ETV Bharat / state

ఫ్యూచర్‌ సిటీ తెలంగాణ పేరుతో కొత్త వెబ్‌సైట్‌ - సమస్త సమాచారం అరచేతిలోనే

సరికొత్త వెబ్‌సైట్‌ రూపొందిస్తున్న సర్కారు - ఆన్‌లైన్‌లోనే అనుమతులిచ్చేలా సన్నాహాలు - ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ పేరుతో వెబ్‌సైట్‌ ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు

bharat Future City website
Future City Telangana Website (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : January 11, 2026 at 7:13 PM IST

3 Min Read
Choose ETV Bharat

Future City Telangana Website : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీకి సరి కొత్త వెబ్‌సైట్‌ను అధికారులు రూపొందిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు వీలైనంత వేగంగా ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ పేరుతో వెబ్‌సైట్‌ ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఐటీశాఖలోని ఓ విభాగానికి ఈ పనిని అప్పగించారు.

ప్రాజెక్టుల సమగ్ర వివరాలు : జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్ల తరహాలోనే ఈ ఫ్యూచర్ సిటీ పోర్టల్‌ ఉండనుంది. ఫ్యూచర్‌ సిటీకి సంబంధించిన సమస్త సమాచారం ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులు దీని ద్వారా తెలుసుకునేందుకు సులభమైన పద్దతిలో వీలుంటుంది. ప్రస్తుతానికి ఫ్యూచర్‌ సిటీ తెలంగాణ పేరుతో ఒక వెబ్‌సైట్‌ మాత్రం అందుబాటులో ఉంచారు. ఇందులో రకరకాల ప్రాజెక్టుల సమగ్ర వివరాలున్నాయి.

32 గ్రామాల పరిధిలో భారీ విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీ : రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేట్, బేగరికంచ గ్రామాల పరిధిలో ఫ్యూచర్​ సిటీ నిర్మాణమవుతోంది. ఇటీవల ఇదే ప్రాంతంలో నిర్వహించిన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌-2047 విజయవంతం కావడంతో నిరంతర అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి. ఐటీ, ఫార్మా సంస్థలతో పాటు గేమింగ్‌ జోన్లు, వినోద కేంద్రాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు.

ఆన్​లైన్​ ద్వారానే అన్నీ రకాల అనుమతులు : తొలిదశలో 32 గ్రామాల పరిధిలో 432 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఫ్యూచర్‌ సిటీ నిర్మించాలని ప్రతిపాదించగా, భవిష్యత్‌ విస్తరణకు అనువుగా 56 గ్రామాలు, 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో నిర్మాణం కానుంది. ఇందులో ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాలు, పరిశ్రమలు, ప్రైవేటు విద్యా సంస్థలు ఏర్పాటుకు అనుమతులు ఇచ్చేందుకు ఆన్‌లైన్‌ ద్వారా అప్లికేషన్లను స్వీకరించనున్నారు.

20 మంది సర్వేయర్లు : ఫ్యూచర్‌సిటీ పరిసర ప్రాంతాల్లో ప్రైవేటు భూములు, పట్టాలు, ప్రభుత్వ భూముల సరిహద్దులను నిర్ణయించేందుకు ప్రత్యేకంగా ఇరవై మంది సర్వేయర్లను ప్రభుత్వం నియమించింది. మీర్‌ఖాన్‌పేటలో ఫ్యూచర్‌సిటీ శాశ్వత భవన కార్యాలయాన్ని ఫిబ్రవరి నెలాఖరులోపు ప్రారంభించేందుకు అధికార వర్గాలు సన్నాహాలు చేస్తున్నారు. ఫ్యూచర్‌సిటీకి సంబంధించి కీలక అంశాలను ప్రశ్నలు, సమాధానాల రూపంలో ఫ్యూచర్‌సిటీ తెలంగాణ పోర్టల్‌లో అందులో ఉంచారు. ఇందులో ఇళ్ల నిర్మాణాలు, ప్లాట్ల క్రయవిక్రయాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. ప్రాజెక్టుపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు వెబ్‌సైట్‌లో ప్రశ్నలు-సమాధానాలు (FAQs) డిపార్ట్​మెంట్​ను కూడా ఏర్పాటు చేశారు.

భారత్​ ఫ్యూచర్​ సిటీలో డిస్ట్రిక్ట్​ కూలింగ్​ విధానం : భారత్​ ఫ్యూచర్​ సిటీలో డిస్ట్రిక్ట్​ కూలింగ్​ విధానం (డీసీఎస్​) అమలులోకి తేనున్నారు. ఏసీ లేకుండానే చల్లబర్చే డీసీఎస్​ను కొత్తగా నిర్మించే నగరాలు, టౌన్​షిప్పులు, మాల్స్​లో ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు. తెలంగాణలో మొదటగా ఫ్యూచర్​సిటీలో అమలుకు సర్కారు వివిధ ప్రణాళికలు సైతం సిద్ధం చేసింది. ఇటీవల తెలంగాణ విజన్​ 2047 డాక్యుమెంట్​లో దీని గురించి ప్రకటన సైతం చేశారు.

ఈ ఫ్యూచర్​ సిటీలో సెంట్రల్​ బిజినెస్​ డిస్ట్రిక్ట్​(సీబీడీ) అత్యంత కీలకం కానుంది. సీబీడీని క్రమంగా పలు జోన్లుగా అభివృద్ధి చేస్తారు. ఇందులో 300 ఎకరాల్లో ఏఐ సిటీ, 200 ఎకరాల్లో హెల్త్​ సిటీ, 500 ఎకరాలను ఎడ్యుకేషన్​ హబ్​గా మారుస్తారు. 3 వేల ఎకరాల్లో లైఫ్​ సైన్సెస్​ హబ్​ను డెవలప్​ చేయనున్నారు. ఇక్కడ డిస్ట్రిక్ట్​ కూలింగ్​ విధానాన్నే అమలు చేయనున్నారు. గుజరాత్​లోని గిఫ్ట్ ​సిటీలో డిస్ట్రిక్ట్​ కూలింగ్ విధానాన్నే వాడుతున్నారు. అలానే రాష్ట్రంలోని పోచారంలో ఇన్ఫోసిస్​, ఐటీ కారిడార్​లోని ఒక గేటెట్​ కమ్యూనిటీలో ఈ తరహాలోనే కూలింగ్​ సిస్టమ్​ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు అధునాతమైన డీసీఎస్​ను సిటీకి ప్రభుత్వం పరిచయం చేయనుంది.

ఫ్యూచర్​ సిటీలో 11 పర్యావరణ మిత్ర టౌన్​షిప్​లు - ఏసీలు లేకుండానే అంతా కూల్​ కూల్​

గ్లోబల్ సమిట్ ఎఫెక్ట్ : ఆ ప్రాంతాల్లో హాట్​కేకుల్లా ప్రైవేట్ లే-అవుట్లు - ప్రభుత్వ భూముల రక్షణకు కార్యాచరణ