'సర్'లో మరో కీలక ప్రక్రియ - నేడు ముసాయిదా ఓటర్ల జాబితా వెల్లడి - 92 లక్షల మందికి నోటీసులు!
రాష్ట్ర ఓటరు జాబితా 'సర్'లో నేడు మరో కీలక ప్రక్రియ ప్రారంభం - ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించనున్న సీఈవో కార్యాలయం - 2.64 కోట్ల మందికి పైగా ఓటర్లతో ముసాయిదా జాబితా వెల్లడి

Published : August 17, 2026 at 7:38 AM IST
Announce The Draft Voter List On Monday : తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల 64 లక్షల 87 వేల 214 మంది ఓటర్లతో నేడు ముసాయిదా జాబితా వెల్లడి కానుంది. ఇందులో సుమారు 92 లక్షలకు పైగా ఓటర్లకు నోటీసులు రాబోతున్నాయి. ఇప్పటికే సుమారు 73 లక్షల ఓట్లు తగ్గిపోగా, ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చిన వారిలో 92 లక్షల మందికి పైగా నోటీసులు ఇచ్చేందుకు సీఈవో కార్యాలయం సిద్ధం చేసింది. నోటీస్ వస్తే ఈసీ ప్రకటించిన 12 డాక్యుమెంట్ల ద్వారా అర్హత ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో నేడు మరో కీలక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎస్‌ఐఆర్ అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాను ఇవాళ సీఈవో కార్యాలయం ప్రకటించనుంది. 2 కోట్ల 64 లక్షల 87 వేల 214 మంది ఓటర్లతో ముసాయిదా జాబితా వెల్లడి కానుంది. గత 2002 ఎస్‌ఐఆర్‌తో మ్యాపింగ్ కాని వారికి, సరైన వివరాలు ఇవ్వని ఓటర్లకు నోటీసులు ఇవ్వనున్నారు. ప్రస్తుత జాబితా ప్రకారం తెలంగాణలో 3 కోట్ల 38 లక్షల 26 వేల 448 ఓటర్లు ఉండగా, ఎన్యూమరేషన్ ప్రక్రియలో 78.30 శాతం మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల 64 లక్షల 87 వేల 214 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇచ్చారు. మిగతా 73 లక్షల 39 వేల 234 ఓట్లను తొలగించి ముసాయిదా జాబితా సిద్ధం చేశారు.
అభ్యంతరాలు తెలిపే అవకాశం : ఎన్యూమరేషన్ కాని ఓట్లలో 9 లక్షల 22 వేల 230 మంది మరణించిన వారే ఉన్నారు. మరో 11 లక్షల 25 వేల 546 ఓటర్లు వారి చిరునామాల్లో అందుబాటులో లేరని సీఈవో కార్యాలయం తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా 45 లక్షల 18 వేల 961 మంది ఓటర్లు ఇతర ప్రాంతానికి షిఫ్ట్ అయినట్లు గుర్తించారు. 6 లక్షల 70 వేల 203 మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. మరో లక్ష 2 వేల 294 మంది ఇతర కారణాలతో ఎన్యూమరేషన్ కాలేదని తెలిపింది. వీరిలో ఎవరైనా ఈసీ పేర్కొన్న తమ వివరాలు తప్పని భావిస్తే, ఇవాళ్టి నుంచి అభ్యంతరాలు తెలిపే వెసులుబాటు ఉంటుంది.
అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా : ఇవాళ్టి నుంచి నోటీసుల జారీ, అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చిన వారిలో సుమారు 32 లక్షల 36 వేల మంది గత 2002 ఎస్‌ఐఆర్ వివరాలు ప్రస్తావించలేదు. గత ఎస్‌ఐఆర్‌లో తమ వివరాలు లేదా కుటుంబ సభ్యుల వివరాలు రాయలేదు. అన్‌మ్యాపింగ్ ఓటర్లుగా పేర్కొంటూ వారందరికీ ఈసీ నోటీసులు రానున్నాయి. మరో 61 లక్షల మంది ఎన్యూమరేషన్ ఫారాల్లో 2002 ఎస్‌ఐఆర్ వివరాలు ప్రస్తావించినప్పటికీ, అసంబద్ధంగా ఉన్నాయి. అలాంటి వాటిని 'అనామలిస్' ఓటర్లుగా పేర్కొంటూ వారికి కూడా నోటీసులు ఇచ్చేందుకు సీఈవో కార్యాలయం జాబితా సిద్ధం చేసింది. ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 17 వరకు నెల రోజుల పాటు ఓటర్ల వివరణలు, అభ్యంతరాలు, క్లెయిమ్‌లను స్వీకరిస్తారు. అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా ప్రకటిస్తారు.
ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌ను పరిగణనలోకి తీసుకుంటాం : నోటీసులు వస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన 12 డాక్యుమెంట్లలో ఒకటి లేదా రెండు ఈఆర్‌వోకు సమర్పించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, పబ్లిక్ సెక్టార్ సంస్థల ఉద్యోగులు, పెన్షనర్ల గుర్తింపు కార్డు లేదా 1987 జులై 1కి ముందు ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎల్‌ఐసీ, స్థానిక సంస్థలు జారీ చేసిన గుర్తింపు పత్రం సమర్పించవచ్చు. బర్త్ సర్టిఫికెట్, పాస్‌పోర్టు, ఎస్‌ఎస్‌సీ, ఇతర విద్యార్హతల సర్టిఫికెట్లు, శాశ్వత నివాసం, కుల, అటవీ హక్కుల ధ్రువీకరణ పత్రాలు కూడా ఇవ్వొచ్చు. ప్రభుత్వం ఇచ్చిన భూమి, ఇళ్లు కేటాయింపు పత్రం, ఆధార్ కార్డు చెల్లుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇస్తున్న ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ చెల్లదన్న ఈసీ, గత నెల 25కు ముందు జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌ను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.
ఓటర్ల ఇంటి బాటలో రాజకీయ పార్టీలు - ఏఎస్‌డీడీ ఓట్లపై ఆరా!
'సర్' నోటీసులకు ఈ 12 ధ్రువపత్రాలే సమాధానం - 1987 తర్వాత పుడితే తల్లిదండ్రులవీ చూపాల్సిందే

