ETV Bharat / state

ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నిక‌లు, ప్రభుత్వంలో విలీనం - సీఎం రేవంత్ రెడ్డి మార్గనిర్దేశం

సీఎం రేవంత్ రెడ్డితో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల సమావేశం - మెరుగైన సేవ‌లందించేందుకు స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ‌తో ముందుకు రావాల‌న్న సీఎం - ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నిక‌లు, ప్రభుత్వంలో విలీనంపై సీఎం మార్గనిర్దేశం

RTC Trade Union Leaders Meet With Cm Revanth Reddy
RTC Trade Union Leaders Meet With CM Revanth Reddy (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : May 2, 2026 at 7:14 AM IST

3 Min Read
Choose ETV Bharat

RTC JAC Leaders Meet CM Revanth Reddy : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ - టీజీఎస్ఆర్టీసీ మ‌నుగ‌డ‌, గౌర‌వాన్ని పెంపొందించి ప్రయాణికులకు మెరుగైన సేవ‌లందించేందుకు స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ‌తో ముందుకు రావాల‌ని కార్మిక సంఘాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నిక‌లు, ప్రభుత్వంలో విలీనంపై అన్ని సంఘాల నాయ‌కులు స‌మావేశ‌మై స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌న్నారు. పీఆర్సీ అంశాన్ని పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

సమ్మె కాలంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలి : ఆర్టీసీ సమస్యలను వంద శాతం పరిష్కరిస్తామని కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. సంస్థలను బలోపేతం చేసుకుని నిలబెట్టుకోవడంలో కార్మికులు సహకరించాలని కోరారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకున్నందుకు ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

గుర్తింపు సంఘం ఎన్నిక‌లు, విలీనంపై ఏ విధంగా ముందుకు పోవాల‌నే దానిపై సంఘాల నాయ‌కులు స‌మావేశ‌మై ప్రభుత్వం ఎదుట ఆప్షన్లు ఉంచాల‌ని సీఎం సూచించారు. ఒక‌వేళ యూనియ‌న్ల మ‌ధ్య ఏకాభిప్రాయం కుద‌ర‌క‌పోతే ఏ యూనియ‌న్‌కు ఆ యూనియ‌న్ త‌మ ఆప్షన్లు ఇస్తే కామ‌న్‌గా ఉన్న వాటికి ఆమోదం తెలిపి భిన్నాభిప్రాయాలు ఉన్న వాటిపై చ‌ర్చిద్దామ‌ని చెప్పారు. టీజీఎస్ఆర్టీసీ కార్మికుల 3 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలని, సమ్మె కాలంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలని కార్మిక సంఘాల ప్రతినిధుల విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.

రెండు బ‌స్ టెర్మిన‌ల్ : నేను వేరు, మీరు వేరు అనే భావ‌న తనకు ఎప్పుడూ లేదని, అంద‌రం క‌లిస్తేనే ప్రభుత్వమని సీఎం గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికుల పోరాటాల్లో ఉన్నామని, బ‌స్సుల‌ను పెంచామనీ, నియామ‌కాలు, ఆదాయం వృద్ధి చేశామన్నారు. ప్రజలకు సేవ‌లు అందించే విష‌యంలో కార్మికులు ప‌ట్టుద‌ల‌తో ప‌ని చేయ‌డం వల్లే టీజీఎస్ఆర్టీసీ దేశంలోనే గొప్ప సంస్థగా నిలిచిందని అన్నారు.

గాజుల‌రామారంలో బస్ టెర్మిన‌ల్ కోసం 100 ఎక‌రాలు కేటాయించామని, శంషాబాద్‌లో 150 ఎక‌రాల్లో అంత‌ర్జాతీయ స్థాయి బ‌స్ టెర్మిన‌ల్ నిర్మిస్తామన్నారు. వెయ్యి ఈవీ బ‌స్సులు కొనుగోలు చేసి మెట్రోతో అనుసంధానం చేస్తున్నామని, అలాగే మినీ బ‌స్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అంద‌జేయాల‌నుకుంటున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. డీజిల్‌పైన ఆర్టీసీ ప్రతి ఏడాది 2 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తుందని, డీజిల్ ఖ‌ర్చు త‌గ్గించుకోవ‌డానికి ఈవీ బ‌స్సుల‌ను తీసుకురావాలని భావిస్తున్నామన్నారు. ఆదాయం పెర‌గాలంటే ఖ‌ర్చు త‌గ్గించుకోవాలని, దీని కోసం ప‌క్కా ప్రణాళిక కావాలన్నారు.

ఆర్టీసీలో బ‌కాయిలు తమ హ‌యాంలో పెట్టిన‌వి కావని, కానీ వాటిని క్లియ‌ర్ చేయ‌డానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామాల‌ను ప్రజా ప్రభుత్వం చేపట్టిందని సీఎం వివరించారు.

ఒక్క డ్రైవ‌ర్‌ను కూడా త‌గ్గించం : ఆర్థిక అంశాల‌తో పీఆర్సీ వంటి వాటిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. శాశ్వత పరిష్కారం కోసం చ‌ర్చించుకుని ప్రభుత్వం ముందు ఆప్షన్స్‌ పెట్టాలని సూచించారు. రాజకీయాల ప్రభావానికి లోనైతే సంస్థకు న‌ష్టం జ‌రుగుతుందన్నారు. ఆర్టీసీ అప్పుల పైన ఉన్న వ‌డ్డీ భారాన్ని త‌గ్గించ‌డానికి ప్రయత్నాలు చేస్తున్నామని, సంస్థ బ‌లోపేతం చేసుకుని నిల‌బెట్టుకోవ‌డానికి కార్మికులు స‌హ‌క‌రించాలని రేవంత్ రెడ్డి కోరారు. అలాగే ఆర్టీసీలో ఒక్క డ్రైవ‌ర్‌ను కూడా త‌గ్గించమన్నారు. సంస్థను బాగు చేసుకునే అవ‌కాశం కార్మికుల‌పైనే ఉందని, కార్మికులు, డిపో మేనేజ‌ర్ల మ‌ధ్య దూరం పెరగకుండా అధికారులు చూడాలన్నారు. ఆర్థికంగా ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల బ‌కాయిలు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు.

ఆర్టీసీ విలీనం గురించి ఎన్నికల అజెండాలో పెట్టాం: పొన్నం ప్రభాకర్

2021 ఏప్రిల్‌ నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు 11శాతం ఫిట్​మెంట్ - రిటైర్డ్ ఉద్యోగులకు కూడా