ETV Bharat / state

అమెరికాలో రోడ్డు ప్రమాదం - ఏపీ యువతి మృతి

అమెరికాలోని న్యూయార్క్‌లో రోడ్డు ప్రమాదం - ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన అట్లూరి ప్రసన్న మృతి - మృతదేహన్ని గ్రామానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి

Telugu Student Atluri Prasanna Died in New York
Telugu Student Atluri Prasanna Died in New York (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 7, 2026 at 6:52 PM IST

2 Min Read
Choose ETV Bharat

Telugu Student Atluri Prasanna Died in New York : ఉన్నత చదువులు, ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా ఏటా వేలాది మంది భారతీయ యువత విదేశీ బాట పడుతున్నారు. సొంత ఊరిని, కన్నవారిని వదిలి బంగారు కలలతో విదేశాలకు పయనమవుతున్నారు. ఈ క్రమంలో కొందరు అనుకున్న లక్ష్యాలను సాధించి విజయ శిఖరాలను అధిరోహిస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రమాదాల బారిన పడి అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు.

తాజాగా ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన మరో తెలుగు విద్యార్థిని అనుకోని రీతిలో ప్రాణాలు కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అట్లూరి ప్రసన్న న్యూయార్క్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. జులై 5న ఈ ఘటన చోటు చేసుకుంది. వారాంతపు సెలవు కావడంతో ఆమె తన స్నేహితులతో కలిసి కారులో సమీపంలోని గుడికి బయల్దేరింది. సిగ్నల్‌ వద్ద ఆగిన వీరి కారును మరో వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రసన్న, మరో అమ్మాయి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు.

చంద్రబాబు, లోకేశ్​కు అభ్యర్థన : ప్రసన్న స్వస్థలం ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామం. తండ్రి వసంతరావు వ్యవసాయం చేస్తున్నారు. తల్లి మల్లీశ్వరీ గ్రామంలో బ్యాగుల తయారీ యూనిట్ నిర్వహిస్తున్నారు. వీరు పైసాపైసా కూడబెట్టి కూతుర్ని ఉన్నత చదువులు చదివించాలన్న లక్ష్యంతో విదేశాలకు పంపారు. ప్రసన్న తమ్ముడు ధనుంజయ్ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. సీఏ చదివిన ప్రసన్న న్యూయార్క్‌కు వెళ్లి పేస్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా ఇలా అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందడం కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్థులను కలిచివేసింది. ఆమె మృతదేహన్ని గ్రామానికి తీసుకువచ్చేందుకు సాయం చేయాలని కుటుంబసభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌ను అభ్యర్థించారు.

వరుస ఘటనలు : ఇటీవల అమెరికాలో సంభవించిన వరదల్లో గల్లంతై బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లికి చెందిన దొప్పలపూడి వెంకటేశ్‌ (32) అనే యువకుడు మృతి చెందారు. రెండు రోజులుగా వెంకటేశ్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన అక్కడి పోలీసులు, చివరికి అతడు తన కారుకు సమీపంలోనే బురదలో కూరుకుపోయి ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు.

మరోవైపు కొద్దిరోజుల క్రితం విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన యువకుడు అమెరికాలో మృతి చెందాడు. ఉన్నత చదువుల నిమిత్తం రెండేళ్లు క్రితం సాయి శ్రీ హరికృష్ణ అమెరికాకు వెళ్లాడు. MSC పూరైన తర్వాత అక్కడే రెండు నెలల కిందట ఎలిసెంట్ క్లీన్ టెక్నాలజీలో ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరాడు. తన పుట్టినరోజు సందర్భంగా ఓ రిసార్ట్‌లో వేడుకల తర్వాత నదిలో ఈతకు వెళ్లాడు. కానీ ప్రమాదవశాత్తు నదిలో మునిగి మృతిచెందినట్లు హరికృష్ణ తండ్రి తెలిపారు.

అమెరికాలో బొబ్బిలి యువకుడు మృతి - మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు

అమెరికా వరదల్లో తెలుగు యువకుడు మృతి - కారు సమీపంలోనే వెంకటేశ్ మృతదేహం లభ్యం