తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ! - ఏఐసీసీతో రేపు, ఎల్లుండి కీలక చర్చలు
దిల్లీలో జలశక్తి సమావేశానికి వెళుతున్న సీఎం రేవంత్ - 2న దేశ రాజధాని దిల్లీకి చేరుకోనున్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ , డిప్యూటీ సీఎం భట్టి - మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానంతో భేటీ?

Published : August 31, 2026 at 8:08 AM IST
CM Revanth Reddy on Cabinet Expansion : తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై మంగళ, బుధవారాల్లో దిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్‌తో కీలక చర్చలు జరిగే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు అంశంపై రేపు జలశక్తి శాఖ నిర్వహించనున్న మీటింగ్‌లో పాల్గొనేందుకు సోమవారం లేదా మంగళవారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డి హస్తినకు వెళ్తారని విశ్వసనీయ సమాచారం. ఒకటో తేదీన అక్కడే ఉండి 2వ తేదీన దిల్లీలో జరిగే వై.ఎస్. అవార్డు ప్రదానోత్సవంలోనూ సీఎం పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ హాజరుకానున్నారు.
ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం రాత్రివరకు దిల్లీ చేరుకుంటారని తెలుస్తోంది. ఆయన వచ్చిన తర్వాత మంగళ, బుధవారాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీలతో ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, భట్టి విక్రమార్క తెలంగాణ రాజకీయాలపై చర్చిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గ విస్తరణపై స్పష్టత కోసమే అగ్రనేతలతో రాష్ట్ర ముఖ్యనేతల భేటీ జరగబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మంత్రి పదవులు ఆశిస్తున్న పలువురు నేతలు కూడా తమకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కోరేందుకు 1, 2 తేదీల్లో దిల్లీకి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. వచ్చే నెల ఏడో తేదీన శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దానికి ముందు రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ లోగా మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదని సీనియర్ నేతలు కూడా మాట్లాడుకుంటున్నారు.
కేసీ రాగానే మారనున్న పరిణామాలు! : కేసీ వేణుగోపాల్ దిల్లీకి రాగానే తెలంగాణ నేతలతో జరిపే చర్చలతో పరిణామాలు మారతాయని నాయకులు అంచనా వేసుకుంటున్నారు. మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యవహార శైలిపై క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ(డీఏసీ) విచారణ జరిపి ముమ్మర చర్యలు తీసుకోవాలని ఇటీవల పీసీసీకి నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రిపోర్టును పీసీసీ మీనాక్షి నటరాజన్‌కు అందజేసింది. ఆమె దాన్ని ఏఐసీసీకి పంపించారు. ఈ నివేదిక ఇచ్చిన తర్వాత భట్టి విక్రమార్క బెంగళూరు వెళ్లి ఖర్గేను ప్రత్యేకంగా కలసి చర్చించి వచ్చారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై భట్టి ఖర్గేకు క్షుణ్ణంగా వివరించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కమిటీ సిఫార్సులపై కేసీ వేణుగోపాల్, ఖర్గేలు రాష్ట్ర నేతలతో మంగళ, బుధవారాల్లో చర్చించే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఒకవేళ కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించి ఏఐసీసీ నిర్ణయిస్తే ఆమె స్థానంలో బీసీ వర్గాలకే చెందిన వేరే నేతలకు చోటుకల్పించాల్సి ఉంటుందని, ఎవరిని తీసుకోవాలనే అంశంపైనా చర్చలు కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. పలువురు బీసీ సామాజిక వర్గాల నేతల పేర్లు పార్టీ పరిశీలనలో ఉన్నాయి.
అది నిజమే కానీ : కేబినెట్ విస్తరణ జరిగితే ఒకరికేనా లేక ఇద్దరు, ముగ్గురికి చోటు కల్పించడానికి అవకాశాలున్నాయా? అనే అంశంపైనా చర్చలు ఉంటాయని తెలుస్తోంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్‌లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాల్సి కారణంగా నగరానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని కొందరు నేతలు గట్టిగా కోరుతున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ ఉంటుందనేది వాస్తవం. కానీ, ఎప్పుడు ఉంటుందనే కచ్చితమైన తేదీ మాత్రం ఏఐసీసీ నిర్ణయం తర్వాతే తెలుస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు చెప్పారు.
సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం - కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై ప్రగతి నివేదిక
తెలంగాణ కోసం బలమైన వాదనలు వినిపించండి - 'ఆ తీర్పు అమలైతే కేఆర్ఎంబీ ఉండదు'

