కోట్లు వెచ్చించి భవనాల నిర్మాణం - వినియోగంలోకి తేవడంలో అధికారుల జాప్యం
ప్రారంభానికి నోచుకోని సమీకృత మార్కెట్, టౌన్ హాల్, షాదీ ఖానా - మార్కెట్ నిర్మాణం రెండున్నరేళ్లలో పూర్తైన వినియోగంలోకి రాని వైనం - అలంకార ప్రాయంగా మిగిలిన సమీకృత కూరగాయలు, మాంసం మార్కెట్

Published : March 4, 2026 at 10:40 AM IST
Govt Offices in Own Buildings : ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ సొంత భవనాల్లోకి మార్చాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. వేలల్లో, లక్షల్లో చెల్లిస్తున్న అద్దెలను ఆదా చేయడం అందులోని దీని ప్రధాన ఉద్దేశం. కానీ వనపర్తి జిల్లాలో కోట్లు వెచ్చించి ప్రారంభించిన భవనాలను మాత్రం ఇప్పటికీ వినియోగంలోకి తీసుకురాకుండా అధికారులు తీవ్రమైన కాలయాపన చేస్తున్నారు. సమీకృత కూరగాయలు, మాంసం మార్కెట్, ఉర్ధూఘర్, షాదీ ఖానా, టౌన్ హాల్ లాంటివి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తైనా అవి ఇప్పటికీ ఖాళీగా అలంకార ప్రాయంగా మాత్రమే మిగిలిపోతున్నాయి.
వనపర్తి జిల్లా కేంద్రంలోని సమీకృత కూరగాయలు, మాంసం మార్కెట్‌కు సంబంధించిన నిర్మాణం దాదాపు రెండున్నరేళ్లలో పూర్తైంది. ఇప్పటికీ సమీకృత మార్కెట్‌ను వినియోగంలోకి తీసుకురాలేదు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కలిపి అద్దెకు భారీ మొత్తంలో 81 దుకాణాల ఏర్పాటుకు సామర్థ్యం ఉంది. వాటికి అద్దెలు నిర్ణయించి టెండర్లు కూడా పిలిచారు. సుమారు 450 మంది పేర్లు నమోదు చేసుకున్నా, తీసుకోవడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు. విస్తీర్ణాన్ని బట్టి రూ. 3 వేల నుంచి నుంచి మొదలుకొని ఏడువేల వరకు అద్దెలు నిర్ణయించినా ఆ అద్దెలతో దుకాణాలు నడిపేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. అద్దెలు తగ్గించాలని ప్రభుత్వానికి నివేదించినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటి చెబుతోంది.
"కిరాయి ఎక్కువగా ఉండటంతో ప్రజలు వాటిని తీసుకోవడానికి ప్రజలు సుముఖంగా లేరు. కింద ఉండే షాపులకు 3 వేలు, పైన ఉండే దుకాణాలకు 2 వేలు, బాంక్వెట్ హాల్‌కు ఒక రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు అద్దె ప్రాతిపదికన ఇవ్వాలని 5 నెలల క్రితమే తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాం. దీనిపై సరైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి గారు కూడా హామీ ఇచ్చారు" -శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మన్
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తి చేసిన షాధీ ఖానా రూ. 2 కోట్ల 80 లక్షలు వెచ్చించి సకల సదుపాయాలతో నిర్మించారు. వినియోగంలోకి మాత్రం తీసుకురాలేదు. దీంతో షాదీ ఖానా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. తలుపులు, నల్లాలు, ఇతర నిర్మాణ సామాగ్రిని అగంతకులు ఎత్తుకెళ్తున్నారు. బయట ఫంక్షన్ హాళ్లలో వివాహాలు చేసుకోవాలంటే చిన్న హాలుకైనా వేలల్లో అద్దెలు చెల్లించాల్సి ఉంటుంది. నిరుపేదలు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు చేసుకోవడానికి వీలుగా ఆ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరుతున్నారు.
తాళాలు వేసి అలంకార ప్రాయంగా : వనపర్తి పట్టణం నడిబొడ్డున రూ. 5.75 కోట్లతో గతంలోనే టౌన్ హాల్ నిర్మాణం పూర్తైంది. వనపర్తి అంటేనే అనేక కళలకు, కళాకారులకు పెట్టిన పేరు. అలాంటి వాళ్లు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల నిర్వాహణకు వీలుగా పట్టణ ప్రజలకు అందుబాటులో ఓ భవన నిర్మాణం చేపట్టారు. ప్రారంభానికి నోచుకున్నా అది ఇప్పటికీ వినియోగంలోకి రాలేదు. అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి తాళాలు వేసి అలంకార ప్రాయంగా వదిలేశారు. తక్షణం వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
రోజురోజుకు విస్తరిస్తున్న వనపర్తి పట్టణంలో వాహనాల రద్దీని తగ్గించేందుకు బైపాస్ నిర్మాణం, ఐటీ పరిశ్రమల్ని ప్రోత్సహించి ఉద్యోగాలు కల్పించేందుకు ఐటీ పార్కు, పాలిటెక్నిక్ కళశాల భవనాల ఆధునీకరణ, నూతన భవనాల నిర్మాణం ఇలా చాలా పనులు గత ప్రభుత్వ హయాంలో మంజూరైనా ఇప్పటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రయోజనాల దృష్యా కోట్లు రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకురోవాలని స్థానిక ప్రజలు కోరుతన్నారు. ఇప్పటికైనా ఆ దిశగా అడుగులు పడతాయా? లేదా అనేది వేచి చూడాల్సిందే.
పేరుకు మాత్రమే క్రిటికల్ కేర్ - చికిత్సకు మాత్రం దూరం దూరం

