ఇక నుంచి వారానికి రెండుసార్లు ప్రైవేటు బస్సుల తనిఖీలు
రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు - తనిఖీలను ముమ్మరం చేసిన రవాణాశాఖ - ప్రమాదాల నివారణకు రవాణాశాఖ కొత్త కార్యాచరణ

Published : November 14, 2025 at 10:51 AM IST
Telangana Transport Department Road Safety Initiatives : ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి కారణం వాహనదారుల మితిమీరిన వేగంతో పాటు గడువు తీరిన వాహనాలను ఉపయోగించడమే. ఇలాంటి వాటితో పాపం అభాగ్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. గత నెలలో జరిగిన కర్నూలు బస్సు ప్రమాదంతో పాటు రంగారెడ్డి జిల్లాలో టిప్పర్ ఢీకొట్టి ఆర్టీసీ బస్సు ప్రమాదం అందరినీ కలచి వేసింది. ఇలాంటి ప్రమాదాలు తగ్గించడం, రహదారి భద్రత పెంచడం వంటివి లక్ష్యంగా చేసుకొని రవాణాశాఖ కొత్తగా కార్యాచరణను రూపొందించింది.
రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో 1,050 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు రవాణాశాఖ తెలిపింది. అలాగే 750 వాహనాలను సీజ్ చేసినట్లు స్పష్టం చేసింది. హైదరాబాద్ - బెంగళూరు ప్రైవేటు బస్సు కర్నూలు జిల్లాలో దగ్ధమవడం, చేవెళ్లలో ఆర్టీసీ బస్సును డిప్పర్ ఢీకొట్టిన ఘటనల నేపథ్యంలో అంతర్రాష్ట్ర ప్రైవేటు వాహనాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రతిరోజూ ప్రైవేటు బస్సులను రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వాటిలో సేఫ్టీ కిట్స్ ఉన్నాయా? లేదా? బస్సు సర్వీసింగ్లోనే ఉందా వంటి విషయాలను గుర్తిస్తున్నారు.
ఓవర్‌లోడ్‌తో వెళ్లినా, ఎక్కువ చలాన్లు ఉన్న గూడ్సు వాహనాలు, కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులను సీజ్ చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 13 అంశాలతో ఎన్ఫోర్స్మెంట్ కార్యాచరణ ప్రణాళికను కమిషనర్ ఇలంబర్తి హైదరాబాద్ జేటీసీకి, అన్ని జిల్లాల డీటీసీలకు పంపించారు. అక్రమ రవాణా, ఓవర్లోడింగ్, ఫిట్నెస్ గడువు ముగిసినా తిరిగే వాహనాలను, అనుమతి లేకుండా సీట్లు మార్చిన బస్సులను స్వాధీనం చేసుకోవాలని రవాణాశాఖ తాజాగా నిర్ణయించింది.
వారంలో ఒకసారి ఆకస్మిక తనిఖీలు : అంతర్రాష్ట్ర ప్రైవేటు బస్సులను వారంలో కనీసం రెండుసార్లు తనిఖీ చేయాలని హైదరాబాద్ జేటీసీతో పాటు రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల డీటీసీలను ఆదేశించింది. వారం రోజుల తనిఖీల నివేదికల్ని ప్రతి సోమవారం జేటీసీకి పంపాలని స్పష్టంగా చెప్పింది. అలాగే వారంలో ఒకసారి ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని రవాణాశాఖ నిర్ణయం తీసుకుంది.
చేయాల్సిన తనిఖీలు, తీసుకోవాల్సిన చర్యలు :
- ప్రతి ఉమ్మడి జిల్లా పరిధిలో కనీసం రెండు ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటు చేయాలి.
- ప్రతి బృందంలో ఒక మోటారు వాహన ఇన్స్పెక్టర్(ఎంవీఐ), ఇద్దరు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్లు(ఏఎంవీఐలు) ఉండాలి.
- అలాగే పబ్లిక్ హాలిడేలు సహా రోజూ రహదారులపై వాహనాలను పర్యవేక్షించాలి.
- ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా నడుస్తున్న వాహనాల్లో హెవీ, మీడియం, ప్రయాణికుల, విద్యాసంస్థల బస్సులను తనిఖీ చేయాలి.
- గూడ్సు వాహనాలు పరిమితికి మించిన బరువుతో వెళ్లకుండా నిరోధించాలి.
- కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సుల్లో బ్యాటరీలు, అగ్నిప్రమాదాలకు కారణమయ్యే వస్తువులు తీసుకెళ్లకుండా నిషేధించాలి.
- వాహనంలో అనుమతి లేని మార్పులు, ఓపెన్ బాడీ వాహనాలను టిప్పర్లుగా మార్చితే చర్యలు తీసుకోవాలి.
- నేషనల్, స్టేట్ హైవేల్లో రాంగ్రూట్లో వాహనాలు నడపకుండా నివారించాలి.
- ఆటోల్లో డ్రైవర్ పక్కన లేదా వెనుక లగేజీ బాక్స్‌లో ప్రయాణికులు ఉండకుండా చూసుకోవాలి.
- బయలుదేరే ప్రాంతాల్లోనే ఓవర్ లోడింగ్‌ను అరికట్టేందుకు మైనింగ్ శాఖతో సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలి.
- సరైన సర్టిఫికెట్లు లేకుండా చట్టవిరుద్ధంగా నడుస్తున్న వాహనాలపైనా కేసులు నమోదు చేయాలి.
దేశాన్నే కుదిపేసిన 'పాలెం బస్సు ప్రమాదానికి' 12 ఏళ్లు పూర్తి ' - గాఢ నిద్రలోనే 45 మంది సజీవ దహనం
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు అగ్నిప్రమాదం - 19 మంది సజీవదహనం

