ఘనంగా ముగిసిన ఆవకాయ్ అమరావతి ఉత్సవాలు
కళాభిరుచులతో పాటు విజ్ఞానాన్నీ పంచిపెట్టాయని ఆనందం వ్యక్తం సందర్శకులు-చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఇంటిళ్లిపాదికి ఆహ్లాదాన్ని పంచిన ఉత్సవాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 11, 2026 at 5:14 PM IST
Avakai Amaravati Festival Concluded Grandly: విజయవాడలో ఆవకాయ్-అమరావతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. మూడు రోజుల పాటు సినిమా, సంస్కృతి, సాహిత్యాల సమ్మేళనంగా కొనసాగిన ఉత్సవాలు చివరి రోజు మరింత ఉత్సాహంగా సాగాయి. భవానీ ద్వీపంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలు కళాభిరుచులతో పాటు విజ్ఞానాన్నీ పంచిపెట్టాయని సందర్శకులు ఆనందం వ్యక్తం చేశారు.
ఆటపాటలతో కృష్ణా తీరం సందడిగా: విజయవాడ భవానీ ద్వీపంలో మూడో రోజు ఆవకాయ్-అమరావతి ఉత్సవాలు సందర్శకులను అలరించాయి. ఆటపాటలతో కృష్ణా తీరం సందడిగా మారింది. 'కథా కాలక్షేపం-స్టోరీ అవర్' కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగులో కథ చెప్పే కళపై శ్రీ కరుణ, బీఎన్ మూర్తి, మౌన శ్రీ మల్లిక్, వేదాంతం శ్రీ పతిశర్మ చర్చించారు. కథ అనేది కేవలం ప్రింటెడ్ మ్యాటర్ కాదు. దృశ్య ప్రధానమని వక్తలు అభిప్రాయపడ్డారు. సినిమా, పాత్రికేయ వృత్తిపై జరిగిన చర్చలో చల్లా భాగ్యలక్ష్మి, ముళ్లపూడి వెంకటరమణ కుమారుడు వర ముళ్లపూడి, సీనియర్ సినీ జర్నలిస్టు వడ్డి ఓం ప్రకాశ్ నారాయణ సంభాషించారు. ప్రస్తుతం సినీ జర్నలిజంలోని అనుభవాలను వారు పంచుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కార్యక్రమాలు, నగాడా శిక్షణ శిబిరాలు పర్యాటకుల్లో ఉల్లాసాన్ని నింపాయి. పపెట్ మేకింగ్ చిన్నారులకు వినోదపు విందును పంచింది. చౌరస్తా బ్యాండ్ సంగీత ప్రదర్శన ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. హుషారెత్తించే సినిమా పాటలు, జానపద గేయాలు శ్రోతలను ఉర్రూతలూగించాయి.
మన సంస్కృతి గొప్పతనాన్ని వివరించేలా: ఈ ఫెస్టివల్‌లో నవలల నుంచి వెండితెర వరకు తెలుగు రచనలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, డిజిటల్ యుగంలో తెలుగు సినిమా భవిష్యత్తుతో పాటు బుర్ర కథలు, కూచిపూడి నాట్యంపైనా చర్చలు జరిపారు. కవులు, రచయితలు, సినీ నిర్మాతలు, సంగీతకారులు, కళాకారులతో కలిసి ఆసక్తికరంగా ఇష్టాగోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించారు. వీటితో పాటు శిక్షణ కార్యక్రమాలు కూడా జరిపారు. సందర్శకుల కోసం అనేక ఆసక్తికరమైన అంశాలను ఈ ఉత్సవంలో అమలు పరిచారు. భవానీ ద్వీపంలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో రాష్ట్ర విశిష్టత, హస్త కళలు, నోరూరించే పిండివంటలు ప్రదర్శించారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఇంటిల్లిపాదికి ఆహ్లాదాన్ని పంచడమే కాకుండా, నేటి తరం యువతకు మన సంస్కృతి గొప్పతనాన్ని వివరించేలా ఈ వేడుకలు జరిగాయి.
త్వరలో నంది నాటకోత్సవాలు: ? ఏపీలో త్వరలో నంది నాటకోత్సవాలను నిర్వహించడంతో పాటు నంది అవార్డులను ప్రదానం చేస్తామని ఆవకాయ్-అమరావతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఆ సందర్భంగా పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏనాడూ ఇలాంటి కళా, సాంస్కృతిక వైభవానికి చోటివ్వలేదనీ, గడచిన ఆ ఐదేళ్లలో కళలు పూర్తిగా అణగారిపోయాయని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే ఉగాది, కందుకూరి పురస్కారాలను అందించామని చెప్పారు. కోనసీమలో నిర్వహించే ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని తెలిపారు.
ఈ సంవత్సరం డిసెంబరు 17, 18, 19 తేదీల్లో విజయవాడ పున్నమిఘాట్ వేదికగా మరోమారు ఆవకాయ్ కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి దుర్గేశ్ అన్నారు. ఆవకాయతో తెలుగువారికి విడదీయరాని సంబంధం ఉందనీ, అందుకే సంక్రాంతి పండగ నేపథ్యంలో ఆవకాయ్- అమరావతి కార్యక్రమం మూడు రోజులు పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించుకున్నామని చెప్పారు. గతంలో సాహిత్యానికి, నాటకానికి వేర్వేరుగా వేదికలు ఉండేవనీ, అయితే ప్రస్తుతం పాత, కొత్త మేలి కలయికతో వినూత్నంగా ప్రదర్శనలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు.
రాజుల కాలం నాటి నాణేలు, సమరయోధుల స్టాంపులు - 60 ఏళ్లుగా సేకరిస్తున్న శివప్రకాష్
'ఓఎంసీ'లో అంతులేని అక్రమాలు - తాజా సర్వేలో మరోసారి బయటపడ్డ ఉల్లంఘనలు

