విజయవాడ దుర్గగుడిలో రూ.1.20 కోట్లతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు
ఇంద్రకీలాద్రిలో భక్తులకు మెరుగైన సేవలు - తాగునీటి ప్లాంటు ఏర్పాటుకు నిర్ణయించిన పాలకమండలి, శాశ్వత ప్రాదిపదికన ఉండేలా ప్లాంట్‌ను నెలకొల్పుతామని వెల్లడించిన ఆలయ ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 10, 2026 at 10:43 AM IST
Set Up Drinking Water Plant At Vijayawada Durga Temple: విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పరిధిలో తాగునీటి కొనుగోలు ఖర్చును తగ్గించుకునేందుకు సొంతంగా ప్లాంటు ఏర్పాటుకు పాలకమండలి సమావేశం నిర్ణయించింది. ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ నేతృత్వంలో పాలకమండలి సమావేశం జరిగింది. 15 అజెండా అంశాలతోపాటు ఇతర విషయాలపై సుమారు మూడున్నర గంటలపాటు కూలంకుషంగా చర్చించారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 13 నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు జరగనున్నాయని సమావేశ అనంతరం ఆలయ ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు. ఏటా దసరా ఉత్సవాలు, భవానీదీక్షల సమయంలో అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చే భక్తుల కోసం తాగునీటిని ప్లాస్టిక్ బాటిళ్ల రూపంలో అందిస్తున్నామని రాధాకృష్ణ వివరించారు. ఇందుకోసం ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తోందన్నారు.
శాశ్వత ప్రాదిపదికన ఏర్పాటు: ఈ పరిస్థితిని అధిగమించేందుకు దేవస్థానం స‌్థలంలోనే శాశ్వత ప్రాదిపదికన ఉండేలా తాగునీటి ప్లాంట్ ఏర్పాటుకు గత పాలకమండలి సమావేశంలో చర్చించినప్పటికీ, ఈ సమావేశంలో ఆమోదం తెలిపామని పేర్కొన్నారు. తిరుమల తరహాలోనే అక్కడ వినియోగిస్తున్న యంత్రాల సహాయంతో లడ్డూ తయారు చేసేందుకు ప్రభుత్వ సూచన మేరకు ఆలయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వచ్చారని, త్వరలో లడ్డు తయారీ ప్రారంభం అవుతుందని ఆలయ ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.
మెరుగైన సేవలను అందించేందుకు: నీటి కోసం విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో కోట్లాది రూపాయల ఖర్చు అవుతుందని ఆలయ ఛైర్మన్ అన్నారు. దసరా ఉత్సవాల్లో, భవానీ దీక్షల సమయంలో నీటి వాడకం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ఫలితంగా వాటర్ బిల్లులు కోట్లలో చెల్లిస్తున్నామని, ఈ సమస్యను అధిగమించేందుకు శాశ్వత ప్రాతిపదికన దేవస్థానంలో తాగునీటి ప్లాంటును ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీని ద్వారా భక్తులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు దోహదపడుతుందని రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు.
దీనికోసం సీవీ. రెడ్డి ఛారిటీస్ స్థలంలో దాదాపు 3 ఎకరాల విస్తీర్ణంలో వాటర్ ప్లాంటును నిర్మిస్తామని ఆలయ ఛైర్మన్ అన్నారు. ఈ ప్లాంటు ద్వారా ఎంత నీరు కావాలంటే అంత వినియోగించుకునే వెసులుబాటు ఉంటుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా వేసవికాలంలో సైతం నిరంతరాయంగా వినియోగించుకునే విధంగా ఉండేందుకు ఎంతో దోహదపడుతుందని రాధాకృష్ణ వివరించారు.
వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు 1.20 కోట్లు: వాటర్ ప్లాంటు ఏర్పాటు కోసం 1.20 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ఛైర్మన్ తెలిపారు. అదే విధంగా వాటర్ బాటిల్‌పై దుర్గామాత లేబుల్ పెట్టుకుని ఉండాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వీటితో పాటు ఆలయ అభివృద్ధి పనులపై సైతం తమ దృష్టిని కేంద్రీకరించినట్లు రాధాకృష్ణ వివరించారు. లడ్డు తయారీ, అన్నదాన సత్రాలను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
లడ్డు తయారీకి యంత్రాలు: ఈ మధ్య కాలంలో ఇంజినీరింగ్ సిబ్బంది, ఆలయ ఈవో శీనానాయక్, బృంద సభ్యులు కలిసి తిరుపతికి వెళ్లారని తెలిపారు. అనంతరం అక్కడ లడ్డు తయారీకి ఉపయోగించే యంత్రాలు ఏ విధంగా ఉన్నాయి, వాటి పనితీరు ఎలా ఉంది అనే వాటిని పరిశీలించి వచ్చారని వివరించారు. ఆ సామగ్రిని టీటీడీకి అందించిన వారిని పిలిపించుకుని వారితో చర్చించినట్లు గుర్తు చేసుకున్నారు. యంత్రాలను కొనుగోలు చేసేందుకు మొత్తంగా ఎంత ఖర్చు అవుతుందనేది వారిని అడిగి తెలుసుకున్నామని పేర్కొన్నారు. దీనిపై మరో రెండు మూడు రోజుల్లో పూర్తిగా స్పష్టత అనేది వస్తుందని ఈ సందర్భంగా ఛైర్మన్ తెలియజేశారు.
"విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో నీటి కోసం కోట్లాది రూపాయల ఖర్చు అవుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు శాశ్వత ప్రాతిపదికన దేవస్థానంలో తాగునీటి ప్లాంటును ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించాం. వాటర్ ప్లాంటు ఏర్పాటు కోసం 1.20 కోట్ల వరకు ఖర్చు అవుతుంది"- బొర్రా రాధాకృష్ణ,ఆలయ ఛైర్మన్
దేవాదాయ, విద్యుత్‌శాఖల మధ్య బకాయిల వివాదం - ఎట్టకేలకు దుర్గగుడికి విద్యుత్తు సరఫరా
దుర్గగుడిలో భక్తుల సేవల మెరుగుకు ప్రక్షాళన చర్యలు - పక్కాగా మూడంచెల ప్రణాళిక!

