రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీలు - మీ ప్రాంతంలో డీసీపీ ఎవరో తెలుసా?
రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు - జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా కమిషనరేట్లలోనూ బదిలీలు - దాదాపు 20 మంది స్థానాలు మారుస్తూ ఉతర్వులు జారీ

Published : January 8, 2026 at 8:58 AM IST
IPS Officers Transfers In Telangana : రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట కమిషనరేట్ మినహా మిగతా బదిలీలన్నీ రాజధాని పరిధిలోని కమిషనరేట్లకు చెందినవే. జీహెచ్ఎంసీ పునర్ వ్యవస్థీకరణకు అనుగుణంగా కమిషనరేట్లలోనూ మార్పులు చేసిన సర్కార్, అందుకనుగుణంగానే బదిలీలు చేసింది. ఫ్యూచర్‌సిటీ పేరుతో కొత్తగా కమిషనరేట్ ఏర్పాటు చేయగా, రాచకొండ కమిషనరేట్‌ను మల్కాజిగిరిగా మార్చారు. సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్లను పునర్ వ్యవస్థీకరించారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌కు కొత్త ప్రాంతాలను కలిపారు. 4 కమిషనరేట్ల పరిధిలోని కొన్ని జోన్ల పేర్లు, సరిహద్దులు మార్చారు. కొన్ని జోన్ల పేర్లు యథాతథంగానే ఉన్నప్పటికీ, వాటి కమిషనరేట్లు మారాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధి పెరగడంతో పరిపాలనా సౌలభ్యం కోసం రెండు జోన్లుగా విభజించి, ఇద్దరు అధికారులను నియమించారు.
ఎవరెవరు ఎక్కడకు బదిలీ? : హైదరాబాద్ కమిషనరేట్‌లో శాంతిభద్రతల జాయింట్ కమిషనర్‌గా ఉన్న తఫ్సీర్ ఇక్బాల్ ఇదే కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్, చార్మినార్ జోన్లతో కూడిన సౌత్ రేంజ్‌కు బదిలీ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్, సీసీఎస్ డీసీపీగా పని చేస్తున్న ఎన్.శ్వేత ఇదే కమిషనరేట్ పరిధిలోని జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లతో కూడిన నార్త్ జోన్‌కు బదిలీ అయ్యారు. సిద్దిపేట కమిషనర్ విజయ్‌కుమార్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి సైబరాబాద్ కమిషనరేట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన కుత్బుల్లాపూర్ జోన్‌కు బదిలీ అయ్యారు.
హైదరాబాద్ కార్ హెడ్ క్వార్టర్స్‌లో : పాత రాచకొండ, ప్రస్తుత మల్కాజిగిరి పరిధిలోని మహేశ్వరం డీసీపీ కె.నారాయణ రెడ్డి ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ పరిధిలోని మహేశ్వరం జోన్ డీసీపీగా బదిలీ అయ్యారు. హైదరాబాద్ కార్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ రక్షిత మూర్తి సికింద్రాబాద్‌కు, బాలానగర్ డీసీపీగా ఉన్న కె.సురేశ్ కుమార్ మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ డీసీపీగా బదిలీ అయ్యారు. హైదరాబాద్ దక్షిణ మండలం డీసీపీగా ఉన్న కిరణ్ ప్రభాకర్ చార్మినార్ జోన్ డీసీపీగా, పాత రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ జోన్ డీసీపీ అనురాధ కొత్తగా ఏర్పాటు చేసిన మల్కాజిగిరి కమిషనరేట్, ఎల్బీనగర్ డీసీపీగా బదిలీ అయ్యారు.
సిద్దిపేట డీసీపీగా : సైబరాబాద్ కమిషనరేట్‌లోని రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్ ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్, చేవెళ్ల జోన్ డీసీపీగా బదిలీ అయ్యారు. మాదాపూర్ డీసీపీ రితిరాజ్‌ను కొత్తగా ఏర్పాటు చేసిన కూకట్‌పల్లి జోన్‌కు, హైదరాబాద్, పశ్చిమ మండలం డీసీపీ సీహెచ్ శ్రీనివాస్‌ను సైబరాబాద్ కమిషనరేట్‌లోని శేరిలింగంపల్లి డీసీపీగా బదిలీ చేశారు. హైదరాబాద్, ఉత్తర మండలం డీసీపీ రశ్మీ పెరుమాల్ సిద్దిపేట కమిషనర్‌గా బదిలీ అయ్యారు. పూర్వపు రాచకొండ కమిషనరేట్, మల్కాజిగిరి జోన్ డీసీపీ సీహెచ్.శ్రీధర్ మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి జోన్ డీసీపీగా, హైదరాబాద్ మధ్య మండలం డీసీపీ శిల్పవల్లి కొత్తగా ఏర్పాటు చేసిన ఖైరతాబాద్ జోన్ డీసీపీగా బదిలీ అయ్యారు.
ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్‌కు ఆమె : ట్రాన్స్‌కోలో ఎస్పీగా ఉన్న శ్రీనివాస్‌ను రాజేంద్రనగర్ జోన్ డీసీపీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ కమిషనరేట్ సౌత్ వెస్ట్ డీసీపీ జి.చంద్రమోహన్ కొత్తగా ఏర్పాటు చేసిన గోల్కొండ డీసీపీగా, పూర్వపు రాచకొండ కమిషనరేట్, ఎస్వోటీ డీసీపీ రమణారెడ్డి జుబ్లీహిల్స్ డీసీపీగా బదిలీ అయ్యారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్ జోన్‌ను హైదరాబాద్‌లో విలీనం చేయగా, అక్కడ ఉన్న డీసీపీ రాజేశ్‌ను అదే జోన్‌లో కొనసాగించారు. నిఘా విభాగంలో ఎస్పీగా ఉన్న సీహెచ్.శిరీషను ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్, షాద్‌నగర్ జోన్ డీసీపీగా బదిలీ చేశారు.
రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు - రాచకొండ క్రైమ్స్ డీసీపీగా గుణశేఖర్
4 ఏళ్లలో 8 సార్లు బదిలీ- అవినీతి వెలికితీయడమే కారణమా? IPS యోగేశ్ గుప్తా వివాదం ఏంటి?

