ఫలిస్తోన్న ప్రభుత్వ చర్యలు - తెలంగాణ విద్యా సంస్కరణలకు జాతీయ స్థాయిలో గుర్తింపు
తెలంగాణ విద్యారంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు - సత్ఫలితాలిచ్చిన ప్రభుత్వం చేపట్టిన చర్యలు - కేంద్రం విడుదల చేసిన ఫర్‌ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో తెలంగాణ పురోగతి

Published : July 9, 2026 at 8:41 AM IST
|Updated : July 9, 2026 at 10:24 AM IST
Telangana Rises in PGI Report : పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఉపాధ్యాయుల నియామకాలు, శిక్షణలు, డిజిటల్ విద్య, కృత్రిమ మేధస్సును పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టడం వంటి కార్యక్రమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఫర్‌ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్-2.0లో తెలంగాణ 28వ స్థానం నుంచి పది స్థానాలు అధిగమించి 18వ స్థానానికి చేరింది.
సత్ఫలితాలిచ్చిన విద్యా సంస్కరణలు : నాణ్యమైన విద్యను ప్రతి విద్యార్థికి అందించాలన్న లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయని సర్కారు ప్రకటించింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఫర్‌ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్–2.0 నివేదికనే నిదర్శనమని తెలిపింది. 2024-25తో పోలిస్తే ఈ విద్యా సంవత్సరంలో తెలంగాణ గణనీయంగా మెరుగుపడిందని పేర్కొంది. వెయ్యి మార్కులకు గానూ 2024–25లో 552.5 స్కోరు సాధించిన రాష్ట్రం, ఈ ఏడాది 599.7 మార్కులు సాధించి 28వ స్థానం నుంచి పది స్థానాలు అధిగమించి 18వ స్థానానికి చేరుకుంది. తెలుగులో అభ్యసన సామర్థ్యం 9 నుంచి 35 శాతానికి, ఆంగ్లంలో 4 నుంచి 29 శాతానికి, ఉర్దూలో 19 నుంచి 40 శాతానికి, గణితంలో 18 నుంచి 30 శాతానికి పెరిగిందని ప్రకటించింది.
ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణం : విద్యా ప్రమాణాలు పెంచేందుకు సర్కారు తీసుకున్న చర్యలే ఈ ఫలితాలకు ప్రధాన కారణమని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10 వేలకు పైగా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ, అవసరాలకు తగినట్టు ఉపాధ్యాయుల బదిలీలు చేయడం వల్ల జిల్లా స్థాయిలోనూ ఉత్తమ ఫలితాలు వచ్చాయని అభిప్రాయపడింది. ఇప్పటికే 283 కేజీబీవీలను ఇంటర్మీడియట్ స్థాయికి అప్‌గ్రేడ్ చేసిన సర్కారు, ఈ విద్యా సంవత్సరం నుంచి మరో 120 కేజీబీవీలను ఉన్నతీకరణకు కృషి చేసినట్లు వివరించింది. 93 కేజీబీవీలను యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దామని తెలిపింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేస్తూ 194 మోడల్ స్కూళ్లు, 495 కేజీబీవీలు, 37 రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ఉచిత డిజిటల్ కోచింగ్ అందిస్తున్నట్టు వివరించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఏఐ, డిజిటల్ లిటరసీ, కోడింగ్, డిజైన్ థింకింగ్ అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చినట్టు ప్రకటించింది.
మెరుగైన ఫలితాలకు దోహదం చేసిన అంశాలు : ఆధునిక బోధన విధానాలను అందిపుచ్చుకోవడం, డిజిటల్ సాంకేతికత, విద్యార్థుల అభ్యాసన సామర్థ్యంపై ప్రత్యేక దృష్టి ఈ సమగ్ర చర్యలతో విద్యా రంగం శరవేగంగా వృద్ధి సాధిస్తోందని సర్కారు పేర్కొంది. భవిష్యత్‌లో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించింది.
ఉన్నత విద్యావంతుల జీఈఆర్‌లో రాష్ట్రానికి నాలుగో స్థానం : తెలంగాణ రాష్ట్రంలో 18-23 సంవత్సరాల విద్యార్థుల్లోని ప్రతి 100 మందిలో 46.60 శాతం మంది డిగ్రీ, ఆపై విద్యను అభ్యసిస్తున్నట్లు ‘అఖిల భారత ఉన్నత విద్య సర్వే 2023-24’లో వెల్లడైంది. దీన్ని స్థూల నమోదు నిష్పత్తి(జీఈఆర్)గా వ్యవహరిస్తారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. కేంద్ర విద్యాశాఖ బుధవారం విడుదల చేసిన ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం దేశంలో డిగ్రీ నుంచి పీహెచ్‌డీ వరకు చదువుతున్న అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య ఎక్కువున్న రాష్ట్రంగా తెలంగాణ 3వ స్థానంలో నిలిచింది. ఈ అంశంలో బిహార్, బంగాల్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. అత్యధిక కళాశాలలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 2,160 కాలేజీలతో తొమ్మిదో స్థానంలో ఉంది.
2,769 ప్రభుత్వ బడుల్లో ఈసారి ప్రీ ప్రైమరీ - నాలుగేళ్లు నిండిన చిన్నారులు యూకేజీలో

