నేరం ఎలా జరిగిందో చెబితే నేరస్థుడు దొరికేసినట్టే - తెలంగాణలో ప్రయోగాత్మకంగా ఏఐ పోలీసింగ్!
తెలంగాణలో ప్రయోగాత్మకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోలీసింగ్! - ఎక్కడెక్కడ హత్యలు, దొంగతనాలు జరిగాయనే దానిపై నిమిషాల్లోనే ఏఐ విశ్లేషణ - పోలీసుల విధుల్లో కృత్రిమ మేధ హంగుల కోసం డీజీపీ ఆదేశాలు

Published : August 29, 2026 at 10:13 AM IST
AI Policing in Telangana : ఒకవేళ మీ వాహనం చోరీ అయిందనుకోండి. దానిని పోలీస్ కెమెరా పట్టిస్తే ఎలా ఉంటుంది? ఉదాహరణకు ఓ పోలీస్‌స్టేషన్ పరిధిలో వరుసగా దొంగతనాలు జరిగాయి. తర్వాత రోజు నుంచి పెట్రోలింగ్ టీమ్స్ ఆ ప్రాంతంలో నిఘా పెంచాయి. నల్గొండ పట్టణంలో హత్య జరిగింది. అదే తరహాలో అంతకు ముందు ఎక్కడెక్కడ హత్యలు జరిగాయో ఏఐ ద్వారా కంప్యూటర్ నిమిషాల్లోనే విశ్లేషించి కేసు పరిష్కారానికి చక్కగా దోహదపడుతుంది. పైన పేర్కొన్న అంశాల్లో ఎక్కడా అసలు మానవ ప్రమేయమే లేదు.
ఆయా పరిష్కారాలు చూపింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే(ఏఐ). ఇదే కాదు శాంతి భద్రతలను మరింత పకడ్బందీగా అమలు చేయడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు తెలంగాణ పోలీస్ శాఖ పోలీసుల దైనందిన విధులకు కృత్రిమ మేధ హంగులు అద్దేందుకు సిద్ధమవుతోంది.
ఆ కెమెరాలకు మెదడు ఉంటుంది : ఉదాహరణకు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ద్విచక్ర వాహనం చోరీకి గురైందనుకుందాం. ప్రస్తుతం ఆ వాహనం ఎక్కడుందో గుర్తించాలంటే కొన్ని గంటల పాటు మానవ వనరులతో వందల సీసీ కెమెరాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న సీసీ కెమెరాలకు ఏఐ టెక్నాలజీని జోడిస్తే ఆయా కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు డేటాబేస్‌లో నమోదవుతాయి. చోరీ అయిన వాహనం రిజిస్ట్రేషన్ నంబరు ఎంటర్ చేయగానే సదరు వాహనం ఏయే కెమెరాల్లో నమోదయింది. ఆ వాహనం ఎటువైపు వెళ్లిందనేది క్షణాల్లోనే కంప్యూటర్ విశ్లేషణ చేసి సమాధానం ఇస్తుంది. రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహనాల విషయంలోనూ ఇదే టెక్నాలజీ ఉపయోగపడుతుంది.
గస్తీ ఎక్కడో చెబుతుంది : నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు రాత్రి వేళల్లో ఎక్కువగా పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు. ఏదేని పోలీస్‌స్టేషన్ పరిధిలో సెక్టార్ల వారీగా కొన్ని బీట్ పాయింట్లు నిర్ణయించుకుని ఆయా ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. పోలీసులు దశాబ్దాలుగా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇకపై ఎక్కడక్కడ గస్తీ నిర్వహించాలనే విషయాలను ఏఐ చెబుతుంది. ఏదైనా పోలీస్ స్టేషన్, జిల్లా, కమిషనరేట్ పరిధిలో నమోదయిన కేసుల ఆధారంగా ఏఐ హీట్ మ్యాప్ తయారు చేసి ఇస్తుంది. అంతకు ముందు ఏయే ప్రాంతాల్లో నేరాలు జరిగాయో డేటాను చూసి విశ్లేషించి ఏఏ ప్రాంతాల్లో గస్తీ పెంచాలో సూచనలు చేస్తుంది. మర్నాడు ఆయా ప్రాంతాలకు సిబ్బంది వెళ్లారో లేదో కూడా పరిశీలించి రిపోర్టు సమర్పిస్తుంది.
నేరం ఎలా జరిగిందో చెబితే నేరస్థుడు ఎవరో వెల్లడిస్తుంది : హత్య, బెదిరింపులు, దోపిడీ, దొంగతనం ఇలా నేరం ఏదైనా, నిందితుడిని ఎంత త్వరగా పట్టుకున్నారనే దానిపైనే పోలీసుల కెపాసిటీ ఆధారపడి ఉంటుంది. సాధారణంగా పోలీసులు నేరాల మధ్య ఉండే సారూప్యత ఆధారంగా ఆ నేరాలు ఎవరు చేశారనే దానిపై ఒక అంచనాకు వస్తుంటారు. ఇదంతా దర్యాప్తు అధికారులు వ్యక్తిగతంగా చాలా సమయం పెట్టి పరిశీలించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు ఖమ్మంలో జరిగిన తరహాలోనే హైదరాబాద్‌లోనూ నేరం జరిగితే ఆయా యూనిట్ల పోలీసులు మాట్లాడుకుంటే తప్ప ఆ కేసు వివరాలు, పరిష్కారం తెలిసే అవకాశం ఉండదు. ఏఐ వినియోగం తర్వాత ఏదైనా నేరం జరిగిన తీరును ఎఫ్‌ఐఆర్‌లో ఎంటర్ చేయగానే దాన్ని పోలిన నేరాలు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఈ తరహాలో జరిగాయో క్షణాల్లో కంప్యూటర్ విశ్లేషణ చేస్తుంది. తద్వారా నేరస్థులను పట్టుకోవడం చాలా సులభం అవుతుంది.
కియోస్క్‌లో ప్రింట్ తీసుకోవచ్చు : దైనందిన అవసరాలలో భాగంగా పోలీసుల నుంచి రకరకాల సర్టిఫికెట్లు పొందాల్సి వస్తుంది. ఉదాహరణకు ఎక్కడైనా ఉద్యోగం లేదా ఇంటర్న్‌షిప్ పొందాలంటే పోలీసుల నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ అవసరమవుతుంది. అలానే వాహనం విక్రయించేప్పుడు, ఆస్తి లేదా ఇతర విలువైన పత్రాలు పోయినప్పుడు సంబంధిత సర్టిఫికేట్ పొందాలన్నా పోలీసుల వద్దకు వెళ్లాల్సిందే. ఇకపై ఆ అవసరం లేకుండా ప్రతి పోలీస్‌స్టేషన్‌లో కియోస్క్‌లు ఏర్పాటు కాబోతున్నాయి.
అప్లై చేసుకున్న తర్వాత ఎలాంటి అభ్యంతరం లేదనుకున్నప్పుడు దరఖాస్తుదారు ఫోన్‌కు సందేశం వస్తుంది. దీని ఆధారంగా కియోస్క్ నుంచే సంబంధిత సర్టిఫికేట్‌ను ప్రింట్ తీసుకోవచ్చు. ఫిర్యాదుల స్వీకరణ మొదలు తెలంగాణ మొత్తంలో నమోదయిన మిస్సింగ్ కేసుల గుట్టు విప్పడం, గుర్తుతెలియని డెడ్ బాడీల ఆచూకీ తెలుసుకోవడం వరకు అన్నింటిలో ఏఐ ఓ భాగం కాబోతోంది. దీనివల్ల పోలీసుల సేవల్లో వేగం పెరుగుతుంది. ఇప్పటికే ఏఐ వినియోగంపై సుదీర్ఘ రీసెర్చ్ చేసిన అధికారులు త్వరలోనే ప్రయోగాత్మకంగా కొన్ని పోలీస్‌స్టేషన్లలో దీనిని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
పెరుగుతున్న డ్రగ్స్ కేసులే అతి పెద్ద సవాల్ : డీజీపీ సీవీ ఆనంద్

