ETV Bharat / state

మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ - రైతాంగ సాయుధ పోరాటం నుంచి నేటి వరకు ఉద్యమ చరిత్ర ఇదే

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్​తో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ - ఇప్పటికే వనం వీడి జనంలోకి వచ్చిన ఆ పార్టీ టాప్​ లీడర్లు - తెలంగాణలో పూర్తిగా బలహీనపడిన పార్టీ

Decline Of Maoist Movement In Telangana
Decline Of Maoist Movement In Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : February 27, 2026 at 12:11 PM IST

4 Min Read
Choose ETV Bharat

Decline Of Maoist Movement In Telangana : తెలంగాణ ప్రాంతంలో విప్లవానికి ఊపిరి పోసిన రైతాంగ సాయుధ పోరాటం, నిజాం కాలం నాటి నుంచి మలి దశలో మావోయిస్టు ఉద్యమ విస్తరణ వరకు ఈ గడ్డపై తుపాకీ గొట్టం వినిపించని రోజు లేదు. కానీ కాలక్రమేణా మారుతున్న సామాజిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ నేడు మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఉమ్మడి రాష్ట్రంలో వెట్టిచాకిరి, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా మొదలైన సాయుధ రైతాంగ పోరాటం, ఈ గడ్డపై విప్లవ బీజాలుగా ఏర్పడింది. ఆ తర్వాత మరో దశకంలో కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలోని పీపుల్స్​వార్ గ్రూప్ ఈ ప్రాంతాన్ని తన కంచుకోటగా మార్చుకుంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు విప్లవ భావజాలానికి కేంద్ర బిందువులయ్యాయి. వేలాది మంది యువత అడవి బాట పట్టి, సాయుధ పోరాటమే సమస్యలకు పరిష్కారమని నమ్మారు. అప్పటి నుంచి తాజా పరిణామాల వరకు ఓసారి మావోయిస్టు ఉద్యమ చరిత్రను పరిశీలిద్దాం.

అడవులు, కొండలను కంచుకోటగా మార్చుకుని : మావోయిస్టులు ఒకానొక దశలో ఉమ్మడి రాష్ట్రంలో పలు గ్రామాల్లో 'జనతన సర్కార్' పేరుతో సమాంతర ప్రభుత్వాలను నడిపారని గతంలోనే పోలీస్ అధికారులు గుర్తించారు. భూ పంపిణీ, గిరిజన సమస్యల పరిష్కారం లాంటి అంశాలతో ప్రజల్లో పట్టు సాధించారు. పోలీస్ నిఘా ఉన్నప్పటికీ, దట్టమైన అడవులు, కొండలు మావోయిస్టులకు రక్షణ కవచాలుగా మార్చుకున్నారు. దీంతో పోరాటంతోనే అన్ని రకాల సదుపాయాలు వస్తాయినే భావనను అదివాసులు, ప్రజల్లో మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు కల్పించారు. మావోలు ప్రధానంగా భూ సంస్కరణలు, గిరిజన హక్కులు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, అడవుల్లో పోలీసుల కూంబింగ్ నిలిపివేత తదితర అంశాలపై అప్పటి వైఎస్సార్ ప్రభుత్వంలో చర్చలు జరిగాయి. మొదటి విడత చర్చలు జరిగాక, భూ సంస్కరణల వంటి అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడం, పరస్పర దాడుల నేపథ్యంలో ఈ చర్చలు విఫలమయ్యాయి.

ఆపరేషన్​ కగార్​తో చెల్లాచెదురైన మావోలు : 2005 జనవరి నాటికి చర్చల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. మావోయిస్టులు తిరిగి అడవుల్లోకి వెళ్లిపోయారు. వైఎస్ఆర్ ప్రభుత్వం మావోయిస్టులపై మళ్లీ నిషేధాన్ని విధించింది. పోలీసులు మునుపెన్నడూ లేనంత తీవ్రంగా కూంబింగ్ నిర్వహించారు. 2005 సెప్టెంబర్‌లో మావోయిస్టు నేత ఆర్కేపై దాడి జరగగా, చిట్టాల ఎన్‌కౌంటర్ నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. అదే సమయంలో కీలక నేతలు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గ్రేహౌండ్స్ దళాల గాలింపు చర్యలను తక్షణమే నిలిపివేయాలని కూడా కోరారు. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ప్రభుత్వం మావోయిస్టుల ప్రభావాన్ని తగ్గించడానికి రెండు పద్ధతులతో చర్యలను చేపట్టింది.

ప్రపంచంలోనే అత్యుత్తమ అటవీ యుద్ధ తంత్రం తెలిసిన గ్రేహౌండ్స్ దళాలను బలోపేతం చేయడం ద్వారా మావోయిస్టుల షెల్టర్లను, రిక్రూట్‌మెంట్‌ను దెబ్బకొట్టారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో బలమైన చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి రాకపోకలను అడ్డుకున్నారు. కేవలం బల ప్రయోగంతోనే కాకుండా, ప్రజల కనీస అవసరాలు తీర్చడం ద్వారా వారు మావోయిస్టులకు దూరం అవుతారని అధికారులు భావించారు. అప్పటి నుంచి ప్రతి గ్రామంలో ఇంటికి తాగునీరు అందజేశారు. అట్టడుగు వర్గాలకు ఆర్థిక భరోసాను ప్రభుత్వం ఇచ్చింది. లోతట్టు గ్రామాలకు తారు రోడ్లు వేయడం ద్వారా గిరిజనులను ప్రధాన స్రవంతికి దగ్గర చేసింది. దీంతో పోలీసుల గస్తీ కూడా సులభమైంది. అలాగే కేంద్ర ప్రభుత్వం అపరేషన్ కగార్ పేరుతో మావోయిస్ట్ పార్టీని పూర్తిగా నిర్మూలించాలని భావించింది.

వనం వీడి జనంలోకి : ప్రస్తుతం తెలంగాణలోని మెజారిటీ జిల్లాల్లో మావోయిస్టుల ఉనికి లేకుండా పోయింది. మావోయిస్టు పార్టీకి అత్యంత బలమైన పునాదులు వేసిన నేతలే ఇప్పుడు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావడం విశేషం. ఆ పార్టీ పొలిట్​బ్యూరో సభ్యుడు, సెంట్రల్ మిలిటరీ కమిషన్​ ఇన్​ఛార్జి దేవ్​జీ, సెంట్రల్ కమిటీ సభ్యుడు రాజిరెడ్డి, రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు (దామోదర్), కీలక నేత నూనె నర్సింహా రెడ్డి లొంగిపోవడంతో రాష్ట్రంలో మావోయిస్టులకు దిశానిర్దేశం చేసే నాయకత్వం కనుమరుగైందని పోలీసులు చెబుతున్నారు.

జగిత్యాల జిల్లాకు చెందిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి మావోయిస్ట్ పార్టీ సుదీర్ఘకాలం జనరల్ సెక్రటరీగా పని చేశారు. ప్రసుత్తం ఆయన ఎక్కడ ఉన్నారనే సమాచారం మాత్రం బయటకు రావడం లేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన గడువు కంటే ముందే తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు రహితంగా మారింది. శాంతిభద్రతలు ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, దీంతో అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఒకప్పుడు తుపాకుల మోతతో దద్దరిల్లిన తెలంగాణ అడవులు, నేడు అభివృద్ధి బాట పడుతున్నాయి. భావజాల వ్యాప్తి కోసం మావోయిస్టులు పట్టణ ప్రాంతాల్లో మేధావుల ద్వారా ప్రయత్నిస్తున్నారనే నివేదికల నేపథ్యంలో పోలీసులు ఇప్పటికీ అప్రమత్తంగానే ఉన్నారు. ఏది ఏమైనా తెలంగాణ చరిత్రలో విప్లవ అధ్యాయం క్రమంగా ముగిసి, సంక్షేమ అధ్యాయం మొదలైందని చెప్పవచ్చు.

'సారండా' అడవుల్లో మరో అపరేషన్​ - మావోయిస్టు అగ్రనేతలే లక్ష్యంగా బలగాల కూంబింగ్

30 ఏళ్ల వన వాసం వీడి జన జీవన స్రవంతిలోకి - చొక్కారావు కోసం కుటుంబసభ్యుల ఎదురుచూపులు