త్వరలో మరో విద్యా సంవత్సరం - "తల్లికి వందనం" డబ్బులు రావాలంటే ఇలా చేయండి!
ఈ ఏడాది తల్లికి వందనం నిధుల జమకు కసరత్తు - ముందుగా మేల్కొంటేనే పథకం వర్తింపు

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 23, 2026 at 1:01 PM IST
Thalliki Vandanam Scheme 2026 : రాష్ట్రంలో విద్యా రంగంలో మార్పులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ రంగం పటిష్ఠతకు పలు అంశాలను అమల్లోకి తీసుకొచ్చింది. పేద, మధ్య తరగతి వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో ఇంటింటా ఆనందం విరిసేలా కూటమి ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకాన్ని ప్రవేశపెట్టింది. కుటుంబంలో ఉన్న పిల్లలందరినీ అర్హులుగా నిర్ధారించింది. ఇందులో భాగంగా బడికి వెళ్లే ప్రతి విద్యార్థికీ రూ.15,000 చొప్పున నగదు జమచేస్తోంది. ఇందులో రూ.2,000 పాఠశాల నిర్వహణ, రూ.13,000 ఆ విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్న విషయం తెలిసిందే.
మరికొద్ది రోజుల్లో (జూన్‌లో) విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలోనే తల్లికి వందనం నిధులు జమ చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ కావాలంటే ఆధార్ అనుసంధానం తప్పనిసరి. గత సంవత్సరం ఆధార్ అనుసంధానం కాకపోవడంతో పలు జిల్లాలో చాలా మంది తల్లికి వందనం పథకానికి దూరమయ్యారు. వీరంతా బ్యాంకులు, ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. లబ్ధిదారులు గతంలో పడిన ఇబ్బందులు పునరావృతం కాకుండా ముందస్తుగా బ్యాంకు అకౌంట్‌తో ఆధార్ అనుసంధానం చేసుకోవాలని విద్యాశాఖ విజ్ఞప్తి చేస్తోంది.
గతేడాది నష్టపోయారిలా :
- నంద్యాల జిల్లాలో గత సంవత్సరం అన్ని విద్యా సంస్థల పరిధిలో కలిపి 2,59,561 మందిని అర్హులుగా గుర్తించారు. వీరి కోసం రూ.308.90 కోట్లను సర్కార్ విడుదల చేసింది. బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం కాకపోవడంతో 17,437 మంది లబ్ధి పొందలేకపోయారు.
- కర్నూలు జిల్లాలో 4,19,295 మందిని అర్హులుగా గుర్తించారు. ఇందుకోసం రూ.531.94 కోట్లు మంజూరు చేశారు. అయితే బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం కాకపోవడంతో 32,408 మంది విద్యార్థుల తల్లి ఖాతాలో నిధులు జమ కాలేదు.
- కృష్ణా జిల్లాలోని 25 మండలాల్లో 1343 ప్రభుత్వ, 435 ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో 2,36,384 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 1,89,195 మంది ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. కానీ 1,75,782 మంది విద్యార్థులకు సంబంధించి 1,25,965 తల్లుల ఖాతాల్లో రూ.224.29 కోట్లు జమయ్యాయి. బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం కాకపోవడంతో మొత్తంగా 13,413 మందికి రూ.20.12 కోట్ల నిధులు అందుకోలేకపోయారు.
- ఎన్టీఆర్ జిల్లాలోని 20 మండలాల్లో 913 ప్రభుత్వ, 1429 ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీల్లో 3,33,937 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 2,60,004 మంది ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. కానీ కేవలం 2,36,984 మంది విద్యార్థులకు సంబంధించి 1,74,669 తల్లుల ఖాతాల్లో రూ.302.43 కోట్ల నిధులు జమయ్యాయి. తల్లుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాకపోవడం, ఇతరత్రా కారణాల వల్ల 23,020 మంది పిల్లలు రూ.34.53 కోట్లు పొందలేకపోయారు.
- బాపట్ల జిల్లాలో ఆధార్ అనుసంధానం కాక గతేడాది సుమారు 9 వేల మందికి నిధులు జమ కాలేదు.
ఆధార్, బ్యాంక్ ఖాతా లింక్‌ను ఇలా సరిచూసుకోండి :
- ఈ పథకానికి అర్హులైన లబ్ధిదారులు సంబంధిత బ్యాంకుకు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. వెళ్లేముందు ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే మంచిది.
- బ్యాంకులో ఎన్‌పీసీఐ లింక్‌డ్ ఫారం లేదా ఆధార్ సీడింగ్ ఫారం తీసుకోవాలి. ఆధార్ సంఖ్య, బ్యాంకు అకౌంట్ వివరాలు, మొబైల్ నంబర్‌తో పాటు అవసరమైన సమాచారం నమోదు చేయాలి. దాన్ని బ్యాంకు సిబ్బందికి అందజేసి రసీదు పొందాలి. ఎన్‌పీసీఐ అనుసంధానమయ్యాక ఫోన్ నంబర్‌కి సంక్షిప్త సందేశం వస్తుంది.
- మీ అకౌంట్ ఆధార్‌కు లింకు కాకుంటే ఆధార్ జిరాక్స్‌పై సంతకం చేసి సమర్పించాలి. ఎస్‌ఎంఎస్ ద్వారా నిర్ధారణ సందేశం వస్తోంది.
- ఆన్లైన్లో ‘యూఐడీఏఐ’ అధికారిక ఆధార్ వెబ్‌సైట్లోకి వెళ్లి ‘‘మై ఆధార్ నుంచి ఆధార్ సర్వీసెస్’’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఆధార్ లింక్ సర్వీసెస్ ఆప్షన్ తీసుకొంటే లాగిన్ వస్తుంది. అక్కడ 12 అంకెల ఆధార్ నంబర్, క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయాలి. వెంటనే రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని సబ్మిట్ చేయాలి. ఇలాచేస్తే ఆధార్‌కు ఏ బ్యాంకు లింక్ ఉందన్న సమాచారం కనిపిస్తుంది. లింక్ లేకుంటే సంబంధిత బ్యాంకులో సంప్రదిస్తే అనుసంధానం చేస్తారు.
ఒత్తిడి తగ్గిస్తూ సృజనాత్మకత పెంచుతూ - విద్యార్థుల భవిష్యత్‌కు రంగులద్దుతున్న టీచర్
కలిసొచ్చిన సమ్మర్ హాలీడేస్ - ఇంగ్లిష్‌లో అదరగొడుతున్న విద్యార్థులు

