ETV Bharat / state

సైబర్​ మోసాల బాధితుల్లో మనమే టాప్​ - రోజుకు 75 సైబర్‌ నేరాలు

ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ కేసులు 73,624 - కేవలం తెలంగాణలోనే 29.86% ఆర్థిక నేరాలు నమోదైనట్లు వెల్లడిస్తున్న గణాంకాలు - స్పష్టంచేసిన జాతీయ నేర నమోదు సంస్థ నివేదిక

Cyber Frauds Telangana
Cyber Frauds Telangana (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : June 29, 2026 at 8:48 AM IST

3 Min Read
Choose ETV Bharat

Cyber Frauds Telangana : ఒకరు రూ.కోటి గెలిచారు అని ఆశపెట్టి లింక్​ క్లిక్​ చేయమంటారు. మరొకరు స్టాక్​ మార్కెట్​ పెట్టుబడులంటూ ఆశ చూపుతారు. ఇంకొకరు డిజిటల్​ అరెస్టు పేరిటి ఖాతా ఖాళీ చేస్తారు. ఇలా పేరు ఏదైనా చేసేది మోసమే. ఈ తరహా ఆన్​లైన్​ మోసాలు దేశంలో నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒక సంవత్సర కాలంలో నమోదైన సైబర్‌ నేరాల్లో ఆర్థిక మోసాల కోణంలో జరిగినవి 73,624 కేసులు. వాటిలో ఒక్క తెలంగాణలోనే నమోదైన కేసుల సంఖ్య 21,987. అంటే కేవలం మన రాష్ట్రంలోనే 29.86% ఆర్థిక నేరాలు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇటీవల విడుదలైన జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తాజా నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

మయన్మార్, కంబోడియా, లావోస్‌ దేశాల్లో అడ్డాలు ఏర్పరచుకొని మోసగిస్తున్న చైనా ముఠాలతో పాటు ఉత్తరాది సైబర్‌ నేరస్థుల కన్ను తెలంగాణపై పడింది. దీంతో గత నాలుగు సంవత్సరాలుగా ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు పోగొట్టుకునే బాధితుల సంఖ్య మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఉంది.

రోజుకు 75 సైబర్‌ నేరాలు : 2024లో దేశవ్యాప్తంగా మొత్తం 1,01,118 సైబర్‌ నేరాలు నమోదయ్యాయి. కాగా తెలంగాణలో వాటి సంఖ్య 27,230. అంటే తెలంగాణ వాటానే 27%గా నమోదయింది. రాష్ట్రంలో రోజుకు సగటున 75 సైబర్‌ నేరాల కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇదే తరహాలో కర్ణాటకలో 21,993 కేసులు నమోదై రెండోస్థానంలో నిలిచింది. సైబర్‌ నేరాల్లో ఆర్థిక మోసాల బారిన పడుతున్న బాధితుల్లో తెలంగాణ వాసులు దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

క్రైమ్‌రేట్‌ ఏకంగా 71.1 : ఒకవైపు సైబర్‌ నేరగాళ్ల ముఠాలు తెలంగాణ వాసుల్నే లక్ష్యంగా చేసుకొని ఆర్థిక దోపిడీకి పాల్పడుతుంటే మరోవైపు అభియోగాల నమోదు రేటు అధమ స్థానంలో ఉండటం విస్తుగొలుపుతోంది. జనాభా ఆధారంగా రాష్ట్రంలో క్రైమ్‌రేట్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఏకంగా 71.1గా నమోదు అయింది. రెండోస్థానంలో ఉన్న కర్ణాటకలో అది 32.2. దేశవ్యాప్త సగటు 7.4 మాత్రమే ఉంది.

పోలీస్‌శాఖ వాదన మరోలా : అయితే రాష్ట్రంలో సైబర్‌ నేరాల తీవ్రత విషయంలో పోలీస్‌శాఖ వాదన మరోలా వినిపిస్తోంది. తమకు అందుతున్న ప్రతీ ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తుండటంతోనే కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోందని పోలీసులు చెబుతున్నారు. ఏదేమైనా కేసుల నమోదులో ప్రథమ స్థానంలో ఉన్న తెలంగాణ పోలీసులు అభియోగపత్రాల నమోదు రేటులో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నట్లు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. రాష్ట్రంలో ఈ సగటు కేవలం 16.2 కాగా దేశవ్యాప్త సగటు ఏకంగా 31.6గా నమోదయింది.

నేరగాళ్లకు చిక్కకుండా ఈ జాగ్రత్తలు పాటించండి : సైబర్‌ నేరాల్లో ఆర్థికమోసాలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. స్టాక్‌మార్కెట్‌ ట్రేడింగ్‌ పేరిట సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలు నమ్మి ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడులు పెట్టొద్దని హెచ్చరిస్తున్నారు. వాట్సప్, ఫేస్‌బుక్‌లకు వచ్చే లింకుల్ని క్లిక్‌ చేసి మోసపోవద్దని చెబుతున్నారు. ఇలాంటి లింక్​ల ద్వారా ఏపీకే ఫైళ్లు మన ఫోన్​లో ఇన్​స్టాల్​ అయి మన సమాచారాన్ని నేరగాళ్లకు సేకరిస్తారని వెల్లడిస్తున్నారు.

డిజిటల్‌ అరెస్ట్‌ అనేది ఉండదు : సీబీఐ, ఈడీలాంటి దర్యాప్తు సంస్థల ముసుగు వేసుకున్న మోసగాళ్లు ‘డిజిటల్‌ అరెస్ట్‌’ అంటూ ఆన్‌లైన్‌లో బెదిరింపులకు పాల్పడుతున్నారు. అలాంటి బెదిరింపులకు భయపడి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును బదిలీ చేయొద్దని సూచిస్తున్నారు. అసలు డిజిటల్‌ అరెస్ట్‌ అనేది ఉండదని స్పష్టం చేస్తున్నారు. సామాజిక మాధ్యమ ఖాతాలకు తెలిసిన వ్యక్తుల నుంచి డబ్బులు పంపాలంటూ రిక్వెస్ట్‌ వచ్చిందంటే అది మోసమే అని గుర్తించాలని చెబుతున్నారు. ఒకవేళ సైబర్‌ నేరగాళ్ల బారిన పడి డబ్బు పోగొట్టుకుంటే వెంటనే1930 నంబరుకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

డిజిటల్​ అరెస్ట్​ నుంచి పెళ్లిపత్రికల వరకు - ఈ సైబర్​ మోసాల గురించి తెలుసుకోవాల్సిందే!

క్రెడిట్ కార్డు బిల్లులతో సైబర్ నేరగాళ్ల కొత్త మోసం-పశ్చిమాసియా సంక్షోభం పేరుతో మరో ఉచ్చు!