ఇక బస్సు షెడ్యూళ్లను నిర్ణయించేది ప్రయాణికుల రాకపోకలే - 'స్మార్ట్ షెడ్యూలింగ్'కు ఆర్టీసీ శ్రీకారం
బస్సుల రాకపోకల్లో గణనీయ మార్పులు చేయనున్న ఆర్టీసీ - పాత విధానాలకు, సంప్రదాయ పద్ధతులకు చెక్ - రూట్లపై సమగ్ర అధ్యయనం చేసి స్మార్ట్ షెడ్యూలింగ్ యోచనలో ఆర్టీసీ

Published : June 20, 2026 at 6:31 PM IST
TGSRTC Initiates Smart Scheduling : రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టీసీ పలు కీలక సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. ఇకపై బస్సుల రాకపోకల్లో గణనీయ మార్పు చేర్పులు జరగబోతున్నాయి. ప్రయాణికుల రాకపోకలే ఇకపై బస్సు షెడ్యూళ్లను నిర్ణయించనున్నాయి. సంప్రదాయ నిర్వాహణ విధానాలు, పాత ట్రాఫిక్ అంచనాలకు చెక్ పెడుతూ తెలంగాణ ఆర్టీసీ స్మార్ట్ షెడ్యూలింగ్ పేరుతో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమలు తర్వాత ప్రయాణ ధోరణులు మారాయి. వైద్యం కోసం హైదరాబాద్ నగరానికి, జిల్లా కేంద్రాలకు ఆధ్యాత్మికత కోసం యాదగిరిగుట్ట, వేములవాడ తదితర ఆలయాలకు ప్రయాణాలు భారీగా పెరిగాయి. నగరాలు, పట్టణాల విస్తరణ, పారిశ్రామిక అభివృద్ధి, విద్యా కేంద్రాల పెరుగుదల తదితర అంశాలూ ప్రయాణాల్లో గణనీయమైన మార్పులు తెచ్చాయి. ఈ విషయాన్ని గుర్తించిన సంస్థ ప్రతి రూట్‌పై శాస్త్రీయ ట్రాఫిక్ అధ్యయనాలను నిర్వహించి అవసరాలకు అనుగుణంగా బస్సు షెడ్యూళ్లను పునర్‌వ్యవస్థీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా అన్ని జోన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు(ఈడీలు), రీజియన్ల ఆర్‌ఎంలకు కీలక సర్క్యులర్‌ను జారీ చేసింది.
డిమాండ్ ఆధారంగా షెడ్యూళ్ల పునర్వ్యవస్థీకరణ : ప్రయాణికుల రాకపోకలకు సంబంధించి ప్రతి రూట్‌పై శాస్త్రీయ ట్రాఫిక్ అధ్యయనం చేపట్టనున్నారు. ఆయా రూట్లలో ప్రయాణికుల డిమాండ్ ఆధారంగా బస్సు షెడ్యూళ్ల పునర్‌వ్యవస్థీకరిస్తారు. కొన్ని రూట్లలో బస్సులు కిక్కిరిసి ప్రయాణిస్తుంటే మరి కొన్నిచోట్ల రద్దీ తక్కువగా ఉంటున్నట్లు ఆర్టీసీ సంస్థ గుర్తించింది. ఉదయం, సాయంత్రం రద్దీగా ఉన్న మార్గాల్లో మధ్యాహ్నం ఖాళీగా వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘రైట్ బస్ రైట్ రూట్ రైట్ టైమ్’ అనే లక్ష్యంతో కార్యక్రమాన్ని చేపట్టాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ఇకపై ప్రతి రూట్‌లో ట్రాఫిక్ ప్రారంభ సమయం, ముగింపు సమయం, రద్దీ గంటలు, ఖాళీ సమయాలు, రూట్ల వారీగా ప్రయాణికుల రాకపోకలు, ఎక్కే, దిగే ప్రాంతాల ట్రాఫిక్ సాంద్రత తదితర అంశాలపై డిపో మేనేజర్లు శాస్త్రీయ అధ్యయనాన్ని నిర్వహించనున్నారు.
నగరాల మధ్య మరిన్ని బస్సులు : సిబ్బంది కొరత కారణంగా పలు రూట్లలో సిబ్బంది ఓవర్‌టైం (ఓటీ) పనిచేస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్ జోన్లలో 2,126 ఓటీ షెడ్యూళ్లు ఉండగా అందులో 1,354 షెడ్యూళ్లు 2 గంటలకు మించి ఓటీతో నడుస్తున్నాయి. నిర్వహణ వ్యయాలు పెరగడం, డ్రైవర్, కండక్టర్లు అలసిపోవడం, అప్రమత్తత తగ్గడం, భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆర్టీసీ సంస్థ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు గంటలకు మించిన ఓవర్ టైం షెడ్యూళ్లను ప్రత్యేకంగా సమీక్షించి తగ్గించాలని నిర్ణయించింది.
హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-కరీంనగర్, హైదరాబాద్-ఖమ్మం, ఖమ్మం-భద్రాచలం వంటి రూట్లలో సింగిల్ షిఫ్ట్ విధానాన్ని ప్రోత్సహించాలని సూచించింది. దీనివల్ల ఈ నగరాల మధ్య మరిన్ని బస్సులు అందుబాటులోకి రానున్నాయి. అలాగే రూట్లలో ‘నైట్ అవుట్’ విధానం చేపట్టినట్లయితే నాన్-రెవెన్యూ కిలోమీటర్లను తగ్గించి, ఇంధన పొదుపు, సిబ్బంది అలసట తగ్గింపు, నిర్వహణ సామర్థ్యం పెంపు లాంటివి సాధ్యమవుతుందని అధికారులకు సూచించింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా నైట్‌హాల్ట్ బ స్సుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. జులై 31లోగా ఈ అధ్యయనాన్ని పూర్తిచేసి ఆగస్టు నెల కల్లా కొత్త విధానాన్ని అమలుచేసి నివేదికలు పంపాలని ఆర్టీసీ యాజమాన్యం సంబంధిత అధికారులకు సూచించింది.
ఆర్టీసీ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు - ప్రయాణికుల రక్షణ, భద్రతే ధ్యేయంగా సరికొత్త ప్రయోగం
ఉపాధికి బాటలు వేస్తున్న ఎలక్ట్రిక్ బస్సు - నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగావకాశాలు

