ETV Bharat / state

కర్ణాటకలో తెలుగు కుర్రాడి సంచలనం - ఎయిర్‌ పిస్టల్‌లో 8 బంగారు పతకాలు కైవసం

10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్ విభాగంలో ఎనిమిది బంగారు పతకాలను కైవసం చేసుకున్న ఉమాకార్తీక్ - 400 పాయింట్లకుగాను 375 స్కోరుతో అద్భుత ప్రదర్శన -12 ఏళ్ల వయసులో ఎయిర్‌ పిస్టల్​లో నెంబర్-1 ర్యాంకు

Telugu Boy Uma Karthik Wins 8 Gold Medals
Telugu Boy Uma Karthik Wins 8 Gold Medals (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 27, 2026 at 7:23 PM IST

2 Min Read
Choose ETV Bharat

Telugu Boy Uma Karthik Wins 8 Gold Medals : కర్ణాటక స్టేట్ షూటింగ్ ఛాంపియన్‌ షిప్‌లో తెలుగు బాలుడు సత్తా చాటాడు. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడుకు చెందిన 12 ఏళ్ల ఉమాకార్తీక్ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్ విభాగంలో ఎనిమిది బంగారు పతకాలను కైవసం చేసుకున్నాడు. ఈ కేటగిరీలో 400 పాయింట్లకుగాను 375 స్కోరుతో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఎందరో అనుభవజ్ఞులైన షూటర్లను వెనక్కినెట్టి పురుషుల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో నెంబర్-1 ర్యాంకు సాధించాడు.

కర్ణాటక నెం.1 ర్యాంక్​ కైవసం : బెంగళూరులోని కర్ణాటక స్టేట్ రైఫిల్ అసోసియేషన్ (KSRA), SAI క్యాంపస్‌లో జరిగిన 14వ కర్ణాటక రాష్ట్ర షూటింగ్ ఛాంపియన్‌షిప్-2026లో తెలుగు కుర్రాడు అదరగొట్టాడు. 12 ఏళ్ల ఉమాకార్తీక్ తన ప్రతిభ, పట్టుదలతో అద్భుత ప్రదర్శన కనబరిచి ఏకంగా 8 స్వర్ణ పతకాలు సాధించాడు. ఈ విజయంతో అనుభవజ్ఞులైన సీనియర్, జూనియర్, యువ షూటర్లను అధిగమించి పురుషుల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఉమాకార్తీక్ కర్ణాటక నెం.1 ర్యాంకును కైవసం చేసుకున్నాడు.

కర్ణాటకలో తెలుగు కుర్రాడి సంచలనం - ఎయిర్‌ పిస్టల్‌లో 8 బంగారు పతకాలు కైవసం (ETV Bharat)

ఎన్టీఆర్ జిల్లా వీరులపాడుకు చెందిన వెంకట్ రంజిత్ పాటిబండ్ల, లోహియా రామ్ పాటిబండ్ల కుమారుడైన ఉమా కార్తీక్ నాలుగు వ్యక్తిగత విభాగాలు, నాలుగు టీమ్ ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించాడు. ఇలా మొత్తం 8 స్వర్ణ పతకాలతో, మాస్టర్ ఉమా కార్తీక్ ఛాంపియన్‌షిప్‌లో అత్యంత విజయవంతమైన షూటర్లలో ఒకరిగా నిలిచారు. ప్రతిభకు వయసు అడ్డంకి కాదని నిరూపించారు.

వ్యక్తిగత విభాగంలో సాధించిన స్వర్ణ పతకాలు :

  • సీనియర్ పురుషులు – స్వర్ణం
  • జూనియర్ పురుషులు – స్వర్ణం
  • యువ పురుషులు – స్వర్ణం
  • సబ్-యూత్ పురుషులు – స్వర్ణం

టీమ్ ఈవెంట్లలో సాధించిన స్వర్ణ పతకాలు :

  • సీనియర్ టీమ్ – స్వర్ణం
  • జూనియర్ టీమ్ – స్వర్ణం
  • యూత్ టీమ్ – స్వర్ణం
  • సబ్-యూత్ టీమ్ – స్వర్ణం

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కోచ్ : ఉమాకార్తీక్ బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్-1లో ఉన్న హాక్-ఐ స్పోర్ట్స్ రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ అకాడమీలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కోచ్ శరణేంద్ర కె.వై. వద్ద శిక్షణ పొందుతున్నారు. ఈ అకాడమీ నిరంతరం జాతీయ, అంతర్జాతీయ స్థాయి షూటర్లను తయారు చేస్తూ వస్తోంది. తాజాగా ఉమా కార్తీక్ సాధించిన అసాధారణ విజయం, ప్రపంచ స్థాయి ప్రతిభతో దానికున్న నిబద్ధతను మరింతగా చాటిచెబుతోంది.

కర్ణాటక స్టేట్ షూటింగ్ ఛాంపియన్‌ షిప్​లో 8 బంగారు పతకాలు సాధించడంతో కోచ్ శరణేంద్ర కె.వై, ఉమాకార్తీక్​ను అభినందించాడు. అలాగే ఉమా కార్తీక్ తల్లిదండ్రులు క్రీడలకు అందిస్తున్న మద్దతును ప్రశంసించారు. నిరంతర అంకితభావం, శాస్త్రీయ శిక్షణతో రాబోయే రోజుల్లో ఆసియా క్రీడలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, ఒలింపిక్ క్రీడలతో సహా పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే సత్తా ఉమాకార్తీక్​కు ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఉమా కార్తీక్ సాధించిన గొప్ప విజయం అతని కుటుంబానికి, అకాడమీకి, కర్ణాటక షూటింగ్ క్రీడా సమాజానికి అపారమైన గర్వాన్ని తెచ్చిపెట్టింది. అంతేగాక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులకు ఈ క్రీడలో రాణించడానికి స్ఫూర్తినిస్తుంది.

అవమానాలే గెలుపు సోపానాలు - సులభంగా ఇంగ్లిష్‌ నేర్పిస్తున్న అనిత

కొవిడ్​లో సరదాగా పీతల పెంపకం- ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్న కేరళ యువకుడు