ఎమ్మెల్సీ కవిత రాజీనామాకు మండలి ఛైర్మన్ ఆమోదం
కవిత రాజీనామాకు మండలి ఛైర్మన్ ఆమోదం - నిజామాబాద్ స్థానికసంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత - ఇటీవల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత

Published : January 7, 2026 at 7:21 AM IST
MLC Kavitha Resignation Accepted : శాసనమండలి సభ్యత్వానికి కల్వకుంట్ల కవిత చేసిన రాజీనామా ఆమోదం పొందింది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత సెప్టెంబర్ మూడో తేదీన పార్టీకి, పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ సభ్యత్వానికి కవిత రాజీనామా చేశారు. అదేరోజు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి రాజీనామా లేఖ పంపారు. తన రాజీనామా ఆమోదించాలని పలు సందర్భాల్లో మీడియా ద్వారా కవిత కోరారు. నాలుగు రోజుల కిందట మండలి ఛైర్మన్‌ను కలిసిన కవిత రాజీనామా ఆమోదించాలని, అంతకు ముందు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. సోమవారం మండలిలో మాట్లాడిన కవిత రాజీనామాకు కారణాలు చెబుతూ ఆమోదించాలని సభాముఖంగా కోరారు.
కవిత రాజీనామాను ఆమోదించిన మండలి ఛైర్మన్ : భావోద్వేగాల మధ్య రాజీనామా నిర్ణయం తగదని మరోమారు ఆలోచించుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. అయితే రాజీనామా విషయంలో పునరాలోచన లేదన్న కవిత ఆమోదించాలని కోరారు. అందుకు అనుగుణంగా శాసనమండలి సభ్యత్వానికి కవిత చేసిన రాజీనామాను ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఇప్పటి వరకు కవిత ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. 2020లో నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత 2022లో మరోమారు అదేస్థానం నుంచి ఎన్నికయ్యారు. కవిత ఎమ్మెల్సీగా ఐదేళ్లకు పైగా బాధ్యతలు నిర్వర్తించారు.
సామాజిక తెలంగాణ సాధనకు కృషి : సామాజిక తెలంగాణ సాధనకు కార్యాచరణ చేపడతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని జాగృతి ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆమె అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గం, 23 అనుబంధ విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు, జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, ముఖ్య నేతలతో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. భవిష్యత్తు కార్యాచరణ ఖరారుకు సంబంధించి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు.
కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎల్.రూప్‌సింగ్ అధ్యక్షతన జర్నలిస్టులు సయ్యద్ ఇస్మాయిల్, లోక రవిచంద్ర, జాగృతి సీనియర్ నాయకురాలు మంచాల వరలక్ష్మిలను సభ్యులుగా ఆమె నియమించారు. రాష్ట్ర బడ్జెట్, ఉపాధి కల్పన, ఇరిగేషన్, వైద్యం, న్యాయం, మహిళా సాధికారత, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, కార్మిక సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనారిటీ, ఎక్స్ సర్వీస్‌మెన్ సంక్షేమం తదితర రంగాల్లో విస్తృత అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీలు నియమించారు. ఆయా కమిటీలు ఈనెల 17వ తేదీన స్టీరింగ్ కమిటీకి నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు.
ఇటీవల భావోద్వేగంతో ప్రసంగించిన కవిత : శాసన మండలిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇటీవల భావోద్వేగంతో ప్రసంగించారు. మాట్లాడుతున్న క్రమంలో ఆమె కంటతడి పెట్టుకున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా మనస్ఫూర్తిగా పని చేసినట్లుగా ఆమె ఇటీవల తెలిపారు. గతేడాది సెప్టెంబర్ 3వ తేదీన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామాను ఛైర్మన్ ఫార్మాట్‌లోనే పంపినట్లుగా చెప్పారు.
ఆవేశంతో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మండలి ఛైర్మన్ సూచించారని పేర్కొన్నారు. పలు సందర్భాల్లో కూడా రాజీనామా ఆమోదించాలని కోరానని ఆమె ఇటీవల మండలిలో తెలిపారు. అయినా తన రాజీనామాకు సంబంధించి 4 నెలల సమయంలోనూ నిర్ణయం తీసుకోలేదని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన బీఆర్‌ఎస్, నిజామాబాద్ ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు ఆమె తెలిపారు.
నాపై అనేక కట్టుబాట్లు : బీఆర్‌ఎస్ పార్టీ నుంచి తనకు అనేక కట్టుబాట్లు ఎదురయ్యాయని కవిత ఇటీవల వెల్లడించారు. కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో తాను ఉద్యమంలోకి వచ్చానన్నారు. తెలంగాణ జాగృతి ద్వారా ఉద్యమంలో లోటుపాట్లను పూడ్చేందుకు కృషి చేశానన్న కవిత, యువకులను ఉద్యమంలోకి తీసుకువచ్చేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు గుర్తుచేశారు.
బీఆర్‌ఎస్ ఇచ్చిన పదవిలో ఉండలేను - రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి : కవిత
'అసెంబ్లీలో బీఆర్ఎస్ బాయ్‌కాట్ హరీశ్‌రావు నిర్ణయమా? బీఆర్ఎస్ పెద్దల నిర్ణయమా?'

