ETV Bharat / state

కమిషన్ వేసే అధికారం ప్రభుత్వానికి ఉంది - కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టులో సర్కారు

ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ సుదర్శన్‌ రెడ్డి - జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటులో ఎలాంటి దురుద్దేశాలు లేవు - ముందస్తు ప్రణాళికలు ఏమీ లేవని ప్రభుత్వం స్పష్టీకరణ

HC on PC Ghose Commission Report
HC on PC Ghose Commission Report (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 4, 2026 at 8:18 AM IST

3 Min Read
Choose ETV Bharat

HC on PC Ghose Commission Report : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బ్యారేజీల నిర్మాణంతోపాటు మేడిగడ్డ కూలిపోవడానికి సంబంధించి బాధ్యులను గుర్తించడానికి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటులో ఎలాంటి దురుద్దేశాలుగానీ ముందస్తు ప్రణాళికలుగానీ ఏమీ లేవని ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. కమిషన్ అఫ్ ఎంక్వరీస్ చట్టం ప్రకారం కమిషన్ వేసే అధికారం ప్రభుత్వానికి ఉందని ఈ అధికారం కింద జీవో నంబర్‌ 6ను జారీ చేసినట్లు పేర్కొంది.

అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌ రెడ్డి వాదనలు : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణల్లో జరిగిన అవకతవకలపై విచారణ నిమిత్తం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ నియామకాన్ని వ్యతిరేకిస్తూ కేసీఆర్​, హరీశ్‌ రావు, ఐఏఎస్​ అధికారిణి స్మితా సభర్వాల్, మాజీ ఐఏఎస్​ ఎస్​కే జోషి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ కొనసాగుతోంది. మంగళవారం ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌ రెడ్డి వాదనలు వినిపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంతోపాటు మేడిగడ్డ కూలిపోవడానికి సంబంధించి బాధ్యులను గుర్తించడానికి జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటులో ఎలాంటి దురుద్దేశాలుగానీ, ముందస్తు ప్రణాళికలుగానీ ఏమీ లేవని ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది.

జీవో నంబర్‌ 6ను జారీ : మేడిగడ్డ కుంగిపోయిన నేపథ్యంలో ప్రజాప్రయోజనాల్లో భాగంగానే కమిషన్ నియామకం జరిగిందని తెలిపింది. కమిషన్ అఫ్ ఎంక్వరీస్ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం కమిషన్ వేసే అధికారం ప్రభుత్వానికి ఉందని ఈ అధికారం కింద జీవో నంబర్‌ 6ను జారీ చేసినట్లు పేర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏలేరు కమిషన్ ఏర్పాటును సుప్రీం కోర్టు కూడా సమర్థించిందన్నారు. కమిషన్ ఏర్పాటు విధివిధానాల ప్రకారం నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టిందన్నారు. అందువల్ల ప్రజాప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని సుదర్శన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

అధిక వడ్డి భారం ప్రభుత్వంపై : మేడిగడ్డ కుంగిపోయిన నేపథ్యంలో ఎన్​డీఎస్​ఏ పరిశీలించి నివేదిక సమర్పించిందని ఇందులో బ్యారేజీ నిర్మాణంలో సరైన డిజైన్ లేదని నిర్మాణం, నిర్వహణలో లోపాలు, నిర్లక్ష్యం ఉందని నివేదిక ఇచ్చిందని ప్రభుత్వం వాదించింది. కాగ్ నివేదికలతోపాటు ప్రభుత్వ రికార్డుల ఆధారంగానే ప్రజాధనం వృథా, అధికార దుర్వినియోగం జరిగిందని విచారణ నిమిత్తం కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. ప్రాణహిత - చేవెళ్ల పథకాన్ని పునరాకృతితో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టుబడి గిట్టుబాటు కాదని కాగ్ తన నివేదికల్లో వెల్లడించిందని ఏజీ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌కు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పలేదని ప్రభుత్వమే బడ్జెట్ నుంచి కేటాయించాల్సి వస్తోందని, దీని వల్ల వడ్డీ భారం అధికంగా ప్రభుత్వంపై పడుతోందని వెల్లడించిందన్నారు.

విచారణను వాయిదా వేసిన ధర్మాసనం : సరైన ప్రణాళిక లేకుండా చేపట్టిన పనుల వల్ల దీర్ఘకాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇది ప్రభావం చూపుతుందని కాగ్ ఆందోళన వ్యక్తం చేసిందని ఏజీ అన్నారు. కాళేశ్వరం నిర్మాణం చేపట్టడంతో అదనంగా 5 వేల 643 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం పెరిగిందని, దీనివల్ల ఏటా కోట్ల రూపాయల విద్యుత్తు ఛార్జీలు పెరిగాయని కోర్టుకు తెలిపారు. సీడబ్ల్యూసీ కి సమర్పించిన రూ. 81 వేల 911.01 కోట్ల ప్రాజెక్టు వ్యయం రూ. 1.47 వేల 427 కోట్లకు పెరిగిందని అంటే ఎకరాకు రూ. 8.12 లక్షల పెట్టుబడి పెట్టినట్లయిందని పేర్కొందన్నారు. పెట్టుబడికి తగ్గ ఆదాయం వ్యవసాయం ద్వారా రావడంలేదని ఏజీ సుదర్శన్‌ రెడ్డి పేర్కొందన్నారు. విద్యుత్తు వినియోగం కూడా ఎక్కువ కావడంతో ఇది రాష్ట్రంపై అదనపు భారం పడుతుందని కాగ్ తెలిపిందన్నారు. వాదనలు పూర్తి కాకపోవడంతో ధర్మాసనం విచారణను ఈనెల 5కు వాయిదా వేసింది.

కాళేశ్వరం ప్రాజెక్టుపై అధిక మోజు చూపి, పాలమూరును నిర్లక్ష్యం చేశారు : మంత్రి ఉత్తమ్‌

'ఎలాంటి డిజైన్ ఖరారు కాకుండానే కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేపట్టింది'