పీజీ వైద్యవిద్య మేనేజ్‌మెంట్‌ట్ కోటాలో 85% సీట్లు స్థానికులకే - రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
పీజీ వైద్యవిద్య సీట్ల భర్తీలో సర్కారు కీలక నిర్ణయం - మేనేజ్‌మెంట్‌ట్ కోటాలోని 85% సీట్లను స్థానికులతోనే భర్తీచేయాలని నిర్ణయం - జీవో తీసుకురానున్న రాష్ట్ర ప్రభుత్వం

Published : November 2, 2025 at 7:45 AM IST
Telangana Govt Key decision on PG Medical Seats : పీజీ వైద్యవిద్య సీట్ల భర్తీలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మేనేజ్‌మెంట్ కోటాలోని 85% సీట్లను స్థానికులతోనే భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. తద్వారా సుమారు 400 సీట్లు అదనంగా రాష్ట్ర విద్యార్థులకు దక్కే అవకాశం ఉంది. నేడో రేపో ఇందుకు సంబంధించిన జీవో విడుదలయ్యే అవకాశం ఉండగా సర్కారు నిర్ణయంపై జూనియర్ వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మేనేజ్‌మెంట్ కోటాలో 85శాతం సీట్లు స్థానికులకే : పీజీ వైద్య విద్య మేనేజ్‌మెంట్ సీట్ల కేటాయింపుపై గత కొంత కాలంగా చర్చ సాగుతోంది. మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో 85శాతం స్థానికులకు కేటాయించాలని వైద్య విద్యార్థులు కోరుతున్నారు. ఆ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వైద్యారోగ్యాశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విన్నవించారు. మేనేజ్‌మెంట్ కోటాలో 85శాతం సీట్లు స్థానికులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు జీవో విడుదల చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వైద్యారోగ్యశాఖ కార్యదర్శిని ఆదేశించారు. నేడో, రేపో జీవో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటి వరకు మేనేజ్‌మెంట్ కోటా సీట్లని ఓపెన్ కేటగిరిలో భర్తీ చేస్తున్నారు. కొత్త నిర్ణయంతో రాష్ట్ర విద్యార్థులకు మేనేజ్‌మెంట్ కోటా కింద అదనంగా 318 సీట్లు దక్కనున్నాయి. మరో 15శాతం అంటే 56 సీట్లు ఓపెన్ కేటగిరిలో ఉంటాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
2025-26 విద్యా సంవత్సరం నుంచి : రాష్ట్రంలో మొత్తం 31 పీజీ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో 12 ప్రభుత్వ, 19 ప్రైవేట్ కళాశాలలు. ప్రభుత్వ కాలేజీల్లో 1472, ప్రైవేట్లో 1511 కలిపి 2983 సీట్లు ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ కాలేజీల్లోని 50 శాతం సీట్లు అలిండియా కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ కాలేజీల్లోని మిగతా 50, ప్రైవేట్ కాలేజీల్లోని 50 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రైవేట్ కాలేజీల్లోని మిగతా 50శాతం అంటే 741 పీజీ మెడికల్ సీట్లు మేనేజ్‌మెంట్ కోటాలో భర్తీ చేస్తారు. అయితే వాటిలో 374 సీట్లు మేనేజ్‌మెంట్ కోటా -1 కిందకి వస్తాయి. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఆ మొత్తం సీట్లలో 85శాతం సీట్లు రాష్ట్ర విద్యార్థులతోనే మేనేజ్‌మెంట్ కోటాలో భర్తీ చేయాల్సి ఉంటుంది. అంటే 318 సీట్లు అదనంగా రాష్ట్ర విద్యార్థులకు దక్కనున్నాయి.
ఓపెన్ కెటగిరిలో కేవలం 56 సీట్లే : కేవలం 56 సీట్లని మాత్రమే ఓపెన్ కేటగిరిలో భర్తీ చేయాల్సి ఉంటుంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానాన్ని అమలు చేయాలని సర్కారు భావిస్తోంది. వైద్య విద్య పీజీ మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి సంబంధించిన జీవో నేడో రేపో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీజూడా(తెలంగాణ జూనియర్ డాక్టర్లు) హర్షం వ్యక్తం చేస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
వైద్య విద్య థియరీ పరీక్షల్లోనూ కుమ్మక్కు? - MBBSలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు లీక్!
వైద్య విద్యార్థులకు చేదు అనుభవాలు - సీనియర్ల పైశాచికత్వంతో నరకం చూస్తున్న జూనియర్లు!

