ఆర్టీసీ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు - ప్రయాణికుల రక్షణ, భద్రతే ధ్యేయంగా సరికొత్త ప్రయోగం
ప్రమాదాలు, చోరీల అడ్డుకట్టకు బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు - బస్సులో భరోసా పేరిట సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం - ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభించిన ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి - 175 బస్సుల్లో నిఘా కెమెరాలు

Published : May 25, 2026 at 7:38 AM IST
|Updated : May 25, 2026 at 7:45 AM IST
TGSRTC Instals CCTV Cameras in RTC Buses : ప్రయాణికుల భద్రత, రక్షణకు ప్రతీకగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో చోరీలు, సిబ్బందిపై దాడులకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్టీసీ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ప్రయాణికులు ప్రశాంతమైన వాతావరణంలో గమ్యస్థానాలకు చేరుకునేలా బస్సుల్లో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటుకు సంస్థ శ్రీకారం చుట్టింది. బస్సులో భరోసా పేరిట ఆదిలాబాద్‌లో ఈ పైలట్ ప్రాజెక్ట్ ను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ప్రారంభించారు.
బస్సులో భరోసా పేరిట : ప్రయాణికుల రక్షణ, భద్రత కోసం టీజీఎస్ ఆర్టీసీ మరో ప్రయోగానికి సిద్ధమైంది. బస్సుల్లో దొంగతనాలు, ప్రమాదాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు ప్రతి బస్సులో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. పోలీసుశాఖతో సమన్వయం చేసుకుంటూ "బస్సులో భరోసా" పేరిట రూపొందించిన ఈ సరికొత్త భద్రతా ప్రాజెక్టును ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ప్రారంభించారు. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని సుమారు 175 బస్సుల్లో అత్యాధునిక నిఘా కెమెరాలను అమర్చారు. డ్రైవర్ క్యాబిన్, ప్రయాణికుల సీట్లు, ఫుట్‌బోర్డు సహా బస్సులోని ప్రతి అంగుళం స్పష్టంగా కనిపించేలా సీసీటీవీ కెమెరాలను అమర్చారు. బస్సు ఎక్కే ప్రతి వ్యక్తి ముఖకదలికల నుంచి ప్రయాణంలో జరిగే ప్రతి చిన్న యాక్టివిటీ వరకు అన్నీ ఇందులో రికార్డు అవుతాయి. ఈ విజువల్స్ అటు డ్రైవర్, కండక్టర్లతో పాటు ఆర్టీసీ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఈ నిఘా వ్యవస్థ దొంగల ముఠాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను ముందే గుర్తించి అప్రమత్తం చేయడానికి ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
పోకిరీల చేష్టలకు చెక్ పెట్టేలా : మహిళా ప్రయాణికులపై వేధింపులు, దొంగతనాలు, అనుచిత ప్రవర్తన వంటి ఘటనలకు చెక్ పెట్టేలా ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో సుదూర ప్రాంతాలకు ఒంటరిగా ప్రయాణించే మహిళలు, వృద్ధులు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బస్సులో కెమెరా ఉందనే భయం నేరగాళ్లలో గుబులు పుట్టిస్తుందని, ప్రయాణం మరింత సురక్షితంగా మారుతుందని ప్రజలు భావిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు : కెమెరాల ఏర్పాటుతో డ్రైవింగ్ ప్రమాణాలు కూడా మెరుగవుతాయని, సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని అధికారులు చెబుతున్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన, ప్రమాదం జరిగినా తక్షణమే ఖచ్చితమైన ఆధారాలను సేకరణకు ఈ వ్యవస్థ ఎంతగానో దోహదపడనుందని పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైన ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు సాధించే ఫలితాలను బట్టి, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల బస్సులకు సీసీటీవీ కెమెరాల రక్షణ కవచాన్ని విస్తరించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

