ETV Bharat / state

పోలీసు బాస్‌ల గొంతులతో బెదిరింపులు - వ్యాపారుల నుంచి లక్షలు లాగిన ఘరానా కేటుగాడు

తెనాలిలో ఘరానా మోసం - స్నేహితుడిలా నటించి వ్యాపారికి వల - అప్పు అడిగితే కాళ్లు, చేతులు నరికేస్తానంటూ బెదిరింపులు - ఎస్పీ, డీఎస్పీల గొంతులను అనుకరిస్తూ లక్షల వసూలు

CONMAN IMPERSONATES POLICE TENALI
పోలీసు బాస్‌ల గొంతులతో బెదిరింపులు (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 27, 2026 at 8:32 PM IST

3 Min Read
Choose ETV Bharat

Tenali Conman Impersonates Police to Extort Money : వ్యాపారులతో పరిచయం పెంచుకున్నాడు. ప్రాణ స్నేహితుడిలా నటించి నమ్మించాడు. తీరా అప్పు తీసుకున్నాక అసలు రంగు బయటపెట్టాడు. డబ్బులు అడిగితే కాళ్లు, చేతులు నరికేస్తానంటూ బెదిరించాడు. అంతటితో ఆగక ఏకంగా ఎస్పీ, డీఎస్పీ లాంటి పోలీస్ ఉన్నతాధికారుల పేర్లు, వారి గొంతులతో ఫోన్లు చేసి వ్యాపారులను భయపెట్టాడు. రక్షించాల్సిన పోలీసుల పేర్లతోనే మోసాలకు పాల్పడుతున్న ఈ కేటుగాడి గుట్టును తెనాలి పోలీసులు రట్టు చేశారు. తమదైన వ్యూహంతో కిలాడీ ఆట కట్టించారు.

గుంటూరు జిల్లా తెనాలిలోని గంగానమ్మపేట రోడ్డులో రవికుమార్, విజయ్ యాదవ్ పాన్ బ్రోకర్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరికి నూతలపాటి రత్నబాబు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. రత్నబాబు గతంలో పలుమార్లు వీరి వద్ద బంగారం, వెండి వస్తువులను తాకట్టు పెట్టేవాడు. ఆ తర్వాత డబ్బులు చెల్లించి నమ్మకంగా వాటిని విడిపించుకునేవాడు. ఇలా వ్యాపారుల నమ్మకాన్ని చూరగొన్నాడు. అయితే, వ్యాపారి రవికుమార్ వద్ద ఉన్న డబ్బు, ఆస్తి చూసిన రత్నబాబుకు దురాశ పుట్టింది. ఎలాగైనా అతని వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు లాగాలని పక్కా స్కెచ్ వేశాడు.

పోలీసు బాస్‌ల గొంతులతో బెదిరింపులు - వ్యాపారుల నుంచి లక్షలు లాగిన ఘరానా కేటుగాడు (ETV Bharat)

గొంతులు మార్చి : ప్రణాళికలో భాగంగా రవికుమార్ వద్ద రత్నబాబు అప్పు తీసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత డబ్బులు తిరిగివ్వాలని వ్యాపారి అడగగా, రత్నబాబు తన అసలు స్వరూపం బయటపెట్టాడు. డబ్బులు ఇవ్వకపోగా ఎదురుతిరిగాడు. కాళ్లు, చేతులు నరికేస్తానని, చంపేస్తానని బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వ్యాపారి అనగా, తనకు ఉన్నతస్థాయి అధికారులు తెలుసంటూ బుకాయించాడు. ఆ తర్వాత వేరే నంబర్ల నుంచి ఏకంగా జిల్లా ఎస్పీ, తెనాలి డీఎస్పీ, సీఐ మాట్లాడుతున్నానంటూ గొంతులు మార్చి ఫోన్లు చేశాడు. 'మీ వ్యాపారాల్లో లొసుగులున్నాయి. అంతుచూస్తాం' అంటూ బెదిరింపులకు దిగాడు. ఈ బెదిరింపులకు భయపడిపోయిన బాధితుడు, ఫోన్‌పే ద్వారా, నగదు రూపంలో విడతల వారీగా ఏకంగా రూ. 6.80 లక్షలు నిందితుడికి సమర్పించుకున్నాడు.

ఖాకీల ఎంట్రీతో సీన్ రివర్స్ : రోజురోజుకూ బెదిరింపులు పెరిగిపోవడం, పోలీసుల గొంతులతోనే బెదిరింపులకు పాల్పడుతుండటంతో వ్యాపారి రవికుమార్‌కు అనుమానం వచ్చింది. ఈ వ్యవహారంపై విసుగు చెందిన ఆయన, చివరకు తనకు తెలిసిన పోలీసులకు అసలు విషయం చెప్పాడు. బాధితుడి ఫిర్యాదుతో తెనాలి టూ టౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడు నూతలపాటి రత్నబాబును అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 40 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

హైటెక్ వసూళ్లకు ఎండ్ కార్డ్ : క్రైం సినిమాలు చూసి స్ఫూర్తి పొందాడో లేక, మిమిక్రి షోల నుంచి నేర్చుకున్నాడో గాని, పోలీసు అధికారుల పేరుతో మాట్లాడి అతను బెదిరించిన తీరు చూసి పోలీసులే విస్మయం చెందారు. ఉన్నతాధికారుల పేర్లు చెప్పి వసూళ్లకు పాల్పడటంపై తీవ్రంగా పరిగణించారు. తెనాలి పట్టణంలో కలకలం రేపిన ఈ హైటెక్ వసూళ్ల పర్వానికి రత్నబాబు అరెస్టుతో ఎండ్ కార్డ్ పడింది. ఈ తరహా మోసాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి ఆటకట్టించిన సీఐ రవీంద్రబాబు, ఎస్సై లలిత్ కుమార్, సిబ్బంది బాబురావు, గణేశ్​, నాగరాజులను డీఎస్పీ జనార్ధనరావు అభినందించారు.

"నిందితుడు రత్నబాబు పోలీసు అధికారుల పేరుతో మాట్లాడి బెదిరింపులకు పాల్పడేవాడు. జిల్లా ఎస్పీగా, తెనాలి డీఎస్పీగా, సీఐగా తన గొంతును మార్చి, ఫోన్లలో మాట్లాడుతూ వ్యాపారులకు దడ పుట్టించాడు. అందుకే ఈ వ్యవహారాన్ని మేం సీరియస్​గా తీసుకున్నాం. వ్యక్తిగతంగా బెదిరించటమే కాకుండా, ఉన్నతాధికారుల పేర్లు వాడుకోవడంతో ప్రత్యేక దృష్టి సారించాం. పక్కా ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాం. ఇలాంటి బెదిరింపులకు ఎవరు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం."-డి.రవీంద్రబాబు, తెనాలి టూటౌన్ సీఐ

బస్సు ప్రయాణికులే టార్గెట్ - ఫ్యామిలీ దొంగల ముఠా అరెస్ట్

సాదిక్ వేధింపుల వల్లే ఆ కుటుంబం బలి - రెండు లేఖల్లోనూ అదే ఉంది: ఎస్పీ బిందుమాధవ్