తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల - జనవరి 3 నుంచి పరీక్షలు!
తెలంగాణలో టెట్ 2026 షెడ్యూల్ విడుదల - శనివారం నుంచి ఈ నెల 29 వరకు దరఖాస్తుల స్వీకరణ - 2026 జనవరి 3 నుంచి 31 వరకు టెట్ పరీక్షలు

Published : November 13, 2025 at 6:19 PM IST
|Updated : November 14, 2025 at 8:45 AM IST
Telangana Tet 2026 Schedule Release : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET-2025) రెండో విడత నోటిఫికేషన్‌ను విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ పరీక్షలను జనవరి 3 నుంచి 31వ తేదీ మధ్య నిర్వహించనున్నారు. మొత్తం 150 మార్కులకు పరీక్ష అనేది ఉంటుంది. సమాచార పత్రాన్ని ఈ నెల 15వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులను www.scooledu.telangana.gov.in వెబ్సైట్ ద్వారా సమర్పించాలి. ఈ ప్రక్రియ మొత్తం ఇలానే సాగుతోందని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు, టెట్ ఛైర్మన్ నవీన్ నికోలస్ తెలిపారు.
సుప్రీంకోర్టు తీర్పు : ప్రతి సంవత్సరం రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 2025లో మొదటి విడత పరీక్షను జూన్‌లో నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వారు సైతం ఈసారి టెట్‌కు పోటీ పడనున్నారు. టీచర్లుగా పని చేస్తున్న వారు ఉద్యోగాల్లో కొనసాగాలంటే వచ్చే రెండేళ్లలో టెట్ పాస్ కావడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు సెప్టెంబరు 1వ తేదీన తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కొన్ని ఉపాధ్యాయ సంఘాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం సైతం సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం టీచర్లు కూడా పరీక్ష రాసుకునేలా జీఓలో సవరణ చేయాలి. దానికితోడు గతంలో బీఈడీ విద్యార్హతతో ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీలుగా ఎంపికైన వారు ఉన్నారు. ప్రస్తుతం ఎస్జీటీలకు డీఈడీ విద్యార్హత అనేది తప్పనిసరి. ఈ క్రమంలో బీఈడీతో ఎస్జీటీలుగా ఎంపికైన వారు పేపర్-1 రాయాలా? పేపర్-2 రాయాలా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.
దీనిపై చర్చించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడుల్లోని ఇన్ సర్వీస్ టీచర్లతోపాటు ప్రైవేటు పాఠశాలల్లోని ఉపాధ్యాయులు సైతం టెట్ రాయవచ్చని స్పష్టతను ఇచ్చింది. అలాగే బీఈడీతో ఎస్జీటీలుగా పని చేస్తున్న వారు పేపర్-1 రాయవచ్చని తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి శ్రీదేవసేన గురువారం సవరణ జీఓను జారీ చేశారు. ఈ క్రమంలోనే నోటిఫికేషన్ అనేది జారీ అయింది.
ఉపాధ్యాయ నియామకాలకు టెట్ తప్పనిసరి : విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి టెట్ తప్పనిసరి చేస్తూ 2010 ఆగస్టు 23న ఎన్సీటీఈ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే సర్వీసులో ఉన్నవారికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం టెట్ మినహాయింపును ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో ఒకసారి, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2017లో మరోసారి, 2024లో ఇంకోసారి సర్కార్ డీఎస్సీని నిర్వహించారు.
ఉపాధ్యాయులకు అగ్ని'పరీక్ష' - టీచర్లను కలవరపెడుతున్న సుప్రీం తీర్పు

