.13 వేల కోట్లు రుణాలు సేకరించారు. వీటికి వడ్డీ రేటు 8 శాతం ఉండటంతో ఏటా రూ.వందల కోట్లు వడ్డీలకే సరిపోతున్నాయనే వాదనలున్నాయి. కొవిడ్ సమయంలో ప్రయాణికుల నుంచి ఆదాయం తగ్గినా, అప్పుల భారం మాత్రం తగ్గలేదు. దీంతో రుణాలు చెల్లించడం నిర్వహణ సంస్థకు భారంగా మారింది.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మెట్రో నిర్వహణ నుంచి ప్రైవేటు సంస్థ తప్పుకోవడంతో ప్రభుత్వమే బాధ్యత తీసుకునేందుకు ముందుకొచ్చింది. అప్పులను పునర్ వ్యవస్థీకరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 8 శాతం వడ్డీని 6 నుంచి 6.5 శాతం వరకు తగ్గించే ప్రయత్నం, రీ ఫైనాన్సింగ్ ద్వారా ఎక్కువ వడ్డీ ఉన్న రుణాలను తక్కువ వడ్డీతో తీసుకున్న రుణాల ద్వారా చెల్లించడం, బకాయిల కాల పరిమితిని 20 ఏళ్ల నుంచి 25-30 ఏళ్లకు పెంచడం వంటి చర్యల ద్వారా వార్షిక రుణ చెల్లింపుల భారాన్ని కొంత మేర తగ్గించుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అధికారులు పేర్కొంటున్నారు.
వడ్డీ భారాన్ని తగ్గించుకునేందుకు బాధ్యతలు : ప్రభుత్వమే అప్పుల చెల్లింపునకు నేరుగా బాధ్యత వహిస్తున్నందున తక్కువ వడ్డీ రేటుకు రుణాలు పొందే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వడ్డీ భారాన్ని తగ్గించుకుంటే, ఆర్థికంగా మెట్రో నిలదొక్కుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రయాణికుల ఛార్జీలతో పాటు వాణిజ్య ప్రకటనలు, స్థలాల అద్దెలు, మెట్రో పరిధిలో ఉన్న 260 ఎకరాల భూముల లీజు, వేలం పాట ద్వారా ఎక్కువ మొత్తం నిధులు సమీకరించుకునే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. తొలి దశ మెట్రో ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రాజెక్టుకు బదిలీ అయిన భూములపైనా కీలక చర్చ జరుగుతోంది. ఒప్పందం ప్రకారం కేటాయించిన భూముల్లో కొంత మెట్రో ట్రాక్‌లకు, ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవల్ప్మెంట్(టీవోడీ) ప్రాజెక్టులకు, మాల్స్ అభివృద్ధికి కేటాయించారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత వినియోగంలో లేని భూములు ప్రభుత్వానికి వచ్చినా ఇప్పటికే మాల్స్ నిర్మాణం చేసిన భూములు, ఇతర ప్రైవేటు ఏజెన్సీల చేతిలో ఉన్న భూములపై ప్రభుత్వం సమీక్షించే అవకాశం ఉంది. వాణిజ్య ఆస్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే చర్చ జరుగుతోంది.
ప్రభుత్వ ఆలోచన కూడా అదే : ప్రస్తుతం మెట్రో నిర్వహణ పక్కాగా జరుగుతోంది. మెట్రో 99 శాతం సమయపాలన పాటిస్తోంది. రోజూ లక్షలాది మంది ప్రయాణికులను మెట్రో రైలు గమ్యస్థానాలకు చేరవేస్తోంది. దీనిని స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా సేవలకు అంతరాయం లేకుండా అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులను కొనసాగించాలనే దిశగానే ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. ఆపరేషన్లు, నిర్వహణలో నైపుణ్యం ఉన్న సంస్థతో మరో ఏడాది పాటు ఒప్పందం కొనసాగించే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం.
ఆటోమేటెడ్ ట్రైన్ కంట్రోల్, కమ్యూనికేషన్ ఆధారిత వ్యవస్థల నిర్వహణకు ప్రభుత్వం వద్ద సాంకేతిక నిపుణులు లేనందున ఇప్పుడు ఉన్న బృందాలనే కొనసాగించనున్నట్లు తెలుస్తుంది. పీపీపీ పద్ధతిలో నిర్మితమైన మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే దేశంలోనే అతిపెద్ద లావాదేవీల్లో ఒకటిగా ఇది నిలుస్తుందని అధికారులు అంటున్నారు. ఆర్థిక సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని, విస్తరణ ప్రణాళికలను వేగవంతంగా పూర్తి చేస్తే మెట్రో రవాణా రంగంలో దేశానికే తెలంగాణ మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంటుంది.
రెండో దశ మెట్రోకు రూ.24 వేల కోట్ల ఖర్చు : మెట్రో విస్తరణకు సంబంధించి రెండో దశ ప్రణాళిక కీలక దశలో ఉంది. మొత్తం 5 కారిడార్లతో సుమారు 76 కిలోమీటర్ల మేర మెట్రో సేవలు విస్తరించాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందుకోసం సుమారు రూ.24 వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో పాటు అదనంగా మరో 86 కిలోమీటర్ల మెట్రో విస్తరణ ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. రెండో దశ పనులకు కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, నిర్వహణ మొత్తం ఒకే సంస్థ ఆధ్వర్యంలో ఉండాలనే నిబంధన పెట్టింది. దీంతో తొలి దశ మెట్రో ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. కేంద్రం సహకరిస్తే రెండో దశ మెట్రో పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఎంఎంటీఎస్‌తో ఆర్టీసీ, మెట్రో సేవల అనుసంధానం - పలు ప్రాంతాల్లో స్కైవేల నిర్మాణం
మెట్రో స్వాధీనానికి కేబినెట్ ఆమోద ముద్ర - మార్చిలోగా ప్రభుత్వం చేతికి

