ETV Bharat / state

'అసెంబ్లీలో బీఆర్​ఎస్​ బాయ్​కాట్​ హరీశ్​రావు నిర్ణయమా? బీఆర్​ఎస్​ పెద్దల నిర్ణయమా?'

హరీశ్​రావులపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్ - పాలమూరు-రంగారెడ్డి విషయంలో ప్రభుత్వం అడ్డగోలు అబద్ధాలు - సూర్యాపేటలో తెలంగాణ జాగృతి నేతలతో కవిత సమావేశం

Kavitha Fires on Harish Rao
Kavitha Fires on Harish Rao (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : January 4, 2026 at 7:33 PM IST

3 Min Read
Choose ETV Bharat

Kavitha Fires on Harish Rao : పాలమూరు-రంగారెడ్డి విషయంలో అసెంబ్లీలో ప్రభుత్వం అడ్డగోలు అబద్ధాలు చెప్పిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆల్మట్టి ఎత్తు పెంపు, అప్పర్​ భద్రకు జాతీయ హోదాను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేయాలని అన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కృష్ణానది నీళ్ల అంశంపై చర్చించాలన్నారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన తెలంగాణ జాగృతి నేతల సమావేశంలో కవిత మాట్లాడారు.

'అసెంబ్లీలో బీఆర్​ఎస్​ బాయ్​కాట్​ హరీశ్​రావు నిర్ణయమా? బీఆర్​ఎస్​ పెద్దల నిర్ణయమా?' (ETV)

పాలమూరు-రంగారెడ్డి, నారాయణ్​పేట్​-కొడంగల్​కు 77.5 టీఎంసీలు కేటాయిస్తే, 40 టీఎంసీలకే ఎందుకు అంగీకరించారని కవిత ప్రశ్నించారు. పాలమూరు ప్రజలకు రేవంత్​రెడ్డి చేస్తున్న అన్యాయాన్ని ప్రజలు క్షమించరని హెచ్చరించారు. హరీశ్​రావును తిడితే సభను వాయిదా వేసుకొని వెళ్లిపోవటం బీఆర్​ఎస్​ డ్రామా అని ధ్వజమెత్తారు. బీఆర్​ఎస్​ బాయ్​ కాట్​ హరీశ్​రావు నిర్ణయమా? బీఆర్ఎస్​ పెద్దల నిర్ణయమా అని గట్టిగా ప్రశ్నించారు. కేసీఆర్​, కేటీఆర్​ నిర్ణయమైతే చరిత్రలో క్షమించరాని తప్పు చేసినట్లేనని చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వదిలి బయట సభలు పెట్టి ప్రజలకు ఏమి వివరిస్తారని విమర్శించారు. తెలంగాణకు 3 శాతం నీళ్ల వాటా తగ్గించే ఒప్పందంపై హరీశ్​ రావు సంతకం చేశారా? లేదా అని అడిగారు.

కేసీఆర్​ను అవమానిస్తే నేను రియాక్ట్​ అయ్యా, మీరేందుకు కాలేదు : అలాగే జూరాల నుంచి శ్రీశైలంకు ఇన్​ టేక్​ పాయింట్​ను ఎందుకు మార్చారో సమాధానం చెప్పాలని కల్వకుంట్ల కవిత కోరారు. కేసీఆర్​ను టెర్రరిస్ట్​తో పోల్చితే నేనే రియాక్ట్​ అయ్యాను, బీఆర్​ఎస్​ నుంచి ఎవరూ ఎందుకు స్పందించలేదన్నారు. సూర్యాపేటలో జగదీశ్​రెడ్డి అనుచరులు ఆలయాలను, చెరువులను కూడా వదలలేదని ఆరోపించారు. అడ్డగోలుగా అవినీతి చేసిన వారిపై నేను మాట్లాడుతూనే ఉంటానని హెచ్చరించారు.

"వ్యక్తిగతంగా హరీశ్‌ రావును ఒక్క మాట అన్నందుకు అసెంబ్లీని బాయ్‌కాట్ చేస్తారా? ఆ అంశంపై వాకౌట్ చేస్తే తరువాత సభకు రావచ్చు కదా మిగతా బిల్లులపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం ఉండొద్దా? సభ నుంచి వాకౌట్ చేయాలనే నిర్ణయం హరీశ్‌ రావుదేనా? బీఆర్‌ఎస్‌ పార్టీలో హరీశ్‌ ఓ గుంపును తయారు చేస్తున్నారు. బాయ్‌కాట్ నిర్ణయం అధిష్ఠానానిదే అయితే అది మంచిది కాదు. బయట సభలు పెడుతూ చట్టసభల్లో మాట్లాడే అవకాశం వదులుకోవడం కరెక్ట్ కాదు. కృష్ణా పంపకాల్లో హక్కులు తగ్గించి హరీశ్‌ సంతకం ఎందుకు పెట్టారో చెప్పి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ చేయాల్సింది. హరీశ్‌ ధన దాహం కోసమే జూరాల నుంచి శ్రీశైలానికి మార్పు చేశారు. హరీశ్‌ నిర్ణయాలతో సాగు నీటి ప్రాజెక్టులకు తీవ్రం నష్టం జరిగింది." - కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు

ఆల్మట్టి ఎత్తు తగ్గించాలి : 'కేసీఆర్​ తప్పులు చేశారనే వాదన తప్ప కృష్ణానది నీటి వాటాపై చర్చ లేదు. ఆల్మట్టి ఎత్తు పెంచుకుంటే ఉత్తరం రాసి వదిలేశారు. కృష్ణాపై చిత్తశుద్ధి ఉంటే ఎందుకు సమగ్ర చర్చ జరపడం లేదు. తుంగభద్ర, కృష్ణా నీటిపై కర్ణాటకతో పేచీ ఉంటే రెండు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఎందుకు పరిష్కరించడం లేదు? గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సీఎం రేవంత్‌ ప్రయత్నిస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టు జాతీయ హోదాను తొలగించాలని, ఆల్మట్టి ఎత్తు తగ్గించాలని తీర్మానం చేయాలి.' అని కవిత వ్యాఖ్యానించారు. ఇప్పటికే కవిత బీఆర్​ఎస్​ మనుగడ కొనసాగాలంటే కేసీఆర్​ అసెంబ్లీకి రావాలని అన్నారని తెలిసిందే. నదీ జలాల అంశాన్ని పిల్లకాకుల మీద వదిలేయవద్దని చెప్పారు. బీఆర్​ఎస్​ బబుల్​ షూటర్లకే డిప్యూటీ ఫ్లోర్​ లీడర్​ పదులు ఇచ్చారని విమర్శించిన సంగతి విదితమే.

'కేసీఆర్​పై రేవంత్​ వ్యాఖ్యలు సరికాదు - బీఆర్​ఎస్​ మనుగడ కొనసాగాలంటే కేసీఆర్​ అసెంబ్లీకి రావాలి'

నేనూ ముఖ్యమంత్రిని అవుతా - అందరి బండారాలు బయటపెడతా : ఎమ్మెల్సీ కవిత